‘దుశ్చర్ల సత్యనారాయణ’పై దాడి – ఒక సామాజిక విషాదం
The conflict between the forest and hunger
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో పర్యావరణ రక్షకుడు ‘దుశ్చర్ల సత్యనారాయణ’పై జరిగిన దాడి కేవలం ఒక భౌతిక దాడి కాదు, అది మన సామాజిక అట్టడుగు వర్గాల మధ్య నెలకొన్న అవగాహనా రాహిత్యానికి, వనరుల వినియోగంలో, రక్షణలో ఉన్న వైరుధ్యానికి పరాకాష్ఠ. ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ అధ్యక్షునిగా, ఒక జర్నలిస్టుగా ఈ ఘటనను కేవలం దాడి ఘటనగానో “నేరం – శిక్ష” కోణంలో కాకుండా, సామాజిక, పర్యావరణ కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న.
The conflict between the forest and hunger
ఈ ఘటనలో ఒకవైపు 70 ఎకరాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న పర్యావరణవేత్త ఉంటే, మరోవైపు తమ గొర్రెల మేత కోసం పరితపించే సామాన్య గొర్రెల కాపరులు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది…పర్యావరణ పరిరక్షణకూ, సామాజిక జీవనోపాధికీ మధ్య జరగాల్సిన సమన్వయం లోపించింది అనేది. దుశ్చర్ల సత్యనారాయణకు ఆ అడవి ఒక పవిత్ర క్షేత్రం. ఒక్కొక్క మొక్కను బిడ్డలా సాకారు. పశువులు అడవిలోకి వస్తే చిన్న మొక్కలు, ఔషధ గుణాలున్న పొదలు నాశనమవుతాయి. ఇది ఆయన దశాబ్దాల తపస్సును బుగ్గిపాలు చేయడమే అవుతుంది. ఇక ఆ చెట్లను నరికే చర్యలను అడ్డుకోవటం సహజమే. గొర్రెల కాపరుల కోణంలో చూస్తే సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు పచ్చని గడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్లడం ఒక సహజాత ప్రవృత్తి. అయితే, “సొంత భూమి – పరాయి భూమి”, “పర్యావరణం – మేత” అనే విభజన రేఖను వారు గుర్తించలేకపోవడం ఒక సామాజిక వైఫల్యం. దాడికి పాల్పడిన వారు సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు కావడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. ప్రకృతిని ఎక్కువగా నమ్ముకుని బతికేది ఈ వర్గాలే. కానీ, అదే ప్రకృతిని శాస్త్రీయంగా కాపాడుతున్న ఒక వ్యక్తిని వారు తమ ‘శత్రువు’గా భావించడం సమాజంలోని కమ్యూనికేషన్ గ్యాప్‌ను సూచిస్తోంది.
ఒక సామాజిక వర్గంగా గొర్రెల కాపరులకు అడవి విలువ తెలియకపోవడం మన విద్యా వ్యవస్థ, సామాజిక చైతన్య కార్యక్రమాల వైఫల్యమే. తమ పశువులకు గాలిని, నీటిని ఇచ్చేది ఆ అడవే అన్న స్పృహ ఉంటే.. వారు కర్రలతో ఆ పర్యావరణవేత్తపై దాడి చేసేవారు కాదు, గొడ్డళ్ళతో ఆ అడవిలోని చెట్లను నరికేందుకు సిద్దపడేవారు కాదు. పైగా ఆయన్ని గౌరవించేవారు.
The conflict between the forest and hunger
అయితే ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్యను కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిలా కాకుండా, గ్రామాల్లో పర్యావరణవేత్తలకు, పశుపోషకులకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే దిశగా చూడాలి. గ్రామాల చుట్టూ ఉండాల్సిన ‘గోచర భూములు’ కనుమరుగవ్వడం వల్లే గొర్రెల కాపరులు ఇలాంటి అటవీ క్షేత్రాలపై పడుతున్నారు. పర్యావరణ కార్యకర్తలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి ప్రభుత్వం భద్రత కల్పించడమే కాకుండా, వారి కృషిని స్థానిక ప్రజలకు వివరించి, ప్రజలను కూడా ఆ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలి.
