- వంతెనల్లేవు.. వసతుల్లేవు..
- మూడు రోజుల పాదయాత్రతో వినిపించిన గిరిజన గుండెచప్పుడు
- యాపాగూడెం నుండి నిర్మల్ వరకు 75 కిలోమీటర్ల పాదయాత్ర
- సమస్యల పరిష్కారానికి సీపీఎం రాష్ట్ర నేత పోతినేని సుదర్శన్ డిమాండ్
Development in the ‘Pembi’ forest is a cry for help : రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు చెబుతున్నప్పటికీ నిర్మల్ జిల్లాలోని ‘పెంబి’ మండలంలోని గిరిజన గూడాల్లో మాత్రం ఇంకా అంధకారమే రాజ్యమేలుతోంది. మౌలిక సదుపాయాలు లేవు. కనీస తాగునీరు, రవాణా సౌకర్యాల కోసం గిరిజనులు పడుతున్న అగచాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి సిపిఎం పిలుపునిచ్చిన మూడు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. యాపాగూడెం నుండి నిర్మల్ వరకు సాగిన ఈ 75 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
Development in the ‘Pembi’ forest is a cry for help
పాదయాత్ర ముగింపు సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ పెంబి మండలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ముఖ్యంగా దోత్తి వాగు, కడం వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి విలవిలలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులగంపండ్రి నుండి సిరిచల్మా వరకు తక్షణమే రహదారి నిర్మించాలని, పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గృహ నిర్మాణాలకు అడ్డంకిగా మారిన అటవీ శాఖ అనుమతులను తక్షణమే ఇప్పించాలని కోరారు. అన్ని గ్రామాలకు త్రీ-ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్‌ను నియమించి, అంగన్వాడి, ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ విఫలమైన చోట అదనపు బోరింగ్లు ఏర్పాటు చేసి, సోలార్ నీటి వ్యవస్థలను పునరుద్ధరించాలన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమస్యల పరంపర కనిపించిందని, పిజిటిజీ గిరిజనుల ఇళ్లను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైందని తెలిపారు. వరద ముప్పు ఉన్న ఈ గ్రామాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని కోరారు. పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని, తక్షణమే నియామకాలు చేపట్టాలన్నారు. చాకిరేవులో సోలార్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి తాగునీటి కోసం జనం అల్లాడుతున్న పరిస్థితిని సీపీఎం నేతలు ఎత్తిచూపారు.
Development in the ‘Pembi’ forest is a cry for help
ఈ సమస్యలు ప్రజల ప్రాథమిక హక్కులని, వీటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, ప్రజానాట్యమండలి నేత కట్ట నరసింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
