
- మాలోత్ సాగర్ – ఎంసిపిఐ(యూ) వరంగల్ నగర కార్యదర్శి
What happened on September 17th ? : 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు ఐదు సంవత్సరాల పాటు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పోరాటమిది. దేశ స్వాతంత్రం వచ్చేనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద రాజ్యం హైదరాబాద్ సంస్థానం. నిజాం రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. తెలంగాణతో పాటు ప్రస్తుత కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గ్రామాలలో భూస్వాములు, జమీందారులు, దేశముకు, దోపిడీకి అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. గ్రామ ప్రజలంతా భూస్వాములకు వెట్టిచాకిరి చేయాలి. భూస్వాముల భూమి దునిన్న తర్వాతనే తమ సొంత భూమిని సాగు చేయాలి .అనుకూల సమయంలో భూస్వాముల భూమిని దున్ని విత్తనాలు వేసి నాట్లు నాటి ఆ తర్వాత తమ భూమిలో అడుగు పెట్టాలి. అప్పటికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండవు. ఫలితంగా తమ భూమిలో తగినంత పంట పండేది కాదు. తాము కట్టవలసిన పన్నులు పోగా తినడానికి తిండి మిగిలేదే కాదు. భూస్వాములకు అప్పుల పాలయ్యేవారు. దీంతో వెట్టి చాకిరి చేయవలసి వచ్చేది. వృత్తిదారులు తమ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలి. రజకులు బట్టలు ఉతకాలి. గౌడలు కల్లుగీయాలి .మంగలి సవరం చేయాలి. మాదిగలు చెప్పుల జత ఇవ్వాలి. గొల్ల కుర్మలు గొర్రెలను మేకలను ఇవ్వాలి. వీటన్నిటినీ ఉచితంగానే ఇవ్వాలి. అన్ని ఇచ్చినా సరే దొర, జమీందారులు తృప్తి పడే వారే కాదు. కులవృత్తులన్నిటిమీద పన్ను కూడా చెల్లించాలి. పెళ్లి అయినా చావు కైనా పన్ను తప్పదు. జమీందారులకు కూడా పన్ను చెల్లించవలసిందే. పన్ను కట్టలేక పారిపోయిన రైతులను వెతికి పట్టుకోవచ్చి చిత్రహింసలు పెట్టి మరీ పన్నులు వసూలు చేసేవారు . భూస్వామి కన్నుబడ్డ మహిళలను వదిలే వారే కాదు. భాషా సాంస్కృతిక వివక్షత కొనసాగేది. తెలుగు మాట్లాడితే చిన్న చూపుతో చూసే ధోరణి ఉండేది. ఉర్దూ లేదా మరాఠీ మాట్లాడే వారిని గౌరవంగా చూసేవారు. తెలుగులో చదువుకునే అవకాశం కూడా లేదు .ఆర్థిక, సామాజిక , సాంస్కృతిక సమస్యల నిలయంగా ఆనాటి తెలంగాణ ఉండేది. ఆ సమస్యలే గ్రామాల్లో భూస్వామ్య , దోపిడీ , పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఈ ఆంధ్ర మహాసభ తెలుగు భాషా, సాంస్కృతిక సమస్యల మీద కృషి చేసింది. క్రమంగా అది భాషా పరమైన సమస్యలకే పరిమితం కాకుండా రైతులు, కూలీలు గ్రామీణ పెత్తందారుల దోపిడీ , మాతృభాషకు తగిన స్థానం దక్కకపోవడం ఆంధ్ర మహాసభలో అత్యధికులను కదిలించింది. బలవంతపు వసూళ్లు అధిక పన్ను భరించలేక ప్రజలు ఆంధ్ర మహాసభకు దగ్గరయ్యారు. సంఘం పేరుతో సభ్యులయ్యారు. సంఘం తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది అని గట్టి నమ్మకం. అందుకే అన్యాయాన్ని ప్రశ్నించే వారంతా సంఘంలో సభ్యులయ్యారు.
