- చిన్నకోడెపాక భూదందాలో బయటపడ్డ సరికొత్త లీలలు..
- ‘సంప’ అనే పేరే ఆ ఊళ్లో లేదు..
వేలిముద్ర లేకుండానే ఫైళ్లు క్లియర్ చేసిన అధికారులు..!
A revenue ‘grave’ in Ranganayakamma’s name : కబ్జాదారులకు కాపలాదారులుగా మారిన కొందరు రెవెన్యూ అధికారుల పుణ్యమా అని, గొరి కొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత గాలిలో కలిసిపోయింది. చనిపోయిన వ్యక్తి 18 ఏళ్ల తర్వాత వచ్చి డిజిటల్ సంతకం ఎలా చేసిందంటూ ‘జన నిర్ణయం’ ప్రచురించిన కథనం చర్చానీయాంశం కాగా, ఇప్పుడు అధికారుల బరితెగింపునకు సంబంధించిన మరికొన్ని పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్థానికులను కాదని, అసలు ఉనికిలోనే లేని వ్యక్తుల పేర్లను రికార్డుల్లోకి తెచ్చి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు ఎలా కట్టబెట్టారో ఈ క్రింది వాస్తవాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
A revenue ‘grave’ in Ranganayakamma’s name
ఊళ్లో లేని పేరు.. ఉనికిలో లేని మనుషులు..!
ఈ భూదందాలో అధికారులు, అక్రమార్కులు కలిసి ఆడిన నాటకంలో అసలైన లబ్ధిదారుల పేర్లనే మార్చేశారు. చిన్నకోడెపాక గ్రామానికి చెందిన అసలైన లబ్ధిదారు ఐతరాజు రంగనాయకమ్మ భర్త పేరు రామారావు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ‘పోతురాజు రంగనాయకమ్మ భర్త ‘సంప’ అని సృష్టించారు.
విస్తుపోయే విషయం ఏమిటంటే, ఈ ‘సంప’ అనే పేరు గల వ్యక్తులు అసలు చిన్నకోడెపాక గ్రామంలోనే ఎవరూ లేకపోవడం గమనార్హం. సర్వే నంబర్ 268, 269, 270, 271 లోని 5.24 ఎకరాల భూమిని ఆ ఊరి వ్యక్తి కాని మరో వ్యక్తి పేరు మీదకు అక్రమంగా మార్చేసి పట్టా చేసేశారు.
A revenue ‘grave’ in Ranganayakamma’s name
వేలిముద్ర లేదు, సాక్షులూ లేరు.. ఇదెక్కడి వింత చేష్టలు..?
ఒక భూమిని సదాబైనామ ద్వారా పట్టా చేయాలంటే క్షేత్రస్థాయి విచారణ, సరిహద్దుల గుర్తింపు, సాక్ష్యాలు అత్యంత కీలకం. కానీ ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అత్యంత బరితెగించి వ్యవహరించారు. సదరు 5.24 ఎకరాల భూమి అసలు ఎక్కడ ఉందో క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ ఎంక్వయిరీ) చేయలేదు, దానికి హద్దులు కూడా నిర్ణయించలేదు. అయినా సరే ఓ వ్యక్తి పేరిట పట్టా జారీ అయిపోయింది. పట్టా చేసే ప్రక్రియలో కనీసం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన ఒక్కరంటే ఒక్క స్థానిక వ్యక్తిని కూడా సాక్షిగా పెట్టలేదు. రంగనాయకమ్మ 2008లోనే మరణించిన నేపథ్యంలో, పట్టా చేసే సందర్భంలో ఆమె కనీస వేలిముద్ర కూడా లేకుండానే రెవెన్యూ అధికారులు అత్యంత అక్రమంగా ఫైళ్లు క్లియర్ చేసేశారు. మరణించిన రంగనాయకమ్మ డిజిటల్ సైన్ ఎలా చేసిందనేదే ఇక్కడ ప్రశ్న.
ఈ కుంభకోణంలో మరో చట్టపరమైన లొసుగును గ్రామస్థులు ఎత్తిచూపుతున్నారు. ఐతరాజు రంగనాయకమ్మ 2008లోనే మరణించినప్పటికీ, ఇప్పటివరకు ఆమె వారసులుగా చట్టబద్ధమైన ‘ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్’ ను ఎవ్వరూ తీసుకోలేదు.
చట్టప్రకారం ఈ సర్టిఫికెట్ తీసుకునే అంతవరకు రంగనాయకమ్మ ఆస్తులకు ఎవరూ వారసులు కారని, మరి అలాంటప్పుడు అధికారులు ఈ భూమిని ఏ రికార్డుల ఆధారంగా ఇతరులకు కట్టబెట్టారనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
ఈ వ్యవహారం పట్ల మే 6వ తేదీన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా, మే 17న ఆర్డీఓ గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, “పట్టాలను హోల్డ్‌లో పెడతాం” అని గ్రామస్తులందరి ముందు హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ ఫైళ్లు హోల్డ్‌లోకి వెళ్లలేదు, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరచడం వెనుక అధికారులకు అందిన నజరానా ఎంత అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ అక్రమాలు బట్టబయలైన నేపథ్యంలో చిన్నకోడెపాక గ్రామస్థులు ఉన్నతాధికారులను గట్టిగా నిలదీస్తున్నారు. దొంగ సంతకాలు, తప్పుడు పేర్లతో నిబంధనలకు విరుద్ధంగా సృష్టించిన ఓ వ్యక్తికి చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని, రంగనాయకమ్మ వేలిముద్ర లేకుండా, ఉనికిలో లేని మనుషుల పేర్లతో పట్టాలు జారీ చేసిన ఆనాటి తహసీల్దార్‌ను తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,
పేదల స్థలాలుగా ఉన్న ఈ ప్రభుత్వ భూములను కాపాడి శాశ్వత హద్దులు నిర్ణయించాలని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి చిన్నకోడెపాక గ్రామానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
