Let’s welcome the Maoists : కేంద్ర ప్రభుత్వం” కగార్ ఆపరేషన్ “ప్రారంభించిన తర్వాత మావోయిస్టు పార్టీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తిని చివరకు సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి (దేవుజీ), మల్లా రాజిరెడ్డి, దామోదర్( బడే చొక్కారావ్) తదితరులు ఆయుధాలు విసర్జించి 24 ఫిబ్రవరి 2026న లొంగిపోవడంతో దేశంలో ఐదు దశాబ్దాలపైగా ఉనికిలో ఉన్న నక్సలైట్ మూమెంట్ దాదాపు అంతరించింది. దశాబ్దాల తరబడి అనేక కష్టనష్టాలు భరించి, ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి ,తాము నమ్మిన సిద్ధాంతాల కోసం కృషి చేసి బయటకు వస్తున్న మావోయిస్టులను స్వాగతిద్దాం .ఆదరిద్దాం. గౌరవిద్దాం. త్యాగపూరిత జీవితాలు కలిగిన ఈ నాయకులు ప్రజల మధ్యలో ఉండి, ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో వామపక్ష ప్రత్యామ్నాయన్ని పటిష్ట పరచటానికి తోడ్పడతారని ఆశిద్దాం. అది సమాజానికి పురోగమనానికి ఎంతో తోడ్పడుతుంది. ప్రజలకు ఎంతో ప్రయోజనకరమవుతుంది .
Let’s welcome the Maoists
మావోయిస్టులు ప్రాణాలు పోతాయని భయపడో లేదా అనారోగ్యం వలననో బయటికి వస్తున్నారనేది సరైనది కాదు. వారు ఇంతకాలం కొనసాగించిన పోరాటాన్ని కొనసాగించలేమని భావించి రాజ్యాంగబద్ధంగా పోరాటాలు అవసరమని తమ పంధాని మార్చుకొని బయటకొస్తున్నారు. మావోయిస్టు పార్టీ 2024 ఆగస్టులోనే సాయుధ పోరాటాన్ని విసర్జించి, చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాల కు సిద్ధపడాలని నిర్ణయించుకున్నది. నెలల తరబడి ఆ పార్టీ అంతరంగికంగా చర్చోప చర్చలు చేసి,తాము ఆయుధాలు సహితం వదిలి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నామని 2025 ఏప్రిల్ లోనే మావోయిస్టు పార్టీ నిర్ణయానికి వచ్చింది .నంబాల కేశవరావు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం జరిగిందని,ఆ పార్టీలోని కొందరి వ్యతిరేకతతో నిర్ణయాన్ని అమలు జరపటంలో జాప్యం జరిగిందని వారి లేఖల ద్వారా తెలుస్తుంది .దానితో ప్రభుత్వానికి మావోయిస్టులతో చర్చలు తిరస్కరించడానికి ఒక మంచి సాకు దొరికినట్లయింది .పౌరసంఘాలు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేసినా, ప్రభుత్వం మొండిగా నిరాకరించింది. దండకారణ్యం అంతా క్యాంపులు పెట్టడం ద్వారా తాజాపరచబడ్డ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రవాణా సౌకర్యాలని అందుబాటులోకి తెచ్చుకొని అడివినంత జల్లడ పట్టింది .చివరికి నిరాయుధులుగా దొరికిన వారిని, లొంగిపోయిన మావోయిస్టుల ను సైతం బూటకపు ఎన్కౌంటర్లో కాల్చివేసింది. వేలాదిమంది అరెస్టు కావటం లొంగి పోవటం జరిగింది .మావోయిస్టు పార్టీ చిందరవందర మై తీవ్ర నష్టాలకు గురైంది. శాంతి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించినట్లయితే అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యమకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడబడేవి.
Let’s welcome the Maoists
కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత మావోయిస్టు పార్టీ మే 21, 2025న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని కోల్పోయింది. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు హిడ్మా, సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, గాజర్ల రవి, పాక హనుమంతు, అనల్దా తదితర ముఖ్య నాయకులను కోల్పోయింది. ఆ పార్టీలో ముఖ్య నాయకులుగా వున్న మల్లోజుల వేణుగోపాలరావు, తక్కళ్ళపల్లి వాసుదేవరావు, రేణుక ,ఆజాద్, చంద్రన్న, సంజీవ్,కంకణాల రాజిరెడ్డి, బర్సే దేవా తదితర ముఖ్యులు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా కష్టనష్టాలకోర్చి, ప్రాణాలను తృణప్రాయంగా భావించి పనిచేశారు . దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలితానివ్వదని అనుభవం నుండి నేర్చుకుని బయటకు వచ్చారు.
