Let’s make the public meeting of Telangana activists in Suryapet on January 10 a success దశాబ్దాల పోరాటం, ఎందరో అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచింది. మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానాలను, రెండు లక్షల మంది ఆదివాసులను బలిపీఠం ఎక్కించి సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో ముందుగా బలైంది ఉద్యమకారులే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గోతి కాడి నక్క లాగా కాచుకుని కూర్చున్న కేసీఆర్, మొదట నమ్మించి గొంతు కోసింది దళితులనే. బంగారు తెలంగాణ పేరు మీద బహుజనులను వంచించిన దశాబ్ద దొరల పాలనలో మళ్లీ దగా పడ్డది ఉద్యమకారులే. జీవితాలను పణంగా పెట్టిన ఉద్యమకారులను, వారి సంక్షేమాన్ని విస్మరించి, ప్రశ్నించిన ఉద్యమకారుల పైన ఉక్కు పాదం మోపింది ప్రాంతం వాడే. రైతుల చేతులకు బేడీలు వేసింది,ఆదివాసి మహిళలను చెట్లకు కట్టేసింది, ప్రొఫెసర్ కోదండరాం సార్ ఇంటి తలుపులు బద్దలు కొట్టింది, విమలక్క అరుణోదయ ఆఫీసుకు తాళం వేసింది, మందకృష్ణ మాదిగను నిర్బంధించింది, తెలంగాణ బిడ్డలు తంగెళ్ల శృతి, సాగర్, వివేక్ లను పొట్టన బెట్టుకుంది ఈ కాపలా కుక్కనే. నేరేళ్ల నేరాన్ని, దళితుల మీద దాడులను, మహిళలపై అత్యాచారాలను ఖండించినందుకు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు వ్యతిరేకించినందుకు, ఉద్యోగల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ సమస్య పై ప్రశ్నించిన విద్యార్థి ఉద్యమకారులు కంచర్ల బద్రి, కోట శ్రీనివాస్, చార్వాక, దామెర రాజేందర్, లాంటి ఎంతోమందిపై అక్రమ ‘ఉపా’ కేసులను బనాయించి, జైళ్ళలో తోసింది గత కేసీఆర్ ప్రభుత్వం.
విలువైన భూములను, వనరులను దిగమింగి, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి, అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో తోసేసి ఫామ్ హౌస్కు పరిమితమైయుండు పాత సీఎం కేసీఆర్. సీమాంద్ర దోపిడీ, పీడన ఆధిపత్యాన్ని నిరసించి, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో స్వేచ్ఛ వాయువులను పిలిచాలని కలలుగన్న ఎంతోమంది ఉద్యమకారుల ఆశలు ఆవిరైపోయాయి. మళ్లీ నిర్బంధంలో నుంచి నిర్బంధంలోకి, చీకట్లో నుంచి మరింత గాఢాంధకారంలోకి వారి జీవితాలు నెట్టబడడం తట్టుకోలేక ఇప్పటికే వందలాది మంది ఉద్యమకారుల ఊపిరి ఆగిపోయింది. తెలంగాణ నేలపైన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గానం తో పాటు కవులు, కళాకారుల గొంతు మూగబోయింది. స్వరాష్ట్రంలో సైతం దగాపడ్డ ఉద్యమకారులకు హస్తం గుర్తు ఆపన్న నేస్తం అనిపించింది. ప్రజా పాలన పేరు చెప్పి పాత సీఎంను ఉతికి ఆరేసి, చీరీచింతకు కట్టుతనన్న రేవంత్ రెడ్డి మాటలు ఉద్యమకారులకు కాస్త ఊరటనిచ్చాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాదు మేము ఇచ్చింది అంటూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజలకు దగ్గర అయింది. విజన్ 2050 ని ప్రకటించిన రేవంత్ రెడ్డి సరూర్నగర్ సభ సాక్షిగా యూత్ డిక్లరేషన్ ప్రకటించి, ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవంతో పాటు
ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవంతో పాటు 250 గజాల ఇంటి స్థలం ఇస్తానని వాగ్దానం చేశాడు. తెలంగాణ ఉద్యమకారుల సలహాలు, సూచనలు పాటిస్తాను, పాలనలో భాగం చేస్తాను అంటూ భరోసానీచ్చాడు. 2లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నాడు. నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యమకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించిన తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి గెలుపులో కీలక భూమిక పోషించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులది కూడా ఒకటి అయినప్పటికీ ఏదో కంటి తుడుపు చర్యగా దరఖాస్తు ఫారంలో ఉద్యమకారుల కాలం చేర్చారు. కానీ, నేటికీ ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టి, అర్హులకు లబ్ది చేకూరుతుందని ఆశించిన ఉద్యమకారులకు నిరాశే ఎదురయింది. ప్రభుత్వం ఏర్పాటయి రెండు సంవత్సరాలు గడిచిన, నేటికీ ఉద్యమకారుల అంశం పైన ఎలాంటి చర్య తీసుకోవడం లేదు.