ఇక్కడ మరో అంశాన్ని కూడా చెప్పదల్చున్నదేమిటంటే
గుట్టల రక్షణ, అక్రమ మైనింగ్ వ్యతిరేక పోరాటాల్లో ముందు వరుసలో ఉంంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్టలను పిండి చేస్తున్న స్టోన్ క్రషర్ల అక్రమాలను ప్రశ్నించడం నుంచి, పర్యావరణ చట్టాలను అమలు చేయాలని కోరే వరకు ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ శక్తిమేరకు తమ గళం వినిపిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్లు డాంబర్ ప్లాంట్ల వల్ల ప్రకృతితో పాటు స్థానిక వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మైనింగ్ వల్ల వచ్చే ధూళి పొలాలపై పేరుకుపోయి పంట దిగుబడి పడిపోతోంది. పేలుళ్ల వల్ల భూగర్భ జలాలు దిగజారి బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. గుట్టలు కరిగిపోవడం వల్ల గొర్రెల కాపరులకు మేత మైదానాలు, గీత కార్మికులకు తాటి వనాలు, ఇతర గ్రామీణ వృత్తుల వారికి జీవనోపాధి తగ్గిపోతున్న పరిస్థితి. డాంబర్ ప్లాంట్లు, క్రషర్ల నుంచి వచ్చే కాలుష్యం వల్ల గ్రామాల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితిని ఆయా ప్రాంతాల్లో ప్రజలు అవగాహనా చేసుకోకుండా ఆలోచించకపోవటం వల్లనే
రాఘవాపురంలో గొర్రెల కాపరులు సత్యనారాయణపై దాడి ఘటన లాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉంటుంది.
The conflict between the forest and hunger
“మీ ఆకలికి కారణం ఈ పర్యావరణ వేత్తలే” అని అబద్ధపు ప్రచారాలు చేసి, స్థానిక ప్రజలనే పర్యావరణ ప్రేమికులపైకి ఉసిగొల్పే ప్రమాదం ఉంది. ఈ రోజు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి రేపు మరెంతో మంది పర్యావరణ కార్యకర్తలపై జరుగదనే గ్యారెంటీ లేదు. మైనింగ్ మాఫియాకు సపోర్ట్ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండి, ప్రకృతి రక్షణ కోసం మాట్లాడే వారిపై ఇలాంటి దాడులకు ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు”. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు, కూలీలు, రైతులు, వివిధ వృత్తుల వారు, యావత్తు ప్రజలు గమనించాల్సింది ఒక్కటే.. మిమ్మల్ని రెచ్చగొట్టి పర్యావరణ వేత్తలపై దాడులు చేయించే వారు మీ బతుకులను బాగు చేయరు. మీ పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని ఇచ్చేది ఆ గుట్టలు, అడవులే. ఆ సహజ వనరులను కాపాడే వారు మీకు శత్రువులు కాదు, మిత్రులు అని గమనించాలి. అందుకే, పర్యావరణ రక్షణ కోసం పోరాడే వారికి అండగా నిలవాలి.
The conflict between the forest and hunger
ఏదేమైనప్పటికీ దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి రేపటి తరం పీల్చే ప్రాణవాయువుపై జరిగిన దాడిగా చూడక తప్పదు. ఈ దాడిని ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక వ్యక్తికి తగిలిన గాయం కాదు, ప్రకృతి సంరక్షణ అనే ఆశయానికి తగిలిన గాయం. దాడి చేసిన వారు సామాజికంగా వెనుకబడిన వారని మనం వారిని ఉపేక్షించలేం, అలాగని వారి ఆకలిని విస్మరించలేం. కానీ, చట్టాన్ని గౌరవించడం, ప్రకృతిని కాపాడే వారిని పూజించకపోయినా పర్వాలేదు కానీ హింసించకూడదు అనే కనీస స్పృహను కల్పించడంలో మనమంతా విఫలమయ్యాం. పోలీసు చర్యలతో పాటు, రాఘవాపురంలో ఒక సామాజిక చైతన్య యజ్ఞం జరగాలి. అనేక చోట్ల ప్రకృతి, పర్యావరణ రక్షణ కోసం, సహజ వనరుల పరిరక్షణ కోసం మాట్లాడుతున్న వారికి అటు చట్టం, ఇటు ప్రజలు రక్షణగా నిలువాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా)
editor in chief jananirnayam2022@gmail.com
