- 27 గ్రూపులు.. లెక్కలేనన్ని ప్రశ్నలు..!
- మహాలక్ష్మి వీవో సంఘంలో ఆర్థిక అవకతవకల ఫిర్యాదులు.. అధికారుల తనిఖీలు
- నగదు లావాదేవీలపై ఆరా..!
- సభ్యుల వాంగ్మూలాల నమోదు.. రికార్డుల సేకరణ
- సమావేశాలు, తీర్మానాలు లేకుండా జీతాల పేరుతో నగదు డ్రా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
Who is accountable for women’s money..? మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఎక్కడ..? సభ్యుల ఆమోదం లేకుండా నగదు డ్రాలు జరిగాయా..? సమావేశాలు నిర్వహించకుండానే జీతాల పేరుతో నిధులు తీసుకున్నారా..? హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలోని మహాలక్ష్మి వీవో సంఘంలో అవకతవకలు జరిగాయంటూ అందిన ఫిర్యాదులు ఇప్పుడు ఈ ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మాందారిపేట గ్రామంలోని మహాలక్ష్మి వీవో సంఘం పరిధిలో ఉన్న 27 గ్రూపుల రికార్డులను శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు. నగదు లావాదేవీలు, సంఘాల నిర్వహణ, సమావేశాల వివరాలు, సంబంధిత రికార్డులను తనిఖీ చేసి డేటాను సేకరించారు. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై సభ్యుల నుంచి వాంగ్మూలాలు సైతం నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మహిళా సంఘాల లావాదేవీల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి లావాదేవీకి సంబంధించి సంఘ సమావేశాలు నిర్వహించి, సభ్యుల ఆమోదం తీసుకోవడంతో పాటు సంతకాలు సేకరించాలని సూచించారు. సంఘ సమావేశం నిర్వహించకుండా, సభ్యుల తీర్మానం లేకుండా జీతాల పేరుతో సీఏలు (కమ్యూనిటీ యానిమేటర్లు) నగదు డ్రా చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. తనిఖీల్లో అక్రమాలు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
- అధికారుల తనిఖీలతోనే బాధ్యత తీరిపోతుందా..?
అయితే 27 గ్రూపుల స్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన వ్యవస్థ ఇంతకాలం ఏం చేసింది..? సభ్యుల తీర్మానాలు లేకుండా నగదు డ్రాలు జరిగాయనే ఆరోపణలు ఉంటే వాటిని గతంలోనే ఎందుకు గుర్తించలేకపోయారు..? సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది..?
ముఖ్యంగా నగదు లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు తేలితే కేవలం డబ్బులు డ్రా చేసిన వారిపైనే కాకుండా, వాటిని పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా నిర్ధారిస్తారా..? సభ్యుల వాంగ్మూలాలు, రికార్డుల పరిశీలన ఆధారంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేస్తారా..? నిధుల దుర్వినియోగం జరిగితే తిరిగి రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? మహిళల పొదుపు, పరస్పర సహకారం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఏర్పడిన సంఘాల్లో ఆర్థిక పారదర్శకత అత్యంత కీలకం. అందువల్ల ఈ తనిఖీలు కేవలం రికార్డుల పరిశీలనకే పరిమితం కాకుండా, ప్రతి రూపాయి లావాదేవీపై స్పష్టతనిచ్చే సమగ్ర విచారణగా మారాల్సిన అవసరం ఉంది. 27 గ్రూపుల సభ్యులకు న్యాయం జరగాలంటే విచారణ నివేదికను బహిర్గతం చేసి, ఆరోపణలపై తేల్చిన వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా అధికారులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, ఏపీఓ హరికృష్ణ, మల్లేశం, మహిళా సంఘాల సభ్యులు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
