Nirmalamma’s Budget: Economic challenges that the common man needs to understand : ఈ సంవత్సరం బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో వచ్చారు. కానీ, ఈ బడ్జెట్ దేశానికి ఏమి ఇస్తుందనే దానిపై కాకుండా, దాన్ని అమలు చేసే విధానం , దాని నిజమైన ప్రభావం గురించి చర్చ చేద్దాం.
బడ్జెట్ లెక్కల్లో నిజం దాగి ఉందా..? ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది..? ఎంత రాబడి వస్తుంది అనే దానికి సంబంధించిన లెక్కలు (ద్రవ్య లోటు) ఈ బడ్జెట్లో ఒక సంఘిటిత రూపంలో లేకుండా చెల్లా చెదరుగా ఉన్నాయి. చాలా ఎక్కువ రాబడిని లెక్కిస్తున్నారో లేదా ఖర్చులను తక్కువగా చూపిస్తున్నారో అనే సందేహం కలుగుతుంది. ఇది వాస్తవికతలపై కాకుండా, కేవలం కాగితంపై అందంగా కనిపించే లెక్కలుగా ఉన్నాయి. ఇలాంటి లెక్కల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు మరికొన్ని ఎదురవుతాయే కానీ ఏలాంటి ప్రయోజనం ఉండదు.
- పన్ను వ్యవస్థ
చిన్న వ్యాపారాలకు బాధ.బడ్జెట్లో పన్ను వ్యవస్థ సులభం చేయబడుతుందని చెప్పారు. కానీ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు (ఎస్.ఎమ్.ఈ.ఎస్.)కు మాత్రం పన్ను భారం పెరిగినట్లు కనిపిస్తోంది. వారిపై ఇంకా ఎక్కువ నియమాల భారం పడుతుంది. గతంలో, ఇటువంటి మార్పులు చిన్న వ్యాపారాలపై ఒత్తిడిని పెంచాయని గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది ఉపాధి సృష్టికి దారితీసే ఈ రంగాన్ని బలహీనపరుస్తుంది.
- ప్రజల జేబులో డబ్బు ఎందుకు లేదు..?
ఏ బడ్జెట్ అయినా ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవహించాలి. కానీ ఈ బడ్జెట్లో, ఇంధనం లేదా రోజువారీ వస్తువుల ధరలు తగ్గించే ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు. కేవలం కొన్ని పన్ను స్లాబ్ మార్పులు వచ్చాయి, వాటి ప్రయోజనం కూడా ఎక్కువగా మధ్య తరగతి వరకు మాత్రమే పరిమితమైంది. దీని వల్ల డిమాండ్ పెరగదు, అంటే వస్తువులు విక్రయించడం కష్టం. వ్యాపారాలు విస్తరించడం కూడా కష్టం అవుతుంది.
వ్యవసాయానికి నిజమైన సహాయం ఉందా..?
వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని బడ్జెట్ చెప్పినా, రైతుల ఆదాయాన్ని నేరుగా పెంచే ఏ ప్రత్యక్ష పథకాలు చూపలేదు. వ్యవసాయానికి కేటాయింపులు (బడ్జెట్) నిజంగా పెరిగాయా? మునుపటి బడ్జెట్లతో పోలిస్తే, వ్యవసాయ రంగం వాటా చాలా తక్కువగానే ఉంది. ఇప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న రుణ సమస్య మరియు పంట ధరల సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం ఈ బడ్జెట్లో చూపించ లేదు.
- ఉపాధి అవకాశాలు: కొత్త ఉద్యోగాలు ఎక్కడ..?
ఏ బడ్జెట్ అయినా కొత్త ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలి. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కట్టడంపై దృష్టి ఉంది. కానీ , అది ఎక్కువగా పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రయోజనం. చిన్న వ్యాపారాలు, వ్యవసాయం మరియు సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ఏ ప్రత్యేక పథకాలు చూపించలేదు. పెట్టుబడికి – ఉపాధి సృష్టికి మధ్య ఉన్న దూరం అలాగే మిగిలిపోయింది.
భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికను చూపలేదు
ఈ బడ్జెట్లో హరిత శక్తి, డిజిటల్ ఇండియా వంటి కొన్ని మంచి ప్రస్తావనలు ఉన్నాయి. కానీ, ఈ లక్ష్యాలను ఎలా సాధించాలో, ఎంత డబ్బు ఖర్చు పెడతారో , దాని ప్రయోజనాలు సాధారణ జనం వరకు ఎలా చేరుకుంటాయో అనే వివరాలు స్పష్టంగా సూచించ లేదు. ఇది కేవలం “చేస్తాము” అనే వాగ్దానం మాత్రమే ఎప్పటిలా చేశారే కానీ, దాన్ని సాధించే “రోడ్ మ్యాప్” ను చూపించ లేదు.
మొత్తంమీద, ఈ బడ్జెట్ ఆర్థిక సమస్యలను గుర్తించింది కానీ, వాటికి సమగ్రమైన, ప్రభావవంతమైన పరిష్కారాలను అందించలేదు. ప్రజల జేబు ఖాళీగా ఉండటం, చిన్న వ్యాపారాలపై ఒత్తిడి, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వంటి విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ బడ్జెట్ వాగ్దానాలు నిజానికి అమలు విధానంపైనే దేశం యొక్క ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల కు : ఈ బడ్జెట్ న్యాయం చేయలేదు
ఈ కేంద్ర బడ్జెట్, దేశం యొక్క ఆర్థిక దిశను నిర్దేశిస్తున్నట్లు చెప్పబడినప్పటికీ, దక్షిణ భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విషయంలో విస్మృతి, అస్పష్టత న్యాయం చేయటానికి మనసులేనట్లు కనపడుతుంది.
