- డిబీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
- చరబండ రాజు నగర్ గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
- డిబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్
Women’s rights are human rights : రాజ్యాంగ మౌలిక లక్ష్యాల ప్రాతిపాదికగా స్త్రీ పురుష బేధాలు లేకుండా సమానత్వాన్ని సాధించినప్పుడే సమ సమాజం సిద్ధిస్తుందని అందుకు మహిళలు తమ హక్కుల కోసం నిరంతరం సంఘటితంగా పోరాడాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ పిలుపునిచ్చారు.
ఆదివారం హనుమకొండ జిల్లా 11వ డివిజన్ లోని చెరబండరాజు నగర్ లో డిబీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలచేత కేకు కట్ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కీర్తించారు.
ఆ మహనీయుని స్ఫూర్తితో అమరుల ఆశయ సాధనమైన సమసమాజ స్థాపనే ధ్యేయంగా, రాజ్యాంగ పరిరక్షణ,హక్కుల సాధనే కర్తవ్యంగా ఉద్యమించాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చెరబండరాజు నగర్ కాలనీకి చెందిన దళిత మహిళ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసి,ఇంటి నెంబర్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల హక్కులే మానవ హక్కులని, మహిళా హక్కుల సాధన కోసం డిబీఎఫ్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్,కుమారస్వామి, రాజు,కిరణ్, మహిళ నాయకురాలు రడపాక రేణుక,గన్నారపు సుమలత,బాస్కుల విజయ,ఎర్ర ఎవాంజలి, జన్ను సునీత, జన్ను అనిత, గన్నారపు జాస్మి, మునిగాల ప్రియాంక, గన్నారపు పర్వీన్, పెండ్యాల రమ్య తదితరులు పాల్గోన్నారు.
