Why the ‘urban’ stamp on intellectual churning : ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఒక ప్రాథమిక హక్కు. కానీ, ప్రస్తుత కాలంలో విమర్శనాత్మక గొంతుకలను అణచివేయడానికి ‘అర్బన్ నక్సలైట్’ అనే పదం ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. జర్నలిస్టులు, విద్యార్థులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులపై ఈ ముద్ర వేసి, కఠినమైన ‘ఉపా’ (UAPA) చట్టం కింద ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేయడం, కేసులపాలు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజంలో తమ గౌరవాన్ని తగ్గించేలా చేయడం జరుగుతుంది. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమంటే ఎవరైన కాదంటే ఇక చేసేదేమీ లేదు. ఒకవైపు ప్రభుత్వం మావోయిస్టులను ఆయుధాలు వీడి రమ్మని ఆహ్వానిస్తోంది. మావోయిస్టులు కూడా తమ పంథా మార్చుకోవడం ఆహ్వానించదగిన అంశంగానే చూడాలి. అనేక మంది నాయకులు లొంగిపోయి సాధారణ జీవితం కూడా గడుపుతున్నారు. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్య పంథాలో ఉండి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో విమర్శించే వారిని, ప్రశ్నించే వారిని మాత్రం ‘అర్బన్ నక్సల్స్’ అని ముద్ర వేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమో… ఇదెక్కడి రాజ్యాంగ సూత్రమో పాలకులకే తెలియాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గింది. ఒకరకంగా ఉనికి లేకుండా ఉండే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ముందే చెప్పినట్లుగా అగ్రనాయకత్వం అనేక మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పోరాటాలే మార్గమని వారు భావిస్తున్న తరుణంలో నగరాల్లో నివసించే మేధావులను ‘అర్బన్ నక్సలైట్లు’గా చిత్రించడం వెనుక అర్థం ఏమిటి..? అడవుల్లో తుపాకీ పట్టిన వారికంటే, నగరాల్లో కలం పట్టిన వారు ప్రమాదకరమని ప్రభుత్వం భావించడం విడ్డూరం కాక ఏమవుతుంది…? క్షేత్రస్థాయిలో మావోయిస్టుల ఉనికి తగ్గుతున్నప్పుడు, అకస్మాత్తుగా ‘అర్బన్ నక్సల్స్’ వాయిస్ ను ముందుకు తీసుకురావడం దేనికి సంకేతం..? దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవనగలమా..? మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అంటే కేవలం కులమతాలే కాదు, భిన్న భావజాలాలు కూడా. ఇలాంటి మన దేశంలో గత దశాబ్ద కాలంగా ‘అర్బన్ నక్సల్’ అనే పదం సామాజిక కార్యకర్తలను, మేధావులను వేధించడానికి ఒక సాధనంగా మారిందనే విమర్శలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అడవుల్లో తుపాకీ పట్టిన మావోయిస్టుల కంటే, నగరాల్లో ఉండి వ్యవస్థను ప్రశ్నించే మేధావులు ప్రమాదకరమనే సిద్ధాంతాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను రాసే జర్నలిస్టులను కూడా మావోయిస్టుల సంబంధాలు ఉన్నాయని చిత్రీకరించి జైలుకు పంపడం ద్వారా మీడియాను సైతం భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం కూడా జరుగుతోందనేది మరువొద్దు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం ఉపా (UAPA) కింద నమోదైన కేసుల్లో శిక్ష పడే శాతం కేవలం 2% నుండి 3% మాత్రమే ఉంటుంది. అంటే 97% కేసులు నిరూపణ కాకుండా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగడం, జైల్లో అండర్ ట్రాయల్ ఖైదీలుగా మగ్గడం జరుగుతున్న పరిస్థితి. ఈ లెక్కన సగటున ఒక వ్యక్తి నిర్దోషిగా తేలడానికి 5 నుండి 10 ఏళ్లు పడుతోంది. అప్పటికే ఆ వ్యక్తి జీవితం, ఆరోగ్యం, సామాజిక గౌరవం మంటగలసిపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే భావజాల పోరాటాన్ని చట్టపరమైన వేధింపులతో ఎదుర్కోవడం సరైన పద్ధతి కాదు. మావోయిస్టులు ప్రజాస్వామ్య మార్గంలోకి వస్తుంటే స్వాగతిస్తున్న ప్రభుత్వం, అదే ప్రజాస్వామ్య మార్గంలో విమర్శించే వారిని శత్రువులుగా చూడటం సరికాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను గౌరవించినప్పుడే దేశం బలంగా ఉంటుంది. ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఆయుధం కాకూడదు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం కాదు. ‘అర్బన్ నక్సల్’ అనే ముద్రను రాజకీయ లబ్ధి కోసం వాడటం ఆపి, పౌర హక్కులను కాపాడటమే నిజమైన దేశభక్తి. జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు త్వరితగతిన న్యాయం జరగాలి. చట్టం శిక్షించడానికి ఉండాలి కానీ, భయపెట్టడాని ఉండకూడదు.
దామెర రాజేందర్ (దారా)
సీనియర్ జర్నలిస్ట్
