- మింగేయనున్న ‘క్రషర్’ మాఫియా..!
- ఇప్పటికే ఒకటి మాయం.. ఇప్పుడు రెండో దానిపై మరికొందరి కన్ను..!!
- జరుగుతున్న సర్వేలపై గ్రామంలో అంతర్మథనం…
Cotton ‘pile’ is a problem..!? : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో గతంలో ఒక గుట్టను క్రషర్ పేరిట నామరూపాలు లేకుండా చేశారు కొందరు. ఇప్పుడు మరో గుట్టను కనుమరుగు చేసేందుకు కొందరు పక్కా ప్లాన్ వేశారు. ఇప్పటికే యధేచ్ఛగా సర్వేలు జరుగుతున్న పరిస్థితి బహిరంగ రహస్యమే. ఈ ప్రక్రియలో చక్రం తిప్పుతున్న వారి ముందు అధికారులు తలొగ్గుతున్నారా..? లేక పాత అనుభవాలనే పునరావృతం చేయబోతున్నారా..? అన్నది ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులే కాదు అప్పటి పాలకవర్గం మారి ఇప్పడు ఆ గ్రామ పంచాయతీకి కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం ఎలాంటి ప్రణాళికతో ముందుకుసాగుతుందో అనేది ప్రశ్నగా మారింది.
Cotton ‘pile’ is a problem..!?
పత్తిపాక గ్రామ శివారులో ఒకప్పుడు గంభీరంగా కనిపించిన గుట్ట.. ఇప్పుడు కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలింది. క్రషర్ యంత్రాల కర్కశత్వానికి ఆ గుట్ట కరిగిపోయింది. నాడు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అప్పటి అధికారులు, ఊరి పెద్దలు అందరూ చూస్తూ ఉండగానే ఆ గుట్ట విధ్వంసం జరిగిపోయింది. ఇప్పుడు రెండో గుట్ట వంతు వచ్చింది..! కాసుల కక్కుర్తిలో పడి కొందరు మైనింగ్ వ్యాపారులు ఈ గుట్టను కూడా నేలమట్టం చేసేందుకు సర్వేలు మొదలుపెట్టారు. ఒక గుట్ట పోయినా మేల్కోనని వ్యవస్థ, ఆ ప్రజలు ఇప్పుడు రెండో గుట్ట కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటుందా..? లేక మళ్ళీ ‘మామూలు’గానే మిన్నకుండిపోతుందా..? అనేదే ఇక్కడ సంధిస్తున్న ప్రశ్న.
Cotton ‘pile’ is a problem..!?
- గతం ఒక చేదు పాఠం..
గతంలో జరిగిన విధ్వంసం కళ్ళముందే ఉంది. గుట్టను తవ్వేస్తుంటే పర్యావరణ దెబ్బతింటుంటే ఊరి పొలాలపై దుమ్ము ధూళి పడుతుంటే, నిత్యం పేలుళ్ళ శబ్థంతో ఇండ్లు కంబిస్తుంటే కూడా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, జనం సైతం మాకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉంటున్న పరిస్థితి కొత్తేమీ కాదు. దీంతో ఆ గుట్ట అస్థిపంజరంలా మారిపోయింది. ఆ చేదు అనుభవం నేర్పిన పాఠాన్ని ఇప్పటి పాలకవర్గం గుర్తుంచుకుంటుందా..? లేక వారు కూడా పాత దారిలోనే పయనిస్తారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Cotton ‘pile’ is a problem..!?
- సర్వేల జోరు..అంతర్మథనంలో ఊరు!
రెండో గుట్టపై క్రషర్ ఏర్పాటుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనింగ్ వ్యాపారులు తమ పలుకుబడిని ఉపయోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తున్నారు. అధికారులు సైతం గుట్టుచప్పుడు కాకుండా వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒక గుట్ట మాయమైనప్పుడే ఊరు మూగబోయింది, ఇప్పుడు మరో గుట్టకు గురిపెడితుంటే ఆ ఊరిలో అంతర్మథనం మొదలైంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించాలి. గతంలో జరిగిన తప్పును సరిదిద్దుకోలేకపోయినా, కనీసం ఉన్న గుట్టనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
- సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