1944లో భువనగిరి సభతో ఆంధ్ర మహాసభ స్వభావం మారింది. సాంస్కృతిక సంఘంగా మాత్రమే పరిమితం కాలేదు. అది రైతాంగ సమస్యల మీద పోరాట సంఘంగా అవతరించింది. సంఘం పేరుతో రైతాంగ గుండెల్లో నిలిచిపోయింది. రావి నారాయణరెడ్డి , బద్దం ఎల్లారెడ్డి వంటి వారి నాయకత్వంలోకి వచ్చారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు . ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి , పుచ్చలపల్లి సుందరయ్య , భీమిరెడ్డి నరసింహారెడ్డి , మద్ది కాయల ఓంకార్ తదితరులు ఆంధ్ర మహాసభ కార్యకర్తలుగా ఉన్నారు . ఇకనుంచి జనం సంఘంగానే పిలుచుకున్నారు. అన్యాయాలను అరాచకాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రతిఘటన ఉద్యమం క్రమంగా భూ పోరాటంగా మారింది. దున్నేవానికే భూమి దక్కాలని నినదించింది. సోమరిపోతులుగా ఉండి పెత్తనం చేయడం ఇక చెల్లదని భూస్వాములు, జమీందారులు, దేశముక్ ల మీద తిరుగుబాటు ప్రకటించింది. నిజాము రాచరికపు నిరంకుశ పాలన మీద తిరుగుబాటుగా మారింది. పెత్తందారులకు వ్యతిరేకంగా ఊరంతా ఏకమై భూమికోసం, భుక్తి కోసం , వెట్టిచాకిరి నుండి విముక్తి కోసమే కాదు సామాజిక వివక్ష అనిచివేత మీద సమైక్య పోరాటం చేసింది. సాంస్కృతిక ఉద్యమం అన్ని తరగతుల ప్రజలను ఐక్యం చేసి పోరుబాట నడిపించిన చైతన్యం ఈ పోరాటం ప్రత్యేకత . 3000 గ్రామాలలో ఉద్యమం విస్తరించింది . 10 లక్షల ఎకరాల భూమి రైతాంగం స్వాధీనం చేసుకుంది .అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విముక్తి చేసింది. రుణపత్రాలను రద్దు చేసింది. పశువులను పంపిణీ చేసింది. పన్నువసూలు రద్దు చేసింది .
గ్రామ రాజ్యాలు నిర్మించింది మహోన్నత తెలంగాణ సాయుధ పోరాటం. ఈ పోరాటం వలన వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచారు. మహిళలను నిర్ణయాల్లో భాగస్వాములు చేశారు. సమాన హక్కులు అమలు చేశారు. అంటరానితనం నిషేధించారు. ఇవన్నీ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా సాగాయి.
