- ప్రభుత్వ భూమికి అక్రమ పట్టాల గ్రహణం..!
- 18 ఎకరాల సహజ సంపద ప్రైవేట్ వ్యక్తుల పాలు..?
- తిరుమలాపూర్లో గ్రామస్తుల ప్రతిఘటన..
- రంగంలోకి సిపిఐ (ఎంఎల్) : పోరాటం తప్పదని స్పష్టీకరణ
‘Bodagutta’ in the grip of occupation : ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ప్రజా ఆస్తి. కానీ, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామ శివారులో ఉన్న ‘బోడగుట్ట’ ఇప్పుడు కబ్జాదారుల కబందహస్తాల్లో చిక్కుకుంది. సుమారు 18 ఎకరాల 24 గుంటల విస్తీర్ణం కలిగిన ఈ గుట్ట, రెవెన్యూ రికార్డుల్లో మాయాజాలానికి గురై ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమిగా మారిపోవడం ఇప్పుడు స్థానికంగా చర్చానీయాంశంగా మారింది.
‘Bodagutta’ in the grip of occupation..
అక్రమ పట్టాల వెనుక అసలు కథ..?
గత 2017-18 కాలంలో సర్వే నెంబర్ 59లో ఉన్న ఈ బోడగుట్ట భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహజ సంపదగా ఉన్న గుట్టను సాగు భూమిగా చూపి, పట్టా పొంది, ఆ తర్వాత దానిని ఇతర వ్యక్తులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు, ప్రైవేట్ సర్వేలతో హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడంతో వివాదం ముదిరింది.
‘Bodagutta’ in the grip of occupation..
గ్రామస్తుల ప్రతిఘటన
తమ గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న గుట్టను కాపాడుకునేందుకు గ్రామస్తులు నడుం బిగించారు. గుట్టపైకి సర్వే కోసం వచ్చిన వారిని అడ్డుకున్నారు. అయితే, “మా వద్ద పట్టాలు ఉన్నాయి.. ఇది మా సొంత భూమి” అని చెబుతూ కబ్జాదారులు గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, గుట్టలోని మట్టిని యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘Bodagutta’ in the grip of occupation..
రంగంలోకి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ : ‘పోరాటం తప్పదని స్పష్టీకరణ
ఈ వివాదంపై సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ బృందం గుట్ట భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుట్ట భూమికి పట్టాలు ఎలా ఇచ్చారో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని అన్నారు.జిల్లా కలెక్టర్, చిట్యాల తహసీల్దార్ వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ ఆస్తి అని తెలిపేలా రెవెన్యూ బోర్డును పెట్టాలని కోరారు.
ప్రజా వనరులను ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటుంటే అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, తక్షణమే స్పందించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని మల్లేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జన్నె సురేష్తో పాటు పలువురు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని గుట్టను కాపాడుకుంటామని పేర్కొన్నారు.
