Lorry hits parked tipper Driver dies : జాతీయ రహదారిపై అకస్మాత్తుగా ఆపిన టిప్పర్‌ను వెనుక నుండి లారీ ఢీకొన్న ఘటనలో యువ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా దామెర క్రాస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లపెల్లి గ్రామానికి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ నుండి ఇసుక లోడ్ కోసం లారీతో ఏటూరునాగారం వైపు బయలుదేరాడు. సుమారు 2:30 గంటల సమయంలో దామెర క్రాస్ రోడ్డులోని డిస్నీలాండ్ స్కూల్ వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని దాని డ్రైవర్ వోన్నాల రామకృష్ణ అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆపేశాడు. వేగంగా వస్తున్న శ్రీశైలం తన లారీని అదుపు చేయలేక టిప్పర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో శ్రీశైలానికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. గమనించిన తోటి లారీ డ్రైవర్లు వెంటనే 108 అంబులెన్స్‌లో అతడిని వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఉదయం 8:00 గంటలకు శ్రీశైలం తుదిశ్వాస విడిచాడు. మృతుని మామ బాతుక జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువ డ్రైవర్ మృతితో గొల్లపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
