- పట్టణ పీఠం కోసం ‘చీకటి’ రాజకీయం..!
- ఊపులో సాగుతున్న తెరవెనుక జోరు..
- ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల ‘మిడ్ నైట్’ ఆపరేషన్లు…
Late night moves : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. బహిరంగ సభలు, రోడ్ షోలకు కాలం చెల్లడంతో.. అభ్యర్థుల దృష్టి ఇప్పుడు ‘అర్థరాత్రి ఎత్తుగడల’ వైపు మళ్లింది. రేపు ఉదయం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలోపే తమ వైపు తిప్పుకోవడానికి ప్రతి నిమిషాన్ని పార్టీలు అత్యంత కీలకంగా వాడుకుంటున్నాయి. గల్లీల్లో నిఘా కళ్లు కప్పుతూ సాగుతున్న ఈ ‘చీకటి’ వ్యూహాలు రేపటి ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటరును నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో, అభ్యర్థుల ప్రధాన అనుచరులు అర్థరాత్రి వేళల్లో క్రియాశీలకంగా మారుతున్నారు. స్థానిక కుల సంఘాల నేతలు, కాలనీ ప్రెసిడెంట్లతో రహస్య సమావేశాలు ఇప్పటికే నిర్వహించి తమ పట్టుకోసం మద్యం, నగదు పంపిణీ వంటివి సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మురికివాడలు, మధ్యతరగతి కాలనీలే లక్ష్యంగా ఈ పంపిణీ సాగుతున్నట్లు సమాచారం.
Late night moves..!?
అర్థరాత్రి జరిగే మరో ముఖ్యమైన ప్రక్రియ ‘బేరసారాలు’. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు (రెబల్స్) తమకు పడే ఓట్లను చీల్చకుండా ఉండేందుకు, ప్రధాన పార్టీల నేతలు వారిని కలిసి ఏదో ఒక హామీతో పోటీ నుంచి మానసికంగా తప్పుకునేలా లేదా తమకు మద్దతిచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. అయితే ఇందులో సైలెంట్ ఓటర్లు ఆయా పార్టీల నేతల భవిష్యత్తు తెల్చనున్నట్లు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Late night moves..!?
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11,000 సీసీ కెమెరాల నిఘాతో పాటు పోలీసు బలగాలు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా సరిహద్దులు దాటి మద్యం, నగదు రాకుండా తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా కనిపించే గ్రూపులను చెల్లాచెదురు చేస్తూ, ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఈ 12 గంటల సమయం చాలా కీలకంగా మారింది. ప్రచారంలో ఎంత గొంతు చించుకున్నా, అర్థరాత్రి వేసే ‘ఎత్తుగడ’ ఓటరు నిర్ణయాన్ని ఒక్కసారిగా మార్చగలదు. రేపు సాయంత్రం ఓటింగ్ శాతం పెరిగితే అది అభ్యర్థులు చేసిన ఈ ‘గ్రౌండ్ వర్క్’ ఫలితమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