పోరాటంలో స్త్రీ, పురుషులన్న తేడా లేకుండా ఈ మహత్తర పోరాటానికి చిట్యాల ఐలమ్మ చిహ్నంగా నిలిచింది. కుల, మత, ప్రాంతీయ విభేదాలకతీతంగా సాగిన ఉద్యమం ఫలితంగా కుల వివక్షకు తావు లేకుండా పోయింది.సామాజిక వంటలు, సామాజిక భోజనాలు సాగాయి . ఎవరు వంట చేశారు ..ఎవరు తిన్నారు. అన్న ప్రశ్నకు తావు లేదు. వడ్డించే వారెవరో ఎవరూ పట్టించుకోలేదు. జమీందారు , దోపిడీ అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కుల పట్టింపు కొట్టుకుపోయింది. ఈ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15 నా బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ ఇండియా స్థానంలో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా కాకుండా స్వతంత్ర రాజ్యాలుగా సాగుతున్న 565 సంస్థానాలు దాదాపు బ్రిటిష్ ఇండియా పాలకులకు అనుకూలంగా నడుచుకున్న రాజ్యాలే . వాటిలో అతిపెద్ద సంస్థానం నిజాం రాజ్యం. హైదరాబాద్ సంస్థానం తనకు సామంత రాజులుగా పరిగణించాలని ఈ 565 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ప్రాకిస్తాన్లో విలీనం కావాలని బ్రిటిష్ పాలకులు చెప్పలేదు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యాంగ ప్రకటించుకోవడానికి సిద్ధపడ్డాడు. స్వాతంత్ర భారత దేశ ప్రభుత్వం కూడా అంగీకరించింది. నెహ్రూ , పటేల్ ప్రభుత్వం నిజాం రాజుతో 1947లో నవంబర్ 29న యధాతధంగా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం హైదరాబాదు రాజ్యం ఒక సార్వభౌమధికారాన్ని మరొకరు గౌరవిస్తారు. పరస్పరం సహకరించుకుంటారు. అని హోం మంత్రి సర్దార్ పటేల్ నిజాం రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా అంగీకరించారు. కానీ తెలంగాణ ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. నరహంతక నిజాం పాలన అంతం కావాలని హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మహోత్తరమైన పోరాటం కొనసాగింది. నిజాం నిరంకుశ పాలన తాడోపేడో తేలిపోవాలనే స్థాయిలో తిరగబడ్డారు. అదే స్థాయిలో నిజాం పాలన అణిచివేత సాగింది. రజాకార్ల రాక్షస కృత్యాలు కొనసాగాయి. ఇదే సందర్భంగా కాశ్మీర్ సంస్థానమైనటువంటి స్వతంత్ర సంస్థానం కాశ్మీర్ ప్రజల తిరుగుబాటుతో 1947 అక్టోబర్ 27న ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. కానీ నిజాం రాజ్యాన్ని విలీనం చేసుకోవాలని ఆలోచన మాత్రం ప్రభుత్వాన్ని కలగలేదు. కారణం ఇక్కడ సాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని నిజాం అణిచివేయగలరని భావించారు. వారి అంచనాలు తలకిందులు అయ్యాయి . తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది . నిజాం పునాదులను కదిలించింది .నిరంకుశ పాలన కుప్పకూలే స్థితి ఏర్పడింది .గోల్కొండ ఖిల్లా కిందా నీ గోరిగడతం కొడుకు అని ఉద్యమకారులు నిజాం నవాబు గల్లా బట్టి గుంజి నడి బజార్లో ప్రజా కోర్టులో నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఏమాత్రం ఆలస్యమైనా నిజాం రాచరిక సౌధం కుప్పకూలడం ఖాయం తెలంగాణ గడ్డమీద ఎర్రజెండా కమ్యూనిస్టులు కైవసం చేసుకోవడం ఖాయం అన్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం నెహ్రూ, పటేల్ ప్రభుత్వంకు ఇష్టం లేదు. ఇదే జరిగితే భవిష్యత్తు భారత దేశ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించలేనంత అమాయకులు కాదు వారు. అందుకే ఆగమేఘాల మీద సైన్యాన్ని తరలించారు. 1948 సెప్టెంబర్ 13న పటేల్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టాయి. అప్పటికే జబ్బలు జారేసి నిజాం రాజు సెప్టెంబర్ 17న సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు.