ఈ రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి, అభివృద్ధి హక్కులను దెబ్బతీసే ఈ బడ్జెట్, ఫెడరలిజం యొక్క ముఖ్యమైన సూత్రాలను పట్టించుకోకుండా ఉండటం మరీ అన్యాయం.
ఆంధ్రప్రదేశ్
మరోసారి అరిగిపోయిన వాగ్దానాలు, ఆర్థిక న్యాయంపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రత్యేక స్థితి, రాజధాని నిర్మాణం కోసం అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం నుండి ఎదురు చూస్తోంది. ఈ బడ్జెట్ కూడా ఈ ప్రాథమిక ,చట్టబద్ధమైన డిమాండ్‌ను పూర్తిగా విస్మరించింది. రాజధాని అమరావతి ప్రత్యేక ప్యాకేజీ లేదా అదనపు ఆర్థిక వనరుల కేటాయింపు ఏమీ కనపడ లేదు. ఇది ఒక రాష్ట్రం యొక్క సాంఘిక-ఆర్థిక భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాల పట్ల కేంద్రం యొక్క నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. అంతేకాక, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభివృద్ధి ఖర్చులపై మరింత నియంత్రణకు గురవుతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ వంటి అభివృద్ధి అవసరాలు ఎక్కువగా ఉన్న యువ రాష్ట్రానికి గణనీయమైన నష్టం. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కేటాయింపులు కూడా రాష్ట్ర-నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా లేవు, దీని వలన రాష్ట్రం యొక్క ఆర్థిక పునరుద్ధరణ మరింత నెమ్మదిస్తుంది.
తెలంగాణ
వ్యవసాయ సంక్షోభం, రాష్ట్ర ఆదాయాలపై సంభావ్య దాడి తెలంగాణ రాష్ట్రం, దాని ప్రగతిశీల వ్యవసాయ మరియు సామాజిక సంక్షేమ పథకాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క మూలస్తంభాలకే సవాళ్లను ఏర్పరుస్తుంది. ప్రధానంగా వ్యవసాయ రంగంపై దృష్టి సారించిన బడ్జెట్, రైతు ఆదాయాలను నేరుగా పెంచడానికి లేదా రైతు ఋణ మాఫీ వంటి చర్యలకు స్పష్టమైన మద్దతు లేదు. తెలంగాణలోని పలు రైతులు ఇప్పటికీ ఋణ బాధతో బాధపడుతుండగా, ఈ విఫలత రాష్ట్ర వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టవచ్చు. ఇంకా, సెంట్రల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టి) కంపెన్సేషన్ చట్టం క్రింద రాష్ట్రాలకు రావాల్సిన పరిహారం విషయంలో కొనసాగుతున్న అస్పష్టత, తెలంగాణ వంటి రాష్ట్రాల ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాష్ట్రాలు తమ స్వంత వనరులపై ఆధారపడటానికి బలవంతం చేయబడినప్పటికీ, సహాయంగా ప్రకటించబడిన కొత్త పథకాలలో చాలా వరకు కేంద్రం-రాష్ట్రం భాగస్వామ్యంతో ఉంటాయి, ఇది ఇప్పటికే ఒత్తిడికి గురైంది రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుంది.
సాధారణ నష్టం
ఫెడరల్ సంబంధాల క్షీణత, దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం లేకపోవడం మొదటి నుంచీ అలవాటే. రెండు రాష్ట్రాలకు సాధారణంగా, ఈ బడ్జెట్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఫెడరల్ సంబంధాలను మరింత బలహీనపరుస్తుంది. రాష్ట్రాల సొంత వనరులను పెంచే అధికారాన్ని పరిమితం చేస్తూ, కేంద్రం మరింత కేంద్రీకృతమవుతోంది. అంతేకాక, దక్షిణ భారత రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఇందులో భాగంగా, జాతీయ ఆదాయంలో తమ వాటాకు మించిన ఆదాయం కేంద్రానికి సమకూరుస్తున్నప్పటికీ, తిరిగి పొందే నిష్పత్తి మాత్రం తగ్గుతూవస్తూంది. మౌలిక సదుపాయాల కేటాయింపులు, పారిశ్రామిక కారిడార్లు తెలుగు రాష్ట్రాలను వదిలేసి ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రాదేశిక పక్షపాతం రెండు రాష్ట్రాల ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు మార్గాలు, ఇండస్ట్రియల్ కారిడార్ల వంటి ప్రాజెక్టుల అభివృద్ధిని దెబ్బదీస్తుంది.
చివరిగా…ఈ బడ్జెట్ అవాస్తవ లెక్కలపై ఆధారపడింది. మొత్తంమీద, ఈ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు వాగ్దానాల యుగంగా కనిపించదు, బదులుగా ఆర్థిక సవాళ్ల యుగంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణ అవసరాలను పట్టించుకోకపోవడం, తెలంగాణ యొక్క వ్యవసాయ-ఆధారిత ఆర్థిక వ్యవస్థకు సరైన మద్దతు లేకపోవడం ద్వారా, ఈ బడ్జెట్ రెండు రాష్ట్రాల భవిష్యత్తు వృద్ధిని, సామాజిక సంక్షేమాన్ని ప్రత్యక్షంగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కుంచించుకుపోవడానికి దోహదపడే ఫెడరలిజం యొక్క క్షీణతకు సంకేతం. కాబట్టి, ఈ బడ్జెట్ తో రెండు తెలుగు రాష్ట్రాలు వారి హక్కుల కోసం కొనసాగించాల్సిన పోరాటానికి మరింత ఆర్థిక మరియు రాజకీయ అడ్డంకులను ఎదుర్కొంటాయి.
- డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్ 9849328496