Let’s make the public meeting of Telangana activists in Suryapet on January 10 a success
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన అన్ని రంగాల్లో కోసాంద్ర వలసవాదుల ఆధిపత్యాన్ని రద్దు చేయడం, భూముల పంపిణీ, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు , సహజ సంపదల పరిరక్షణ, సామాజిక న్యాయం, వ్యవసాయ అభివృద్ధి, వికేంద్రీకృత పారిశ్రామిక విధానం , చేతివృత్తుల అభివృద్ధి , విద్యా ప్రజాస్వామీకరణ, పాలనలో పారదర్శకత, శాంతి – ప్రజాస్వామ్యం – ఆత్మగౌరవం, తెలంగాణ సాంస్కృతిక వైభవం, భాష , యాస, సంస్కృతుల అభివృద్ధి, ఆత్మహత్యలు , ఆకలి చావులు, వలసలు, హత్యలు, అత్యాచారాలు లేని ప్రజాభివృద్ధిని సాధించే మానవీయ సమానత విలువలు, పౌర ప్రజాస్వామిక హక్కులు గల ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన తెలంగాణ అమరులు మారోజు వీరన్న, బెల్లి లలితక్క ,ఆకుల భూమన్న , ప్రజా యుద్ధ నౌక గద్దరన్న లాంటి ఎంతోమంది అమరుల స్వప్నం కలగానే మిగిలింది.పైగా వారి నాయకత్వంలో జరిగిన సూర్యపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ , భువనగిరి సభల్లో లక్షలాది తెలంగాణ ప్రజల మధ్య ఆమోదించుకున్న తీర్మానాలను, ప్రజా ఆకాంక్షలను మరిచిపోయి, అమరుల త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు. నేటికి తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభం నుండి బయటపడలేదు. గత పది ఏళ్లలో పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాలేశ్వరం లాంటి నీటి ప్రాజెక్టులలో జరిగిన లక్షల కోట్ల అవినీతి పై విచారణ ముందుకు పోవడం లేదు. మూతపడిన పరిశ్రమలు ఒక్కటి తెరవలేదు. సూక్ష్మ,చిన్న ,మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. బొగ్గు ,ఇనుము,గ్రానైట్,ఇసుక లూటీ ఎదేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. 1/70 యాక్టు, పెస, అటవీ హక్కుల చట్టాలు అమలు కావడం లేదు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ నిర్మూలన అనేది ఒక రాజకీయ వికృత క్రీడగా మారింది. అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణలో 55 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరికీ నాణ్యమైన, ఒకే రకమైన ఉచిత విద్య అందిస్తామన్న పాలకులు, విద్యారంగంలో 70 శాతం ప్రైవేటీకరణను కొనసాగిస్తూ, విద్యను వ్యాపారంగా మార్చారు. వైద్యరంగంలో వలసవాదులతో పాటు బహుళ జాతి కంపెనీలు చొరబడ్డాయి. గత దశాబ్ద కాలంగా నడిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దారిలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు, మలిదశ తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన నేల సూర్యపేట సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధనకై జనవరి10న ఉద్యమకారుల మహాసభను విజయవంతం చేయాలంటూ మరో పోరాటానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.
సంక్షేమ బోర్డుతో పాటు మరికొన్ని ఉద్యమకారుల ఆకాంక్షలు
1) తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలి.
2) తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.
3) మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మందిలో గత ప్రభుత్వం కొందరికి సహాయం చేయగా, మిగిలిన ఉద్యమకారుల కుటుంబాలకు 10 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, ఇవ్వాలి. తొలిదశ ఉద్యమకారుల కుటుంబాలకు సైతం ఆర్థిక, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇవ్వాలి.
4) తెలంగాణ ఉద్యమకారులపై మోపిన అన్ని రకాల అక్రమ కేసులు, కెసిఆర్ దశబ్ద పాలనలో పెట్టిన ఉపా కేసులతో సహా బేశరతుగా ఎత్తివేయాలి.
5.అమర వీరుల స్మృతి వనం 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్ ముందున్న అమరజ్యోతి మ్యూజియం ను అధికారికంగా ప్రారంభించి, సందర్శకులకు అనుమతిని ఇవ్వాలి.
6) తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమ అమరులకు స్మారక భవనం నిర్మించాలి (అస్సాంలోని కోక్రాచార్ లో అమరవీరుల స్థూపాల వలె కట్టాలి).
7) ఉద్యమకారుల, అమరుల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులను జారీ చేసి, ఈఎస్ఐ సౌకర్యం తో పాటు ఉచిత బస్సు పాసులు అందజేయాలి.
8) ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలలో విద్యా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మొదటి ప్రాధాన్యతనిస్తూ రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
9) ఉద్యమ సమయంలో ఉద్యమకారులు ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు. కనుక, వారికి 50 శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల రుణాలు వ్యాపార నిమిత్తం ఆర్థిక సహాయం ప్రభుత్వమే నేరుగా అందించాలి.
10) తెలంగాణ ఉద్యమ కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు గౌరవ వేతనాన్ని అందించాలి. సాంస్కృతిక పాలసీని ప్రకటించాలి.
11) తెలంగాణ అమరవీరుల చరిత్రను, తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి.
వ్యాసకర్త :
కంచర్ల బద్రి TUJAC అధికార ప్రతినిధి, రీసెర్చ్ స్కాలర్, ఓయు సెల్ : 7995824555
