‘Kalekuri Prasad’ a firecracker born from wounds : తెలుగు సాహితీ ఆకాశంలో దళిత, బహుజన స్పృహను, విప్లవ చైతన్యాన్ని ఒకేసారి రగిలించిన అరుదైన అగ్నికణం కలేకూరి ప్రసాద్. సమాజంలో వేరూనుకున్న కుల వివక్షను, వర్గ దోపిడీని అణగారిన వర్గాల వైపు నిలబడి ప్రశ్నించిన అక్షర యోధుడు ఆయన. కలేకూరి కేవలం డెస్క్ దగ్గర కూర్చుని చల్లని గదిలో కవిత్వం రాసిన కవి కాదు; సమాజపు పచ్చి గాయాల నుంచి, వీధి పోరాటాల ఉత్సాహం నుంచి, పీడితుల ఆక్రోశం నుంచి తన అక్షరాలను ప్రసవించిన ప్రజా కవి. ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన వదిలివెళ్లిన పాటలు నేటికీ సామాజిక అన్యాయాలపై పోరాడే ప్రతి ఒక్కరికీ నిత్య ప్రేరణగా, దిక్సూచిగా నిలుస్తున్నాయి. అందువల్లనే, కలేకూరి ప్రసాద్ వర్ధంతి అనేది కేవలం ఒక స్మరణ దినం కాదు; ఆయన ఎలుగెత్తిన సామాజిక న్యాయ నినాదాన్ని, సమసమాజ స్వప్నాన్ని పునరంకితం చేసుకునే ఒక గొప్ప చారిత్రక సందర్భం.
‘Kalekuri Prasad’, a firecracker born from wounds
కలేకూరి ప్రసాద్ సాహిత్యం నిరంతరం పీడిత ప్రజల పక్షాన్నే నిలిచింది. కారంచేడు (1985), చుండూరు (1991) లాంటి దళిత నరమేధాలు జరిగినప్పుడు తెలుగు సమాజపు మనస్సాక్షిని ఆయన తీవ్రంగా కుదిపేశారు. ఆ రక్తపాతం సృష్టించిన వేదన, ఆక్రోశం ఆయన కవిత్వంలో నిప్పుకణికలై కురిశాయి. చుండూరులో దళితులను వేటాడి, చంపి, గోనె సంచుల్లో మూటగట్టి తుంగభద్ర కాలువలో పడేసిన అమానుషత్వాన్ని చూసి ఆయన కలం రక్తం కక్కింది. ఆ సందర్భంలో ఆయన రాసిన చారిత్రాత్మక కవితా పంక్తులు ”భూమి పుత్రుడనైన నన్ను నిలువునా పూడ్చిపెట్టినా…నేను మళ్లీ మొలకెత్తుతాను…
నన్ను విత్తనంగా నాటినందుకు కృతజ్ఞతలు!”
ఈ పంక్తులు కేవలం కవిత్వం కాదు, శతాబ్దాల అణచివేతపై దళిత ఆత్మగౌరవం ప్రకటించిన అజేయమైన సవాలు. “పిడికెడు ఆత్మగౌరవం కోసం” అంటూ సాగిన ఆయన ప్రసంగాలు, విశ్లేషణలు అణగారిన వర్గాలలో నూతన ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
‘Kalekuri Prasad’, a firecracker born from wounds
కలేకూరి ప్రసాద్ రాసిన గీతాల్లో అత్యంత ప్రజాదరణ పొంది, వ్యవస్థ పునాదులను కదిలించిన పాట “కర్తవ్యమా… నా దేశమా… ఎటు నీ పయనం?”. ఈ ఒక్క పాట భారతదేశంలోని సామాజిక, రాజకీయ వైరుధ్యాలను నిలువునా చీల్చి చూపించింది. బాబ్రీ మసీదు కూల్చివేత, సామ్రాజ్యవాద ఆర్థిక విధానాల ప్రవేశం, పెరుగుతున్న కుల అహంకారాల నేపథ్యంలో దేశాన్ని హెచ్చరిస్తూ ఆయన ఈ పాటను సృష్టించారు.
