సుధాకర్ పంటపొలంలో ధ్వంసమైన సైఫాన్ పైపు…
భయాందోళనలో రైతులు…
Can’t live with bore blastings రైతుకు వెన్నెముకగా ఉండాల్సిన నేల, నేడు భయానికి నిలయంగా మారింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వరా స్టోన్ క్రషర్ లో నిర్వహించే బోర్ బ్లాస్టింగ్స్ సామాన్య రైతుల పాలిట శాపంగా మారింది.
Can’t live with bore blastings..!?
గత రెండు రోజుల క్రితం (గురువారం) క్రషర్ లో నిర్వహించిన భారీ బోర్ బ్లాస్టింగ్ కారణంగా సమీపంలోని రైతు పల్లెబోయిన సుధాకర్ పంటపొలంలోకి భారీ బండరాళ్లు వచ్చి పడిటం, తన కష్టార్జితంతో ఏర్పాటు చేసుకున్న సైఫాన్ పైపులు పూర్తిగా ధ్వంసం కావటం అక్కడ బహిరంగ రహస్యమే. వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న ఆ రైతుకు ఇది కోలుకోలేని దెబ్బ. “పైపులు పోతే కొనుక్కోవచ్చు, కానీ ఆ సమయంలో నేనే అక్కడ ఉంటే నా ప్రాణం దక్కేదా?” అని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పొలానికి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.. ఎప్పుడు ఎటునుంచి రాళ్లు వచ్చి పడతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది” అని సుధాకర్ తో పాటు పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
Can’t live with bore blastings..!?
నిబంధనలు గాలికి.. యధేచ్ఛగా బ్లాస్టింగ్స్…
మైనింగ్ నిబంధనల ప్రకారం బ్లాస్టింగ్ చేసే ముందు స్థానికులను అప్రమత్తం చేయాలి, సైరన్లు మోగించాలి, నిర్ణీత పరిమితుల్లోనే పేలుళ్లు జరపాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలో పేలుళ్లు జరుగుతాయో తెలియక రైతులు బిక్కుబిక్కుమంటూ పొలాల్లో గడుపుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్ తీవ్రతకు గ్రామంలోని ఇండ్లు కంబించటం, రాళ్లు పరిసరాల్లోని పంటపొలాల్లోకి ఎగిరి పడుతుండటం సర్వసాధరణంగా మారింది. పేలుళ్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళితో పంట దిగుబడి కూడా తగ్గుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
Can’t live with bore blastings..!?
అధికారుల ఉదాసీనత..
ఈ వ్యవహారంపై గ్రామ పాలకవర్గ సభ్యులు ఇప్పటికే ఈ క్రషర్ వద్దేవద్దు అంటూ సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు మరోగుట్టకు కొత్త క్రషర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగంతున్న నేపథ్యంలో రైతులు, గ్రామ పాలకవర్గ సభ్యులు కొత్త క్రషర్ వద్దంటూ తమ గళం విప్పారు. అయితే ఇప్పటికే నిర్వహించబడుతున్న క్రషర్ ను అధికారులు వచ్చి చూసి వెళ్లడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. అధికారుల ఈ ‘నామమాత్రపు పరిశీలనలు’ క్రషర్ యాజమాన్యానికి మరింత బలాన్ని ఇస్తున్నాయని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రామానికి చెందిన రైతు సుధాకర్ పొలంలో బండరాళ్లు వచ్చి చేరటం, సైఫాన్ పైపు ధ్వంసం కావటం చర్చానీయాంశంగా మారింది. ” ఈ స్టోన్ క్రషర్ తో బతకలేం…మాకు మా ప్రాణాలకు గ్యారెంటీ కావాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రషర్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలి” అంటూ బాధిత రైతుతో పాటు పలువురు కోరుతున్నారు.
