సింగరేణి గడ్డపై విప్లవ కెరటం
CPI(ML) లిబరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ‘మారపల్లి మల్లేష్’ తో ‘జన నిర్ణయం’ స్పెషల్ ఇంటర్వ్యూ
An invincible voice in the public sphere దశాబ్దాల కాలంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాజకీయ యవనికపై ఒక ధిక్కార స్వరం నిరంతరం వినబడుతూనే ఉంది.. అది సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ గొంతుక. విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితులై, ఆనాటి విద్యార్థి ఉద్యమాల్లో నిప్పుకణికలా పనిచేసిన చరిత్ర ఆయనది. కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, ఎండనక, వాననక గడప గడపకూ తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. అడవి బిడ్డల పోడు భూముల సమస్యలైనా, సింగరేణి కార్మికుల హక్కులైనా, అక్రమ క్వారీ నిర్వాహకుల పర్యావరణ విధ్వంసమైనా.. అక్కడ మల్లేష్ ఎర్రజెండా నీడన అండగా నిలుస్తారు. జాతీయ స్థాయిలో బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో శాసనసభ ప్రతినిధ్యం కలిగి ఉండి, దేశవ్యాప్త ప్రజాస్వామ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘లిబరేషన్’ పార్టీకి భూపాలపల్లి జిల్లాలో మల్లేష్ బలమైన సారథిగా నిలుస్తున్నారు. జిల్లాలో విద్య, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అవుతున్న వేళ, నిరుద్యోగ యువత ఉపాధి లేక విలవిల్లాడుతున్న తరుణంలో.. పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ, సామాజిక – ఆర్థిక అసమానతలపై ఆయన సంధిస్తున్న ప్రశ్నలు నేడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థితిగతులు, రాజకీయ పరిణామాలపై CPI(ML) లిబరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ‘మారపల్లి మల్లేష్’ తో ‘జన నిర్ణయం’ స్పెషల్ కరస్పాండెంట్ ‘దారా’ స్పెషల్ ఇంటర్వ్యూ…
జన నిర్ణయం : దేశవ్యాప్తంగా సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ విస్తరిస్తున్న తీరు, తెలంగాణలో, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి..?
మల్లేష్ : జాతీయ స్థాయిలో అణగారిన వర్గాల ప్రతినిధిగా మా పార్టీ బలమైన ముద్ర వేసింది. తెలంగాణలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో గతంతో పోలిస్తే పార్టీ కేడర్ బలపడింది. క్షేత్రస్థాయిలో కార్మిక, రైతు సంఘాల ద్వారా ప్రజల్లో మమేకమయ్యాం. గతంలో వామపక్ష ఉద్యమాలంటే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమనే భావన ఉండేది, కానీ ఇప్పుడు మేము సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం అనే అంశాలతో జిల్లా అంతటా విస్తరిస్తున్నాం.
జన నిర్ణయం : భూపాలపల్లి ఆర్థికంగా సింగరేణిపై ఆధారపడి ఉంది, కానీ స్థానికులకు ఎలాంటి మేలు జరుగుతుందని భావిస్తున్నారు..?
మల్లేష్ : భూపాలపల్లి అంటేనే ‘నల్ల బంగారం’ నెలవు. కానీ ఇక్కడి గనుల నుండి వెలికితీసే సంపద ప్రభుత్వాల ఖజానాలకు చేరుతోందే తప్ప, ఈ నేల కోసం త్యాగం చేసిన రైతులకు, నిర్వాసితులకు దక్కడం లేదు. ఓపెన్ కాస్ట్ గనుల వల్ల ఊళ్లకు ఊళ్లే మ్యాప్‌లో లేకుండా పోతున్నాయి. కాలుష్యం కోరలు చాస్తోంది. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బయటి వ్యక్తులతో కాంట్రాక్ట్ పనులు చేయించడం ఈ ప్రాంత ప్రజల నోరు కొట్టడమే. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల పక్షాన మా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది.