”దళిత గుండెల మీద దండు వెడలిన నాడు
గిరిజన గూడేలు తగలబడిపోతుంటే
మతం పేరిట మనుషుల తలలు నరుకుతుంటే
ఓ దేశమా… నీ దేశభక్తి ఎక్కడ దాక్కుంది..?” అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. దేశభక్తి అంటే సరిహద్దుల చుట్టూ గీసే గీతలు కాదు, దేశంలోని మనుషుల ప్రాణాలు, వారి ఆత్మగౌరవం అని ఆయన చాటిచెప్పారు. విప్లవ భావజాలానికి దళిత ఆత్మగౌరవ అజెండాను జోడించి, ఒక కొత్త సామాజిక సాహితీ ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు.
’Kalekuri Prasad’, a firecracker born from wounds
కలేకూరి ప్రసాద్ గొప్పతనం ఆయన రాసిన అక్షరాల్లో మాత్రమే లేదు, ఆయన నడిచిన ‘ఆచరణ’లో కూడా ఉంది. ఆయన ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో, ఆ సిద్ధాంతం లాగే జీవించారు. బూనస్ ఐరిస్ (అర్జెంటీనా) లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ దళిత సమస్యలపై ప్రసంగించే స్థాయి మేధావి అయినప్పటికీ, ఆయన ఎన్నడూ హోదాల కోసమో, ధనం కోసమో ప్రాకులాడలేదు. లౌకిక సుఖాలను, సురక్షితమైన జీవితాన్ని కాలదన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడిగా, దళిత మహాసభ మేధావిగా ఆయన క్షేత్రస్థాయిలో అహర్నిశలూ శ్రమించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కలేకూరి ప్రత్యక్షమయ్యేవారు. బాధితుల గుడిసెలలో ఉంటూ, వారితో కలిసి గంజి తాగుతూ పోరాటాలు నిర్మించారు. ఒక మేధావిగా అనువాదాలు, రచనల ద్వారా సంపాదించగలిగే ఆర్థిక వెసులుబాటు ఉన్నా, వాటన్నింటినీ వదిలేసి ఒక సంచారిలా, ప్రజా హక్కుల కోసం వీధుల్లోనే బతికారు. అక్షరానికి, ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని తుడిచేస్తూ తన జీవితాన్నే ఒక ఉద్యమంగా మార్చుకున్న అరుదైన త్యాగశీలి ఆయన.
‘Kalekuri Prasad’, a firecracker born from wounds
నేటి సమకాలీన సమాజానికి కలేకూరి ప్రసాద్ ఆలోచనల అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం మనం సాంకేతికంగా, ఆర్థికంగా, డిజిటల్‌గా ఎంతో ముందుకు వెళ్తున్నామని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ, సామాజికంగా ఇంకా ఎక్కడో వెనుకబాటుతనం, వివక్ష రూపాంతరాలు చెందుతూనే ఉన్నాయి. నిన్నటి భౌతిక దాడులు ఇవాళ డిజిటల్ అణచివేతగా, నయా ఫాసిజంగా, కార్పొరేట్ దోపిడీగా రూపు మారుతున్నాయి. రాజ్య వ్యవస్థలు పౌర హక్కులను కాలరాస్తున్న తరుణంలో నిశ్శబ్దంగా ఉండటం క్రిమినల్ నేరమని, హక్కుల కోసం నిర్భయంగా పోరాడాలని కలేకూరి జీవితం, సాహిత్యం మనకు నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాయి.
‘Kalekuri Prasad’, a firecracker born from wounds
కలేకూరి ప్రసాద్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సామాజిక ఉద్యమం. ఒక ప్రవాహం. పదవులకు, ప్రలోభాలకు లొంగిపోకుండా, పీడితుల పక్షాన నిలబడి చివరి శ్వాస వరకు రాజీలేని పోరాట జీవితాన్ని గడిపిన సార్థక జీవి ఆయన. ఆయన భౌతిక నిష్క్రమణ సాహితీ లోకానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటే అయినా, ఆయన సృష్టించిన అక్షర భాండాగారం, ఆయన చూపిన ఆచరణ మార్గం అమరమైనవి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ ప్రజాకవికి నివాళులర్పించడం అంటే… కేవలం ఆయన స్మృతులను నెమరువేసుకోవడం కాదు. ఆయన కలలుగన్న వివక్ష లేని, కుల నిర్మూలనా సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా, ఆయన చూపిన ఆచరణాత్మక బాటలో క్షేత్రస్థాయిలో పోరాడటమే. ఆయన రగిల్చిన చైతన్య దీప్తి పీడిత హృదయాలలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది..!
– రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
