The environment is being ‘crushed’ by the cotton crusher : భూమి, నీరు, గాలి.. ఇవి మానవజాతి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. కానీ, నేడు కొందరి స్వార్థం, లాభాపేక్ష కారణంగా ఈ పంచభూతాలు కలుషితమైపోతున్నాయి. హనుమకొండ జిల్లా, శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో వెలిసిన ‘శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్’ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ విధ్వంసం, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను, పర్యావరణ సమతుల్యతను ఘోరంగా దెబ్బతీస్తోంది. ఒక సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా, సమాజహితాన్ని ఆకాంక్షించే వ్యక్తిగా అక్కడి దయనీయ స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది. పత్తిపాక గ్రామంలోని క్రషర్ నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కి, గుట్టలను పిండి చేస్తున్నారు. నేల, నీరు, మానవ ఆరోగ్యం, వారి ఆవాసాలు ఏమైపోయినా పర్వాలేదు, తమకు లాభాలు వస్తే చాలనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రషర్ వల్ల కలుగుతున్న నష్టాలు వర్ణనాతీతం.
The environment is being ‘crushed’ by the cotton crusher
రైతులకు శోకం.. భూగర్భ జలాలకు ముప్పు
క్రషర్ నుండి వెలువడే రాతి పొడి, దుమ్ము కిలోమీటర్ల మేర వ్యాపించి పంట పొలాలను ముంచెత్తుతోంది. దీనివల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకుపచ్చని పొలాలు తెల్లటి దుమ్ము కొట్టుకుపోయి దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా, పరిమితికి మించి చేస్తున్న తవ్వకాల వల్ల భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. బోరు బావులు ఎండిపోతున్నాయి, కొన్ని కూలిపోతున్నాయి. సాగు నీరు, తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుట్టలను పేల్చడం వల్ల వచ్చే భీకర శబ్దకాలుష్యం, క్రషర్ నుండి వెలువడే విషవాయువులు, ధూళి కణాలు ప్రజల ఆరోగ్యాన్ని హరించివేస్తున్నాయి.
The environment is being ‘crushed’ by the cotton crusher
ఆవాసాల విధ్వంసం
బండలను బాంబులతో పేల్చడం వల్ల వచ్చే ప్రకంపనలకు గ్రామస్తుల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో అని ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. పేలుళ్ల ధాటికి చిన్న చిన్న రాళ్లు పంట పొలాల్లో, ఇళ్లపై పడుతున్నాయి, ఇది ప్రాణసంకటంగా మారింది. అటు మూగజీవాలు కూడా తమ ఆవాసాలను కోల్పోయి, ప్రాణరక్షణ కోసం గ్రామంలోని ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇది మానవ-మృగ సంఘర్షణకు దారితీస్తోంది.
The environment is being ‘crushed’ by the cotton crusher
పర్యవేక్షణ లోపం
స్టోన్ క్రషర్, హాట్ మిక్స్ ప్లాంటు ఏర్పాటు నిర్వహణకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ, పత్తిపాకలో అవి అమలు కావడం లేదనేది ఇక్కడి పరిస్థితి చుస్తే అర్థం అవుతున్నది. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు కఠినమైన పెనాల్టీలు విధించాలి, అవసరమైతే అనుమతులు రద్దు చేయాలి. కానీ, అధికారుల పర్యవేక్షణ లోపం క్రషర్ నిర్వాహకులకు వరంగా మారింది.
The environment is being ‘crushed’ by the cotton crusher
ప్రభుత్వానికి నా సలహా మరియు మనవి
పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి నేను చేసే విన్నపం ఒక్కటే. పర్యావరణానికి, పంటలకు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే ఇలాంటి వినాశకరమైన పరిశ్రమల కంటే, సమాజానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే, పర్యావరణహితమైన కంపెనీలను తీసుకురావాలి. అప్పుడే గ్రామాలనుండి పట్టణాలకు జరుగుతున్న వలసలను అరికట్టగలము, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపగలము. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. పత్తిపాక గ్రామ ప్రజల ఆవేదనను ఆలకించి, తక్షణమే చర్యలు చేపట్టాలని, పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలని కోరుతున్నాను.
తుడుం శంకర్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