జన నిర్ణయం : జిల్లాలో విద్యా, వైద్య రంగాలు కునారిల్లుతున్నాయని మీరు ఎందుకు భావిస్తున్నారు..?
మల్లేష్ : వాస్తవాలు అలాగే ఉన్నాయి కాబట్టి! జిల్లా కేంద్రంలో ఒక పెద్ద ఆసుపత్రి కడితే సరిపోదు, అందులో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి. గిరిజన గూడాల్లో నేటికీ జ్వరమొస్తే డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది. విద్యా వ్యవస్థ చూస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవు. ప్రైవేట్ విద్యాసంస్థలు సామాన్యుడి రక్తాన్ని పీలుస్తున్నాయి. విద్య, వైద్యం అనేవి వ్యాపార వస్తువులు కాకూడదు, అవి హక్కులు కావాలని మా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
జన నిర్ణయం : సామాజికంగా జిల్లాలో అణగారిన వర్గాల పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ ప్రాబల్యం వారిపై ఏ మేరకు ప్రభావం చూపుతోంది..?
మల్లేష్ : రాజకీయాలు నేడు ధనమయం అయ్యాయి. బహుజనులు, దళితులు, గిరిజనులు కేవలం ఓటు బ్యాంకుగానే చూడబడుతున్నారు. మా ‘లిబరేషన్’ పార్టీ ఎప్పుడూ ఒకటే చెబుతుంది—అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి. జిల్లాలో ఇంకా భూస్వామ్య అవశేషాలు, అణచివేత ధోరణులు పోలేదు. కుల వివక్ష రూపం మార్చుకుని కొనసాగుతోంది. సామాజిక న్యాయం కేవలం నినాదాలకే పరిమితమైంది.
జన నిర్ణయం : పర్యావరణ పరిరక్షణ కోసం, ముఖ్యంగా అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు, క్వారీలు, స్టోన్ క్రషర్ల విషయంలో మీ వైఖరి ఏమిటి..?
మల్లేష్ : ఇది చాలా తీవ్రమైన అంశం. అభివృద్ధి పేరుతో గుట్టలను పిండి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న క్రషర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రకృతిని ధ్వంసం చేసే ఏ శక్తినైనా మేము అడ్డుకుంటాం. అనుమతులు ఇచ్చేటప్పుడు పర్యావరణ ప్రభావాలను విస్మరిస్తున్న అధికారుల తీరును మేం ఎండగడుతూనే ఉంటాం. ‘సహజ వనరుల పరిరక్షణ’ అనేది మా పార్టీ ఎజెండాలో ప్రధానాంశం.
జన నిర్ణయం : రాబోయే రోజుల్లో ఇతర వామపక్ష పార్టీలతో కలిసి జిల్లాలో మీరు చేపట్టబోయే ఉమ్మడి కార్యాచరణ ఏమిటి..?
మల్లేష్ : ఫాసిస్ట్ శక్తులను అడ్డుకోవడానికి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వామపక్ష ఐక్యత నేడు దేశానికి ఎంతో అవసరం. జిల్లా స్థాయిలో కూడా ప్రజల సమస్యలపై అన్ని ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పనిచేస్తాం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, భూసేకరణ బాధితుల పక్షాన ఉమ్మడి పోరాటాలు ఉధృతం చేస్తాం.
జన నిర్ణయం : చివరగా.. జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి..?
మల్లేష్ : యువత రాజకీయ చైతన్యాన్ని కలిగి ఉండాలి. ఉపాధి లేదని కుంగిపోకుండా, ఉపాధి హక్కు కోసం గళమెత్తాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. మీ సమస్య ఏదైనా, ప్రజా పక్షాన నిలిచే ఎర్రజెండా మీకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది. కలిసికట్టుగా పోరాడితేనే మన జిల్లా భవిష్యత్తు బాగుంటుంది.
జన నిర్ణయం : ఓకే ఆల్ ది బెస్ట్ మల్లేష్…
మల్లేష్ : థాంక్యూ….
