- దేశాయిపేట మాదిగ స్మశానవాటికలో ‘వసతుల కరువు’…
- కడసారి వీడ్కోలుకు తప్పని కష్టాలు…
- నిర్లక్ష్యంపై ఎస్సీల అసంతృప్తి
- తక్షణమే తగు చర్యలు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
Discrimination against our cemetery Negligence : మనిషి పుట్టినప్పుడు పండుగ చేసుకునే సమాజం, మరణించినప్పుడు గౌరవప్రదమైన వీడ్కోలు పలకడం కనీస బాధ్యత. కానీ వరంగల్ నగరం దేశాయిపేటలోని మాదిగల స్మశానవాటిక దుస్థితి చూస్తుంటే ఆ కనీస గౌరవం కూడా దక్కడం లేదని స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని ఎస్సీ సామాజిక వర్గం తమవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి నరకయాతన అనుభవిస్తున్నారనే అభిప్రాయాలు స్థానికంగా వినిపించడం గమనార్హం.
Discrimination against our cemetery Negligence
ప్రస్తుతం ఈ స్మశానవాటికలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొందని, కనీస వసతులు లేకపోవడం వల్ల అంతిమ సంస్కారాలకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రాంత దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతిమ సంస్కారాల అనంతరం స్నానాలు చేయడానికి గానీ, ఇతర అవసరాలకు గానీ కనీసం ఒక్క నీటి ట్యాంకు లేదా నల్లా సౌకర్యం కూడా లేకపోవడమంటే దళితులంటే వివక్షా..? లేకా నిర్లక్ష్యమా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి వేళల్లో ఎవరైనా మరణిస్తే, చీకట్లోనే మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి సర్వసాదరణమేనంటున్నారు. స్మశానవాటిక అంతా తుప్పలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి, కనీసం నడవడానికి కూడా దారి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని దేశాయిపేట దళితులు ఆవేదన చెందుతున్నారు. ఇక వర్షాకాలంలో శవ దహనం చేయడం అనేది అసాధ్యంగా మారింది. వర్షంలో తడుస్తూనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది.
Discrimination against our cemetery Negligence
అధికారుల నిర్లక్ష్యం – ప్రజాప్రతినిధులు మౌనం వీడాలి : స్థానికులు
మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం మౌనం వీడాలని దేశాయిపేటకు చెందిన దళితుడు ఆరేపల్లి ప్రవీణ్ తో పాటు పలువురు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప, పనులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దళిత సంఘాల నాయకులు, పలువురు దేశాయిపేట దళితులు మండిపడుతున్నారు. దళితుల శ్మశానవాటిక పట్ల “నిధులు లేవు” అనే సాకుతో కాలయాపన చేస్తున్నారని, వివక్షతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహంతో ఆరోపణలు చేస్తున్నారు. “చనిపోయిన తర్వాత కూడా మాకు ఈ ఇబ్బందులు తప్పవా..?” అని దేశాయిపేట వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి, వెంటనే తగు చర్యలు చేపట్టాలని, అనేక సమస్యలతో ఆకరిమజిలీకి సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
