Loneliness without chains from the మనం పుట్టినప్పటి నుండి ఇతరుల కోరికలకు అనుగుణంగా బతకడం అలవాటు చేసుకుంటాం. తల్లిదండ్రుల అంచనాలు, స్నేహితుల పోలికలు, సమాజం విధించిన నియమాలు మనల్ని ఒక ‘సామాజిక బందీ’గా మారుస్తాయి. ఎప్పుడైతే మనం ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుందో, అప్పుడు మనపై ఉన్న ఆ ‘సామాజిక స్క్రిప్ట్స్’ అన్నీ మాయమవుతాయి. ఆ క్షణం మీరు ఎవరినీ మెప్పించాల్సిన పని ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఒక రకంగా ఈ ఒంటరితనం స్వేచ్ఛా ప్రకటనగా చూడాలి. ఒంటరితనం అంటే స్పృహ కలిగిన ఏకాంంతం అనేది గమనించాలి. అయితే కొందరు ఒంటరితనం అనేది రకరకాలుగా విశ్లేషణ చేస్తుంటారు. ఈ సమాజం నిర్దేశించిన దారుల్లో నడవలేకపోవడాన్ని ‘ఒంటరి అవడం’ అనుకుంటే పొరపాటే అవుతుంది. నిజానికి అది పాత సంకెళ్లను తెంచుకుని, కొత్త ప్రపంచంలోకి అడుగీడే ‘స్వేచ్ఛ’కు తొలి అడుగు”గా భావించాలి.
ఈ సమాజంలో ‘ఒంటరితనం’ అనగానే దానిని ఒక మానసిక సమస్యగా లేదా వైఫల్యంగా చూసే ధోరణి కూడా ఉంటుంది. కానీ, నిజానికి ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఒంటరితనంలో ఏకాంతం వెత్తుక్కోవడమే నిజమైన స్వేచ్ఛగా చూడాలి. సహజంగానే మనం ఇతరులతో ఉన్నప్పుడు, వారిని మెప్పించడానికి ఒక ముసుగు ధరిస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అవసరం ఉండదు. మీకు నచ్చినట్లు ఉండొచ్చు, నచ్చినట్లు ఆలోచించవచ్చు. ఈ ఒంటరితనంలోనే “నేనెవరు? నాకేం కావాలి?” అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇతరుల ఆమోదం కోసం పాకులాడాల్సిన అవసరం లేకపోవడమే అసలైన స్వేచ్ఛగా చూడాలి. ఒక రకంగా ఒంటరిగా ఉండగలిగే శక్తి ఉన్నవారు గర్వపడాలి. ఎందుకంటే, తనతో తాను గడపగలిగే ధైర్యం ఉన్నవాడు ప్రపంచంలో దేనికైనా సిద్ధపడగలడు. మనం ఒంటరిగా ఉన్నామంటే మనం స్వేచ్ఛగా ఉన్నామని, మన జీవితానికి మనమే యజమాని అని అర్థం చేసుకోవాలి.
అంతేకాదు ఈ సమాజంలో ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరిగిపోవాలి అనే పరిస్థితి లేకపోలేదు. సమాజం విధించిన నియమావళి ప్రకారం జరిగిపోవాలి. చదువు, ఉద్యోగం, పెళ్లి, సంపాదన ఇలా సమాజం గీసిన గీత దాటకుండా పరిగెత్తడమే విజయమని మనం నమ్ముతున్నాం. కానీ, ఎప్పుడైనా ఆ గీత తప్పినప్పుడు లేదా ఆ పరుగులో మనం ఎక్కడ ఉన్నామో తెలియనప్పుడు ఒకరకమైన భయం ఆవహిస్తుంది. అదే “ఒంటరి అవడం” అనే భావన. మనం ఎప్పుడైతే ఒంటరి అయినట్లు భావిస్తామో, అప్పుడు సమాజం మనపై రుద్దిన అంచనాల భారం మనకు తెలియకుండానే తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియనప్పుడు, “ఎక్కడికైనా వెళ్లవచ్చు” అనే అపరిమితమైన స్వేచ్ఛ మనకు లభిస్తుంది. ఇది శూన్యం కాదు, అనంతమైన అవకాశాల వేదిక. నేటి రోజుల్లో మనం గూగుల్ మ్యాప్స్ సాయంతో దారి కనుక్కుంటున్నాం, కానీ మనసు దారిని మాత్రం కోల్పోతున్నాం. సోషల్ మీడియా ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకునేలా చేసి, మన అసలైన అస్తిత్వాన్ని మరుగున పడేస్తోంది. ఈ కృత్రిమ ప్రపంచంలో “ఒంటరి అవడం” అంటే ఈ డిజిటల్ గోడలను బద్దలు కొట్టి, ప్రకృతితోనూ, మన అంతరాత్మతోనూ అనుసంధానం అవ్వడమే అనేది ఒంటరిగా ఉన్నప్పుడే అర్థం అవుతుంది. ఒంటరి అవడం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక పరిణామ క్రమం. ఆ స్థితిలో ఉన్నప్పుడు కలిగే నిశ్శబ్దం మనకు మన గురించి మనం ఎప్పుడూ వినని నిజాలను చెబుతుంది. కాబట్టి ఒంటరితనాన్ని చూసి భయపడం కంటే స్వేచ్ఛా జీవిగా మారుతున్న క్షణంగా భావించాలి. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా చూడాలి. నిరంతరం ఇతరులతో కలిసి ఉండటం వల్ల మన వ్యక్తిత్వం ఇతరుల అభిప్రాయాల మిశ్రమంగా మారిపోతుంది. ఒంటరితనం మనల్ని మనం వడపోసుకోవడానికి సహాయపడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, మనల్ని మనం పలకరించుకునే తీరిక కూడా లేదు. ఒంటరితనం ఏర్పడినప్పుడు, బాహ్య ప్రపంచపు సందడి తగ్గి, అంతరాత్మ స్వరం వినిపించడం మొదలవుతుంది. ఈ స్థితిలో కలిగే బాధ ‘పరిణామ క్రమానికి’ సంకేతం. ఇక్కడ చెప్పదల్చుకున్న కీలకమైన అంశం ఏంటంటే ”ఎవరి తోడూ లేకపోవడం ఒంటరితనం కాదు, ఎవరి కోసమో వేచి చూడాల్సిన అవసరం లేకపోవడమే అసలైన స్వేచ్ఛ. బాహ్య ప్రపంచం నిన్ను ఒంటరిని చేసిందని నువ్వు భావిస్తున్నావు కానీ, నిజానికి ప్రకృతి నిన్ను నీతో కలిపేందుకు సిద్ధం చేసిన అద్భుతమైన అవకాశమే ఒంటరితనంగా భావించాలి.” ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒంటరితనం ఇక్కడ ఒంటరితనం అనేది స్పృహ కలిగినఏకాంతంగా
చూడాలి. ఏకాంతం అనేది శూన్యం కాదు, అది ఒక కొత్త ఆలోచనలకు వేదిక. ముందే చెప్పినట్లుగా ఇతరుల సమక్షంలో మనం మన అసలైన గుర్తింపును కోల్పోయి, వారి అంచనాలకు తగ్గట్టుగా ప్రవర్తించేందుకు సిద్దపడుతుంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ముసుగు తొలగి, మన వాస్తవ రూపం మనకు కనిపిస్తుందనేది ప్రపంచ సత్యం.
రాజేందర్ దామెర (దారా)
