Revanth Reddy wears a necklace of light around his neck : వెలుగు మట్ల ఇప్పుడు చీకటైంది. రాజ్యం కన్నెర్ర చేసింది. ఫలితంగా పేదల ఇండ్లు నేలమట్ట మయ్యాయి. వినోభావే నవోదయ నగరం 900 ఇండ్ల శిధిలాలతో మౌనంగా రోదిస్తోంది. బుల్డోజర్ రాజ్ రాక్షస కృత్యాలతో పేదల స్వప్నాలు గాల్లో కలిసిపోయాయి. సొంతింటి కలలు కన్నీరుగా మారాయి. ప్రభుత్వంలోని పెద్దలకు తెలియకుండా వేలమంది పోలీసు బలగాల మధ్య బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేసే సావాసం అధికారులు చేసి ఉండరు. ఇది ఒకరిద్దరి అధికారులు, ప్రజా ప్రతినిధుల అనాలోచిత నిర్ణయం. అది ఎవరూ చేసినా ఇప్పుడు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే.
ఇండ్ల కూల్చివేత ఘటన దావనంలా వ్యాపించింది, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి అందరి నోటా వినిపిస్తుంది. జాతీయ స్థాయిలోనూ చర్చకు దారి తీసింది. మొత్తంగా తెలంగాణ సర్కార్ బుల్డోజర్ రాజ్ ల వ్యవహరించింది. వెలుగుమట్ల ఘటన రేవంత్ రెడ్డి మెడలో హారంగా తళుక్కుమంటుంది. కేంద్రంలోని మోడీ – అమిత్ షా నమూనా పరిపాలనని రాష్ట్రంలో అమలు చేయటం వివాదాస్పదంగా మారింది. వారం క్రితం ఖమ్మం జిల్లా.. ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగు మట్ల (వినోబా నవోదయ గ్రామాన్ని) ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా నేలమట్టం చేసింది. పేదల పట్ల కర్కశంగా వ్యవహరించిన అమానవీయ ప్రవర్తన ఇది. ఈ ఘటనలో హక్కులు కోల్పోయిన నిరుపేదలకి అంబేద్కర్, టీటీడీసీ భవనాలు తాత్కాలిక నివాస కేంద్రాలయ్యాయి. నిరాశ్రయులైన వీరికి ప్రభుత్వం నుంచి ఆహారం, నీళ్లు, మౌలిక వసతులు తిరస్కరించబడ్డాయి. స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, విపక్ష పార్టీలు ఆహారాన్ని, నీళ్లు సమకూర్చుతున్నాయి. ఆ పేదల బాధలు వర్ణాతీతం. ప్రభుత్వం భోజనాలు, కనీస వసతులు కల్పించకపోవడం మానవత్వం అనిపించుకోదు, పేదల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామ్యం. అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. పోలీసు నిఘా నీడలో పేదలు బిక్కు బిక్కుమంటున్నారు. పేదలను శత్రువులుగా చూడడం సరికాదు. పరిసర ప్రాంతాల్లో అర్హులకు ఇండ్లు ఇస్తామని, సర్వే జరుగుతుందని ఆ జిల్లాకు చెందిన మంత్రులు చెబుతున్నారు. పేదలను ఇంకా మభ్య పెడుతున్నారు.
Revanth Reddy wears a necklace of light around his neck
2012లో భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ద్వారా సర్వేనెంబర్ 147, 148, 149 లో 62.7ఎకరాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొదట 30 ఎకరాల్లో 909 మందికి 100 గజాల చొప్పున భూమిని కేటాయించారు. ఆ భూమిలో వినోబా నవోదయ కాలనీ నిర్మాణం జరిగింది. దశాబ్ద కాలంగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం నుంచీ ప్రజా ప్రతినిధులు నుంచీ ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ పక్కా భవనాలు నిర్మించుకున్నారు. వారే తలా కొంత డబ్బులు పోగు చేసుకుని కరెంటు ఫోల్స్, బోర్లు వేసుకొని సోలార్ ద్వారా విద్యుత్ నీళ్లు పొందుతున్నారు. ఇది కొందరికి కంటగింపుగా మారింది. సొంతింటి కల నెరవేర్చుకున్న పేదలను గూడు లేని పక్షులను చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. విలువైన భూములను పేరిట అన్యాయంగా ఆ ఇండ్లకు కూల్చివేసింది. భూదాన్ బోర్డు పేదలకు ఇళ్ల స్థలాలిచ్చింది. భూదాన్ చట్ట ప్రకారం ఆ భూమి పేదలకే చెందుతుంది. విలువైన భూములైనంతా మాత్రాన రెవెన్యూ శాఖ ఎలా స్వాధీనం చేసుకుంటుంది. ఇది స్వాధీనం చేసుకుంది సరే.. మిగతా 32 ఎకరాల భూమి ఎవరి చేతుల్లో ఉంది. ఈ భూమిలో గతంలో 2000 మంది పేదలు గుడిసెలు వేసుకుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ గుడిసెలను తొలగించింది. ఇప్పుడు ఆ భూమి కొద్ది మంది తప్పుడు పట్టాలు సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.
Revanth Reddy wears a necklace of light around his neck
దేశంలో మోడీ బుల్డోజర్ రాజ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకు రావడం అత్యంత విషాదం. ఖమ్మం జిల్లాలో ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు బడాబాబులు ఆక్రమించిన భూములు మాత్రం ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన వారి జోలికి వెళ్లకుండా గరీబోళ్ల ఇండ్లను నేలమట్టం చేయడం అమానవీయం. రాష్ట్ర చరిత్రలో వెలుగుమట్ల ఘటన విషాదం, ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డిని జీవితకాలం వెంటాడుతుంది, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గత దశాబ్ద కాలానికి పైగా భూదాన్ భూముల్లో ఇండ్లు నిర్మాణం చేసుకొని బతుకు లీడుస్తున్న పేదల ఇండ్లను కూల్చివేయడం కాంగీ సంస్కృతికి నిదర్శనమా? అనే ప్రశ్నలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా.? అంటున్న పేదలకి ఈ ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాలి. రాత్రికి రాత్రే 900 ఇండ్లను కూల్చివేయడం, పేదలను రోడ్డుపై పడేయడం మానవ హక్కులను ఉల్లంఘన. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నిరుపేదలకి న్యాయం చేయడం లేదు. వారికి చిత్తశుద్ధి లేదనేది జరుగుతున్న పరిణామాలే అందుకు సాక్ష్యం. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని తగలబెట్టిన చందంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని ఈ ఘటన రుజువు చేస్తుంది. నియంతృత్వానికి నిదర్శనం. గడీల పాలనవైపు అడుగులు పడుతున్నాయనేది వాస్తవం. ఇండ్లు కూల్చివేసిన స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. సర్వస్వం కోల్పోయిన నిరుపేదలకు నష్టపరిహారం చెల్లించాలి. మానవీయ కోణంలో స్పందించి, పేదలకు న్యాయం చేసి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకోవాలి.
- మామిండ్ల రమేష్ రాజా రాష్ట్ర కార్యదర్శి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ 7893230218