మల్లోజుల వేణుగోపాల్ రావు తాను విడుదల చేసిన 22 పేజీల లేఖలో తనకున్న సైద్ధాంతిక విభేదాలను వివరిస్తూ అనేక విషయాలు చెప్పాడు . ఆయనకి ఎంతో కాలం నుండి పార్టీ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నట్లు ,అవి పార్టీలో ఎప్పటికప్పుడు చర్చకు పెడుతున్నట్టు అర్థం అవుతుంది .అదే విధంగా తక్కలపల్లి వాసుదేవరావు తాను సుదీర్ఘంగా ఇచ్చిన వీడియోలో దీర్ఘ కాలిక సాయుధ పోరాటానికి దేశ పరిస్థితులు అనుకూలంగా లేవని, మారిన పరిస్థితులను అనుసరించి ప్రస్తుత పంధాను మార్చుకోవాలని ,ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నికల్లో సైతం పాల్గొనాలని చెప్పారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే ఆయుధాలు విసర్జించి బయటకు వచ్చినవారు చెప్తున్నారు.
Let’s welcome the Maoists
సాయుధ పోరాట సమర్థకులు గా ఉన్నామనుకొనే కొంతమంది ఆ విధానం సరిపడక బయటికి వచ్చిన వారిని ద్రోహులుగా ముద్రలు వేసి అవమానపరుస్తూ ప్రచారం చేశారు .ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన దాని బదులు వారిని విమర్శించటం పరిస్థితిని సంక్లిష్టం చేసింది.
దశాబ్దాల తరబడి అజ్ఞాతంలో ఉండి బయటకు వస్తున్న వారిని నిందించటం విజ్ఞత అనిపించుకోదు . ఏ అనివార్యమైన పరిస్థితుల్లో బయటికి వస్తున్నారో అర్థం చేసుకోవాలి. వారి గౌరవానికి భంగం కలిగించే ఏ పని చేయొద్దు. ఆ విధంగా చేసి వారి త్యాగాలను వృధా కానివ్వకూడదు. కమ్యూనిష్టు వ్యతిరేక శక్తుల్లాగా వారిని ద్రోహులని, ప్రజా వ్యతిరేకులని ముద్రలు వేయడం అన్యాయం. బాధ్యతారాహిత్యం.
Let’s welcome the Maoists
సాధారణంగా కమ్యూనిష్టుల త్యాగాలను ఎవరు శంకించరు.కమ్యూనిష్టులంటే కోరి,కొని కష్టాలు తెచ్చుకొనే వారని ఏమాత్రం విజ్ఞత వున్నవారైన చెప్తారు.సమాజంలో నిజాయితి పరులతో నిండిన పార్టీలేవైనా వున్నాయంటే అవి కమ్యూనిష్టు పార్టీలని ఒప్పుకోని వారుండరు. అదేమిటోకాని కమ్యూనిష్టు పార్టీల నాయకుల పై మరో కమ్యూనిష్టుపార్టీకి చెందిన వారు దుష్పచారం చేసినట్లు ,నిందలు వేసినట్లు చివరకు పచ్చికమ్యూనిష్టు వ్యతిరేక బూర్జువా,భూస్వామ్య పార్టీలకి చెందిన వారు సహితం చేసుండరని చరిత్ర చెబుతుంది. తోటి కామ్రేడ్స్ కొరకు తమప్రాణాలను పణంగా పెట్టుకున్నవారే పార్టీల సిద్ధాంతాల మీదనో, ఎత్తుగడలమీదనో భేదాభిప్రాయాలు రాగానే భిన్నించిన వారిపై నీచమైన ప్రచారం చేయడం సర్వసాధారణమై పోతుంది.అవి చిలికి చిలికి గాలి వానగా మారి చివరకు భౌతికంగా నిర్మూలించుకొన్న ఘటనలు చరిత్ర లో ఉన్నాయి.
Let’s welcome the Maoists
100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆధిపత్యకుల సంపన్న వర్గాల సనాతన సిద్ధాంతమైన ఆర్ఎస్ఎస్ ఈరోజు అధికారంలోకి రాగలిగితే, దేశ పురోగతి కొరకు సమాజాభివృద్ధి కొరకు పేద ప్రజల సంక్షేమం కొరకు వంద సంవత్సరాల నాడే పుట్టిన కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడిపోవటం కమ్యూనిస్టు అభిమానులందరిని కలవరపరుస్తుంది. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలతో చీలిక పేలికలైన కమ్యూనిస్టులందరూ కలవాలని ఒకే గొడుకు కిందికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణమే కమ్యూనిస్టుల పునరేకి కరణ జరగకపోయినా కనీస కార్యక్రమంతో ఒక కూటమిగా నైనా ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన మావోయిస్టులందరూ కూడా ఈ విషయాలను సీరియస్ గా ఆలోచించి ప్రజలు కోరుకుంటున్న వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయటానికి తోడ్పడుతారని ఆశిద్దాం.
జి రాములు గౌరవ అధ్యక్షులు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (Tpsk) ఫోన్ : 9490098006
