తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్
An ‘Agricultural Knowledge Center’ should be established in Parakala : హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ కేంద్రంలో వెంటనే కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పరకాల పట్టణంలోని అమరధామంలో తెలంగాణ రైతు సంఘం, రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిడి శ్రీనివాస్, రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికల కిషన్ రావు మాట్లాడుతూ, పరకాల డివిజన్ పరిధిలోని శాయంపేట, రేగొండ, మొగుళ్ళపల్లి, నడికూడ వంటి మండలాల్లో సుమారు 120 గ్రామాల రైతులు సాగులో వచ్చే సమస్యల పరిష్కారం కోసం వరంగల్ లోని RARS వరకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరకాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు శాస్త్రీయ సలహాలు, సూచనలు త్వరితగతిన అందుతాయని వారు పేర్కొన్నారు.
An ‘Agricultural Knowledge Center’ should be established in Parakala
కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి నడికూడతో పాటు ఇతర మండలాల్లో పుష్కలంగా అందుబాటులో ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రాంత రైతులు వైవిధ్యమైన పంటలు పండిస్తారని, వారికి క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాకు కేటాయించిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని పరకాలలోనే నిర్మించేలా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఊరటి అంశాలరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సోమిడి సాంబయ్య, గూడ సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
