Will ideology die : చరిత్రలో రాజ్యాలు కూలిపోయాయి. రాజులు మరణించారు. గొప్ప సామ్రాజ్యాలు కాల గర్భంలో కలిసిపోయాయి. కానీ, ఆయా కాలాల్లో పుట్టిన ‘ఆలోచనలు’ లేదా ‘భావజాలాలు’ ‘సిద్ధాంతాలు’ మాత్రం శతాబ్దాల తరబడి సజీవంగానే ఉన్నాయి. అయితే “వ్యక్తులు అంతమైతే భావజాలం నశిస్తుందా..?” అనే ప్రశ్నపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనే సాగుతోంది. ఏ భావజాలమైనా శూన్యం నుండి పుట్టదు. దానికి తగిన సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఇంధనంగా పనిచేస్తాయి. భౌతికమైన వస్తువులకు, శరీరాలకు అంతం ఉంటుంది కానీ, సూక్ష్మ రూపంలో ఉండే ఆలోచనలకు కాల పరిమితి లేదు. ఈ సత్యాన్ని వివిధ ఫిలాసఫీలు అనేకం నిరూపించిన విషయం ప్రపంచ సత్యంగా ఉంది. ఒక విప్లవకారుడిని లేదా ఒక తిరుగుబాటుదారుడిని నిర్బంధించడం లేదా నిర్మూలించడం ద్వారా ఒక భౌతిక పోరాటాన్ని ఆపవచ్చు. కానీ, ఆ వ్యక్తి దేని కోసం పోరాడాడో, ఏ ఆశయంతో ముందుకు సాగాడో ఆ ‘భావం’ మాత్రం సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. చారిత్ర మనకు మిగిల్చిన సాక్ష్యాలను మనం ఏమాత్రం పరిశీలించినా ఈ లోతు అర్థం అవుతుంది.
Will ideology die..!?
అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని భౌతికంగా చంపగలిగారు. కానీ, వారు ప్రతిపాదించిన సమానత్వం, అహింస, స్వేచ్ఛ అనే భావజాలాలను ఎవరూ తుడిచివేయలేకపోయారు. సోక్రటీస్కు విషం ఇచ్చి చంపినప్పుడు, ఆనాటి పాలకులు అతని ఆలోచనలు ఆగిపోతాయని అనుకున్నారు. కానీ సోక్రటీస్ మరణం తర్వాతే అతని భావజాలం ప్రపంచమంతటా విస్తరించింది. ఒక విప్లవకారుడు, లేదా ఒక నిరసనకారుడు, లేదా ఒక తిరుగుబాటు గుంపు, లేదా ఒక భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన తత్వాలు లేదా ఒక భావజాలం, సిద్దాంతం ఒక ఆలోచన కలిగిన మనుషులు, మనుషుల సమూహం భౌతిక రూపం మాత్రమే. భావజాలం అనేది ఒక నిరంతర ప్రవాహంగా ఉంటుందని గ్రహించాలి. అది ఆధ్యాత్మికంగా చూసినా, తాత్వికంగా చూసినా భావజాలం అనేది ఒక శక్తి వంటిది. శక్తిని నాశనం చేయలేము. ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చగలం అంతే.
Will ideology die..!?
అయితే సమాజంలో ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, దానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు భావజాలం పుడుతుంటుంది. అందుకు ఆ వ్యవస్థలోని లోపాలు కారణం అవుతుంటాయి. ఉదాహరణకు తమ భాష, సంస్కృతి, భూమి ప్రమాదంలో ఉన్నాయని ఒక వర్గం భావించినప్పుడు, ఆ వర్గాన్ని రక్షించే సిద్ధాంతం వైపు వారు ఆకర్షితులవుతారు. అది అధ్యాత్మికమైనా, తాత్వికమైనా ఆ భావజాలాన్న, ఆ సిద్ధాంతాన్ని తమదిగా భావిస్తుంటారు. అయితే ఆ వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా వచ్చిన “ప్రతివాదం”, లేదా వ్యక్తులు అంతమైనప్పటికీ లేదా అంతం చేసినప్పటికీ, ఆ వాదప్రతివాదాల ఘర్షణ నుండి ఒక కొత్త “సమన్వయం” అంటే మెరుగైన పాలన వచ్చే వరకు ఆ భావజాలం తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. అంటే భావజాలం చావదు, అది పరిణామం చెందుతుందనేది నగ్నసత్యం. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు కేవలం కొందరికే పరిమితమైనప్పుడు, మెజారిటీ ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుంది. ఈ అసంతృప్తే విప్లవ భావజాలానికి పునాధిగా మారుతుంది. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు మనిషి తన ఉనికి కోసం పోరాడతాడు. “నేను ఉన్నాను, నా హక్కు నాకు కావాలి” అనే ఈ అస్తిత్వ వేదన నుంచే భావజాలం పుడుతుంది. ఈ భావజాల భౌతిక స్వరూపాన్ని ఆయుధాలతో లేదా ఇతర భౌతిక శక్తులతో అణచివేయవచ్చు, కానీ వారి మనసుల్లో నాటుకుపోయిన భావజాలాన్ని ఏ తుపాకీ గుండు కూడా ముక్కలు చేయలేదు. అది ఒక శరీరం వదిలి మరో శరీరాన్ని (శాంతియుత పోరాటం లేదా రాజకీయ రూపం) ధరిస్తుంది తప్ప నశించదు.
Will ideology die..!?
చివరిగా చెప్పాలంటే.. ఒక ఆలోచనను చంపడానికి ఆయుధాలు సరిపోవు, ఆ ఆలోచన అవసరం లేని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం ఒక్కటే సరైన మార్గం. అట్టడుగున ఉన్న వ్యక్తికి ప్రభుత్వం రాజ్యం తనది అని అనిపించినప్పుడు, అతను ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఆలోచించడం మానేస్తాడు. అంటే ఏ భావజాలమైనా ఆ భావజాలం తన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే అది శాంతిస్తుంది. అంతవరకు అది బూడిదలో నిప్పులా, గాలిలో చైతన్యంలా సజీవంగానే ఉంటుంది.
బుద్ధుడు చెప్పినట్లు “దుఃఖం” ఉన్నంత వరకు దాని నుండి విముక్తి పొందే “మార్గం” కోసం వెతుకులాట ఉంటుంది. సమాజంలో దుఃఖం (అణచివేత) ఉన్నంత కాలం, విముక్తిని ప్రబోధించే ఏ భావజాలానికైనా మరణం ఉండదు.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
