ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్బంగా..
”ప్రశ్నించని గొంతుకలు ఉన్న చోట.. సత్యం ఎప్పుడూ శవమే..!”
The news is dying.. Who is burying it..!? ప్రజాస్వామ్యం అనే భవనానికి నాలుగో స్తంభం పత్రికా రంగం. ఆ స్తంభం కూలిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్న వేళ, అక్షరం ఎదుర్కొంటున్న సంక్షోభం మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఉంది. ‘వార్త’ అనేది నేడు సజీవంగా ఉందా..? లేక అధికార, అంగబలాల మధ్య ఊపిరాడక కొట్టుమిట్టాడుతోందా..? అనే ప్రశ్న వేసుకుంటే, వినిపించే సమాధానం హృదయవిదారకం. నిజం చెప్పాలంటే, వార్త మరణిస్తోంది.. దాన్ని పూడ్చిపెట్టడానికి వ్యవస్థలన్నీ పోటీ పడుతున్నాయి.
The news is dying.. Who is burying it..!?
వార్తను సమాధి చేస్తున్న వారిలో మొదటి వరుసలో ఉండేది సహనం లేని ప్రభుత్వాలు. విమర్శను విజ్ఞతతో స్వీకరించాల్సిన పాలకులు, ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గౌరీ లంకేశ్ వంటి పాత్రికేయుల హత్యలు భౌతిక దాడులకు పరాకాష్ట అయితే, ప్రస్తుత కాలంలో జరుగుతున్న డిజిటల్ దాడులు అంతకంటే ప్రమాదకరంగా మారాయి. నిజాలను వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టడం, ‘యుఏపీఏ’ (UAPA) వంటి కఠిన చట్టాలతో వారిని ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచడం, కోర్టుల చుట్టు తిప్పటం, సమాజంలో పలుచన చేయటం నిత్యకృత్యమైంది. పాలస్తీనాలో యుద్ధ భూమి నుంచి వాస్తవాలను ప్రపంచానికి చేరవేస్తున్న విలేకరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం లాంటి పరిస్థితులను చూస్తే అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ ఎలాంటి పరిస్థితిలో ఎంతటి క్లిష్టమైన సంకెళ్లలో ఉందో స్పష్టం అవుతుంది.
The news is dying.. Who is burying it..!?
మరోవైపు, మీడియా సంస్థలు స్వతంత్ర ఉనికిని కోల్పోయి కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో క్రీడారూపకాలుగా మారిపోయాయి. భారీ సంస్థలు వార్తా పత్రికలను, ఛానళ్లను లాభార్జన కోసం కాకుండా, తమ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి ‘రక్షణ కవచాలు’గా వాడుకుంటున్న పరిస్థితి బహిరంగ రహస్యమే. యజమానుల ప్రయోజనాలకు భంగం కలిగే ఏ వార్త అయినా సరే, అది అచ్చు కాకముందే డస్ట్‌బిన్‌లోకి చేరుతోంది. ప్రకటనల కోసం ప్రభుత్వాల మీద, కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడటం వల్ల మీడియా తన ‘వెన్నెముక’ను తాకట్టు పెట్టిన విధంగా మారింది. నేడు మనకు వినిపిస్తున్న వార్తలు ప్రజల అవసరాలు కావు, పాలకుల ప్రచార ఆర్భాటాలు మాత్రమే.
The news is dying.. Who is burying it..!?
ఇక వార్తను పూడ్చిపెడుతున్న మరో ప్రధాన కారకం ‘ఫేక్ న్యూస్’. సోషల్ మీడియా విప్లవం సమాచారాన్ని వేగవంతం చేసిన మాట వాస్తవమే కానీ, అది వాస్తవాల కంటే వక్రీకరణలకే పెద్దపీట వేస్తోంది. ఐటీ సెల్స్ ద్వారా వ్యూహాత్మకంగా సృష్టించబడే అబద్ధాలు, ‘ఎకో ఛాంబర్స్’ ద్వారా ప్రజల మెదళ్లలోకి చొచ్చుకుపోతున్నాయి. జూలియన్ అసాంజే వంటి వారు వ్యవస్థల గుట్టు విప్పితే వారిని నేరస్తులుగా చిత్రించే వ్యవస్థ, మరోవైపు బాధ్యతారాహిత్యంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారిని వీరులుగా మారుస్తోంది. వార్తకు ఉండాల్సిన ‘నిష్పాక్షికత’ స్థానంలో ‘పక్షపాతం’ చేరింది. ఈ స్థితి మనం క్షేత్రస్థాయిలోనూ చూడొచ్చు. ఆయా జిల్లాల్లోని ఘటనలను ఏమాత్రం విజ్టతతో తొంగిచూసినా అనేక ఘటనలలో చేతు నిజాలు వెలుగు చూస్తాయి.
The news is dying.. Who is burying it..!?
అయితే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, సామాన్య పౌరుల మౌనం. ఒక జర్నలిస్టుపై దాడి జరిగినప్పుడు లేదా ఒక వాస్తవ వార్త అణిచివేయబడినప్పుడు సమాజం స్పందించకపోవడం వల్ల అణచివేతదారులకు బలం పెరుగుతోంది. మనం వాట్సాప్ యూనివర్సిటీల్లో వచ్చే అబద్ధాలను నిజమని నమ్ముతూ, అసలైన వార్తను వెలికితీసే జర్నలిస్టును ఒంటరిని చేస్తున్నాం. సమాజం నిద్రపోతున్నంత కాలం, వార్తలు సమాధి అవుతూనే ఉంటాయి. అందుకే వార్త మళ్ళీ ప్రాణం పోసుకోవాలంటే, జర్నలిజం తన మూలాల్లోకి వెళ్ళాలి. అది అధికార పీఠాల దగ్గర మోకరిల్లడం ఆపాలి. పత్రికా యజమానులు లాభం కంటే నైతికతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం విమర్శను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. పౌర సమాజం అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టి, స్వతంత్ర మీడియాకు అండగా నిలవాలి. వార్త మరణిస్తే సమాజానికి కళ్లు పోతాయి. అబద్ధాల చీకట్లో బతుకుతున్న సమాజం ఎప్పటికీ పురోగమించలేదు. అక్షరం సత్యమై, కలం గొంతుకై, వార్తకు ఊపిరి పోయాల్సిన బాధ్యత నేటి తరం జర్నలిస్టుల మీద, స్పందించే పౌరుల మీద ఉంది. శవపేటికలో ఉన్న వార్తను బయటకు తీసి, ప్రజాస్వామ్యపు వెలుగును నింపుదాం.
అందరికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం శుభాకాంక్షలు
రాజేందర్ దామెర (దారా) editor in chief jananirnayam.com
