కొండలను పిండి చేస్తున్న కాంట్రాక్టర్లు..!
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని cpi (ml) లిబరేషన్ డిమాండ్
Is there a ‘soil’ mafia behind the Greenfield Highway : అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్న కాంట్రాక్టర్ల తీరుపై cpi (ml) లిబరేషన్ నిప్పులు చెరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవే మాటున జోరుగా ‘మట్టి’ మాఫియా జరుగుతోందని ఆరోపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట శివారులోని గుట్టలను అక్రమంగా తవ్వి తరలిస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక అధికార యంత్రాంగం పాత్ర ఉందని, మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారులు కాంట్రాక్టర్లకు అండగా ఉంటున్నారని మల్లేష్ ఆరోపించారు. కళ్లముందే సహజ సంపద తరలిపోతున్నా, జిల్లా స్థాయి అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కొండలను పిండి చేస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక రహస్యం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.
Is there a ‘soil’ mafia behind the Greenfield Highway..!?
కనుమరుగవుతున్న గుట్టలు
పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
విచ్చలవిడి తవ్వకాల వల్ల ప్రకృతి సిద్ధమైన కొండలు నామరూపాల్లేకుండా పోతున్నాయని, సహజ వనరుల విధ్వంసం వల్ల భవిష్యత్తులో వర్షపాతం తగ్గి, వ్యవసాయం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో నిరుపేద రైతుల దగ్గర తక్కువ ధరకే అగ్రిమెంట్ చేసుకుని, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారని మల్లేష్ పేర్కొన్నారు.
”గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల సామాన్య ప్రజలకు వచ్చే లాభమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పర్యావరణాన్ని నాశనం చేయడం అన్యాయమని ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు.
Is there a ‘soil’ mafia behind the Greenfield Highway..!?
ఆందోళన బాటలో ప్రజా సంఘాలు
అధికారులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాసంఘాలను కలుపుకొని ఆందోళనలు చేపడతామని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్, రామచందర్ మాదిగ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. తక్షణమే అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు.
