A ‘legal’ attack on nature : ప్రస్తుత సమాజంలో ఒక వింత ధోరణి కనిపిస్తోంది. ఒక సామాన్యుడు అడవిలో ఒక చెట్టు నరికితే అది నేరం.. అదే ఒక బహుళజాతి కంపెనీ వేల ఎకరాల అడవిని గనుల కోసం చదును చేస్తే అది ‘దేశాభివృద్ధి’. ఒక పేదవాడు చెరువు కట్టపై గుడిసె వేసుకుంటే అది ‘కబ్జా’.. అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరువును పూడ్చి వెంచర్ వేస్తే అది ‘అనుమతులున్న లేఅవుట్’. ఈ ద్వంద్వ ప్రమాణాలే ప్రకృతిపై జరుగుతున్న చట్టబద్ధమైన దాడికి నిలువెత్తు సాక్ష్యాలు. అన్యాయమే న్యాయంగా చలామణి అవుతున్న వేళ.. పర్యావరణ విధ్వంసం ఒక వ్యవస్థీకృత నేరంగా మారుతోంది. మనదేశంలో పర్యావరణ చట్టాలు కాగితంపై బలంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ‘సులభతర వాణిజ్యం’ పేరుతో నీరుగారిపోతున్నాయి. ‘పర్యావరణ ప్రభావ అంచనా’ వంటి నివేదికలు క్షేత్రస్థాయి వాస్తవాల కంటే, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయి.
A ‘legal’ attack on nature
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పచ్చదనం పెంచేందుకు ‘హరితహారం’ వంటి భారీ కార్యక్రమాలు చేపట్టినా, మరోవైపు పారిశ్రామిక విస్తరణ పేరుతో జరుగుతున్న విధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. ఫార్మా సిటీలు, ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం సేకరిస్తున్న భూముల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయి. ముఖ్యంగా భూగర్భ జలాలను తోడేస్తున్న ఇసుక మాఫియాకు, అక్రమంగా వెలుస్తున్న వెంచర్లకు అధికార ముద్ర ఉండటం అన్యాయానికి పరాకాష్ట. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ చుట్టుపక్కల మొదలుకొని, ఫార్మా సిటీ వరకు అన్నీ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే నిర్ణయాలే. అభివృద్ధి పేరుతో పచ్చని పొలాలను కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చడం ఇక్కడ ‘న్యాయం’గా పరిగణించబడుతోంది. అంతెందుకు ఉమ్మడి వరంగల్ లో గుట్టలు కనుమరుగయ్యేలా స్టోన్ క్రషర్లు, మైనింగ్ విచ్ఛలవిడిగా సాగుతున్న పరిస్థితి ఉంది. చారిత్రక వరంగల్ నగరానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం చెరువుల గొలుసుకట్టు వ్యవస్థ. కానీ నేడు ఓరుగల్లులో ప్రకృతిపై దాడి విచ్ఛలవిడిగా కొనసాగుతున్నది. భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువుల పరివాహక ప్రాంతాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయంటే ఎవరైనా కాదనగలరా..? అధికార అండతో గుట్టలను మింగే మనుషులున్నారంటే కాదనగలరా..? ఈ ఆక్రమణదారులు, నిర్వాకులు సామాన్యులు కాదు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు కావడంతో, అధికారులు ‘నిబంధనల’ పేరుతో అన్యాయాన్ని సమర్థిస్తున్నారు. దీని పర్యవసానమే ఏమాత్రం వర్షం పడినా వరంగల్ నగరం నీట మునిగిపోవడానికి కారణమవుతుందనే వాస్తవాన్ని కాదంటే ముర్కత్వమే అవుంతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లలో హనుమకొండ జిల్లాలోని శాయంపేట, ఆత్మకూర్ మండలాల్లోని నిబందనలకు విరుద్ధంగా క్రషర్ల నిర్వహణ వల్ల పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి కొండలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఈ చర్యలు ప్రకృతపై దాడిగానే పరిగణించాలి.
A ‘legal’ attack on nature
అయితే ఎక్కడైతే పర్యావరణాన్ని రక్షించాల్సిన అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి వ్యవస్థలు కేవలం ‘స్టాంపులు వేసే యంత్రాలు’గా మారుతాయో, అక్కడ అన్యాయమే న్యాయంగా చలామణి అవుతుంది. బాధితుడైన సామాన్య పౌరుడు గాలి కాలుష్యం వల్లో, కలుషిత నీటి వల్లో జబ్బు పడితే అది ‘దురదృష్టం’ అని సరిపెట్టుకోవాలే తప్ప, ఆ వ్యవస్థను ప్రశ్నించలేని స్థితి నెలకొంది. మనిషి చేసే చట్టాలు బలవంతుడికి అనుకూలంగా మారవచ్చు. కానీ ప్రకృతి చేసే చట్టం ఎప్పుడూ నిష్పక్షపాతంగానే ఉంటుంది. మనం ప్రకృతిపై చేస్తున్న ఈ ‘చట్టబద్ధ దాడి’కి ప్రతిఫలంగా ప్రకృతి ఇచ్చే తీర్పే.. గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, ప్రాణాంతక వైరస్లు. న్యాయం చట్టాల్లో మాత్రమే ఉంటే సరిపోదు, అది ప్రకృతి మనుగడలో కూడా ఉండాలి. అడవిని, నీటిని, గాలిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. అన్యాయమైన ఈ ‘విధ్వంసక అభివృద్ధిని’ ప్రశ్నించకపోతే, రేపటి తరం శ్వాసించే గాలి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
