- సొంత ఖర్చుతో ఎస్ఆర్ఎస్పీ కాలువను శుద్దిచేసిన శాయంపేట సర్పంచ్ ‘చింతల ఉమా రవిపాల్’
Sarpanch’s ‘Bhagiratha’ effort for farmers రైతుల కళ్ళల్లో ఆ సర్పంచ్ ఆనందాన్ని నింపారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తన బాధ్యతను చాటారు. సాగునీటి కష్టాలను తీర్చేందుకు రైతుల పక్షపాతిగా నిలిచారు శాయంపేట సర్పంచ్ చింతల ఉమా రవిపాల్.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ (SRSP) ఉప కాలువ గత కొంతకాలంగా పిచ్చిమొక్కలతో నిండిపోయి, కాలువగట్టు చెట్లు ఆవరించి కాలువలో పెరిగిన చెట్లు, చెత్తాచెదారం కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో కాలువ పరిహకంలో ఉన్న పొలాలకు నీరు అందక, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితి గమనించిన నూతనంగా ఎన్నికైన శాయంపేట సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ స్పందించారు. అధికారుల అనుమతులు, నిధుల మంజూరు కోసం వేచి చూస్తే పంటలు చేజారిపోతాయని భావించి, తన సొంత డబ్బులతో జేసీబీ (JCB) యంత్రాలను రంగంలోకి దించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, కాలువగట్టులో పెరిగిన చెట్లను, పొదలను తొలగించి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న పిచ్చిమొక్కలను, చెట్లను పూర్తిగా శుభ్రం చేయించారు.కాలువ ద్వారా నీరు సాఫీగా ప్రవహించి పొలాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు.
Sarpanch’s ‘Bhagiratha’ effort for farmers
- రైతుల హర్షాతిరేకాలు
కాలువ ద్వారా నీరు సాఫీగా సాగేలా సర్పంచ్ చేపట్టిన చర్యలతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. “పంటలు ఎండిపోతాయన్న భయంలో ఉన్న తమకు సర్పంచ్ అండగా నిలిచారని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ”రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకోవడం తన బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను.” అని సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ పేర్కొన్నారు.
