Undertrials are ‘invisible’ shackles : ”దేశంలోని జైళ్లు నేరస్థులతో కాదు, ‘నిర్దోషులని’ నిరూపించుకోలేని అభాగ్యులతో కిక్కిరిసిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 75 శాతానికి పైగా ఖైదీలు అండర్ ట్రయల్స్ కావడం మన న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా భావించక తప్పదు. అగ్రరాజ్యం అమెరికాలోనైనా, మన దేశంలోనైనా ఆర్థిక అసమానతలు ఖైదీల భవితవ్యాన్ని శాసిస్తున్నాయనడంలోనూ సందేహం లేదు. ఒక వ్యక్తిపై నేరారోపణ వచ్చినప్పటి నుండి తీర్పు వెలువడే వరకు అతను అనుభవించే కాలాన్ని “అండర్ ట్రయల్” అంటారు. ఈ దశలో ఉన్న ఖైదీల సంఖ్య పెరగడం అనేది న్యాయ వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతుంది. అనేక సందర్బాల్లో అనేక ఘటనల్లో నేరం చేసిన వాడు బెయిల్ మీద బయట తిరుగుతుంటే, ఆరోపణ ఎదుర్కొన్న నిరుపేద మాత్రం విచారణ కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు, ఇఃకా చెప్పాలంటే దశాబ్దాల కాలాన్ని ఇనుప కడ్డీల వెనకే బలి ఇస్తున్న పరిస్థితులు బహిరంగ రహస్యమే. న్యాయశాస్త్రం ప్రకారం “నేరం రుజువయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే.” కానీ దేశంలోని జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీల పరిస్థితి చూస్తే ఇందుకు విరుద్ధంగా ఉందనే విశ్లేషణలున్నాయి. ఒక వ్యక్తి నేరం చేశాడో లేదో తేలకముందే, ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య గడపడం అనేది కేవలం భౌతిక బంధనం మాత్రమే కాదు, అది ఒక మానవ హక్కుల సంక్షోభం.
Undertrials are ‘invisible’ shackles..!?
చాలా సందర్భాలలో పేదరికం, అజ్ఞానం, న్యాయ సాయం అందకపోవడం వల్ల అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలోనే ఉండిపోతున్నారు. చిన్నపాటి నేరారోపణలు ఎదుర్కొంటూ, షూరిటీ సమర్పించలేక లేదా లాయర్లను పెట్టుకోలేక తమ జీవితంలోని విలువైన కాలాన్ని కోల్పోతున్న పరిస్థితులున్నాయి. “న్యాయం ఆలస్యమైతే అది అన్యాయం చేసినట్టే అని చట్టం చెబుతుంది. కానీ, భారత జైళ్లలో నేరం రుజువవ్వకముందే ఏళ్ల తరబడి సంకెళ్ల మధ్య మగ్గుతున్న లక్షలాది మంది అండర్ ట్రయల్ ఖైదీల విషయంలో ఈ సూత్రం తలకిందులవుతోంది. ముందే చెప్పినట్లుగా చేతిలో డబ్బు లేక, చట్టం తెలియక, షూరిటీ ఇచ్చే నాథుడు లేక.. విచారణాధీన ఖైదీగా వారి జీవితంలోని వసంతాలు జైలు చీకట్లలోనే రాలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇదే వేదన వినిపిస్తున్నా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సంస్కరణల కిరణాలు ప్రసరిస్తున్నా, ‘నిర్దోషి’ అన్న ముద్ర కోసం వారు పడుతున్న ఆరాటం ఒక తీరని వేదన.”
Undertrials are ‘invisible’ shackles..!?
ఏదేమైనప్పటికీ ”చట్టం దృష్టిలో నేరం రుజువయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే.. కానీ, దేశంలోని జైలు గోడల వెనుక వినిపిస్తున్న ఆర్తనాదాల్లో 75 శాతం ఆ ‘నిర్దోషులవే’ అనే విశ్లేషణల్లో నిజం లేకపోలేదు అనేది మరువొద్దు. గ్లోబల్ విలేజ్ నుండి తెలంగాణ పల్లె దాకా.. ఒక ఆరోపణ ఎదురవ్వగానే సమాజం వేసే ‘నేరస్తుడి’ ముద్ర, కోర్టు తీర్పు కంటే ముందే వారిని సజీవ సమాధి చేస్తోంది. ఇది కేవలం ఒక అండర్ ట్రయల్ ఖైదీల అనుభవం కాదు, మన న్యాయ వ్యవస్థ ముందున్న ఒక అతిపెద్ద మానవీయ సంక్షోభం”గా చూడాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