నిజాం పాలన అంతం కావాలని ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తెలంగాణ ప్రజల మీద రాజ ప్రముఖ పేరుతో కూర్చోబెట్టాడు. యుద్ధంలో లొంగదీసుకున్నామన్నా పటేల్ సైన్యం శత్రువులను శిక్షించలేదు అందలం ఎక్కించి సకల సౌకర్యాలు కల్పించి సర్దార్ పటేల్ ఉక్కుమనిషి సైన్యాన్ని పంపి నిజాం రాజును లొంగదీసుకున్నాడని ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రచారం చేస్తోంది. యధాతధంగా ఒప్పందం చేసుకున్న విషయాన్ని కావాలనే దాచి పెడుతున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దాటికి తట్టుకోలేక రాజు చేతులెత్తేస్తేనే ఆ సమయంలో పటేల్ సైన్యం రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. పటేల్ సైన్యాలు వచ్చి ఉండకపోతే నిజాం రాచరికం కుప్పకూలేది తెలంగాణ కమ్యూనిస్టుల వశమయేది. భూస్వామ్య వ్యవస్థ రద్దు అయ్యేది . దున్నేవాడికే భూమి దక్కేది. నిరంకుశ నిజాం రాజును నరహంతక రజాకార్ల నాయకుడు కాసిం రజ్వికి ప్రజా కోర్టులో శిక్ష పడేది.పటేల్ సైన్యాలు రంగంలోకి దిగి నిజాం రాజును కాసిం రజ్వి ని భూస్వాములను కాపాడారు. తెలంగాణ గడ్డ కమ్యూనిస్టుల వశం కాకుండా అడ్డుకున్నారు. పేదలు దక్కించుకున్న భూములు గుంజుకొని మళ్లీ భూస్వాములకు అప్పగించారు. హైదరాబాద్ సంస్థానాన్ని వదిలిపెట్టిన , వదిలిపెట్టి పారిపోయిన వారంతా పటేల్ సైన్యాల రాకతో మళ్లీ గ్రామాలకు తరలివచ్చారు. పటేల్ సైన్యం వారికి పూర్తి భద్రత కల్పించింది. కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తిరుగుబాటు జరిపిన వారిని అణచివేసే పని మొదలుపెట్టారు. రైతాంగ పోరాటం సాగకపోతే 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేదే కాదు. ఆ ఘట్టం చరిత్రలో ఉండేదే కాదు. ఇది పూర్తిగా భారత దేశంలో విలీనం కావడం ఎర్ర జెండా విజయమే. సుదీర్ఘ కాలం పాటు సాగిన విరోచిత రైతాంగ పోరాటం ఫలితంగా విలీనం కోరుకున్న తెలంగాణ ప్రజలు దానికోసం డిమాండ్ చేస్తూ వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఈ విలీనాని ఆహ్వానించింది. అప్పటికే పేద రైతులు సాగు చేసుకుంటున్నా పది లక్షల ఎకరాల భూమి మీద సాగుదారులకే హక్కు ఉండాలని రైతులు కోరుకున్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అదే డిమాండ్ చేసింది . కానీ నెహ్రూ, పటేల్ సైన్యం వచ్చి ఆ భూములు గుంజుకొని భూస్వాముల కు కట్టబెట్టడానికి కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు . పోరాడుతున్న ప్రజల మీద సైన్యం విరుచుకో పడ్డది. రాజు పేరు మారి రాజ ప్రముఖ పేరుతో ఉన్న పాలకులు ఉస్మాన్ అలీ ఖాన్ కాసిం రజ్వీ రజాక్ సైన్యానికి తోడుగా ఇప్పుడు పటేల్ సైన్యం చేరింది .
పటేల్ సైన్యానికి రజాకారులు పూర్తి సహకారం అందించారు. నిరంకుశ పాలన 1500 మందిని పొట్టన పెట్టుకుంది .పటేల్ సైన్యం 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి . అయినా పోరాటాన్ని అనచడం సైన్యానికి కూడా సాధ్యం కాలేదు. భూమి మీద హక్కులు ఇవ్వకుండా భూమి పంచకుండా పోరాటం ఆగదని నెహ్రూ ప్రభుత్వానికి అర్థమైంది. రక్షిత కౌలుదారి చట్టం 1951లో ప్రకటించింది. భూసంస్కరణ అమలు చేస్తానని వాగ్దానం చేసింది . ఈ నేపథ్యంలో 1951 అక్టోబర్ 21న సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించారు .