
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం జనవరి 26న, జాతీయ జెండా ఎగురవేసి, జై బోలో స్వతంత్ర భారత్ కి జై అని నినాదాలు ఇచ్చి, జెండాలు పట్టుకొని జై కొట్టడం; ఇంటి మీద ఒక జెండా, ఇంటెనక ఒక జెండా, కారుకు జెండా, బైకుకు జెండా పెట్టుకుని ఊరేగడం; స్ఫూర్తివంతమైన ఈ రోజున, స్వాతంత్రోద్యమ వీరుల త్యాగాలను స్మరించుకోవడం కాకుండా, ఈరోజును కేవలం సెలవు దినంగా భావించి, ఎంజాయ్ చేయడ కాదు, దేశభక్తి అంటే..?
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ఈ దేశ పురోగతికి మౌళిక సేవలు అందిస్తున్న కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల, రైతుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, న్యాయమూర్తుల పట్ల, పాత్రికేయుల పట్ల, పారిశుధ్య కార్మికుల పట్ల, డ్రైవర్ల పట్ల, సకల శ్రామికుల పట్ల, శ్రమ పట్ల నిజమైన గౌరవభావం కలిగి ఉండాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని విడనాడాలి! కులవృత్తులను గౌరవించాలి! అంటరానితనాన్ని పాటించకూడదు! సొంత మతాల పట్ల ఉన్న అభిమానం, పర మతాల పట్ల కూడా ఉండాలి! పరకుల, పరమత సామరస్యాన్ని పాటించాలి! మానవత్వంతో మెలగడమే, మన అందరి అభిమతం అనే స్ఫూర్తి కలిగి ఉండాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ప్రభుత్వోద్యోగులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలి! లంచాలకు, పైరవీలకు తలొగ్గకుండా ఉండాలి! ప్రజల పట్ల జవాబుదారీతనం, వృత్తిపట్ల అంకితభావం ఉండాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
రాజ్యాంగం ద్వారా ఎన్నికైన పాలకులు, పాలనా సిబ్బంది.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, తమ విధులను నిర్వర్తించాలి! ముఖ్యంగా రెవిన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ లలోని కొంతమంది సిబ్బంది.. అనాదిగా దోపిడీ వర్గాలకు కొమ్ము కాస్తూ, ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలకు కారణమౌతున్నారు! ఈ చర్యలు సామాజిక నేరం అని గుర్తించాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
మహిళలను, వృద్ధులను గౌరవించాలి. చిన్న పిల్లలను ప్రేమించాలి! కట్నాల పేరుతో ఆడవాళ్లను హింసించడం అమానుషం, సామాజిక నేరం అని భావించాలి! ఆడవాళ్ళ కష్టాలు తెలిసి కూడా, అత్తలను కోడళ్ళు.. కోడళ్లను అత్తలు, ఆడబడుచులు హింసించడం నేరంగా భావించాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
రోడ్డుమీద వాహనం నడిపేటప్పుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి! మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు జంప్ చేయడం వంటి చర్యలు, సామాజిక నేరం అని భావించాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
పెట్టుబడిదారీ సంస్కృతి మాయాజాలంలో పడి.. రక్త సంబంధాలను, మానవ సంబంధాలను ఆస్తులతో ముడిపెట్టి చూడకూడదు! ఉపకారులకు అపకారం తలపెట్టకూడదు!
దేశభక్తి కలిగి ఉండడం అంటే…
కనిపెంచిన తల్లిదండ్రులు.. కుంటివాళ్ళు అయినా, గుడ్డివాళ్ళైనా, గొప్పవాళ్ళయినా, ఎలాంటి వాళ్ళైనా.. వాళ్ళు కంటికి రెప్పలా కనిపెట్టుకుని పెంచితేనే.. ఇప్పుడు మనిషిగా జీవించగలుగుతున్నాం’ అనే జీవితసత్యాన్ని గ్రహించాలి! కన్నవాళ్ళ పట్ల, కఠినత్వం చూపకూడదు, బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉండాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ఈ దేశ చరిత్రను, స్వాతంత్రోద్యమ చరిత్రను, సామాజిక ఉద్యమాల చరిత్రను, భారత రాజ్యాంగాన్ని చదవాలి, గౌరవించాలి, స్ఫూర్తిని పొందాలి! స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన అమరుల పట్ల.. సమాజం మార్పు కోసం, సామాజిక ఉద్యమాల్లో అమరులైన బిడ్డల పట్ల.. హృదయపూర్వకమైన గౌరవం, స్ఫూర్తి ఉండాలి!
దేశభక్తి కలిగి ఉండడం అంటే…
ఓటు వెయ్యడం కోసం నోటు తీసుకోకూడదు. ఓట్లు వేయించుకోవడం కోసం, నోట్లు పంచకూడదు! రాజ్యాంగం ఇచ్చిన ఓటు విలువను అవమానపరచకూడదు, దోపిడీ దొంగలకు అధికారాలను కట్టబెట్టకూడదు!
దేశభక్తి కలిగి ఉండడం అంటే…
శాస్త్రీయ విజ్ఞానాన్ని, సామాజిక స్పృహను పెంపొందించుకోవడంలో ముందుండాలి! నమ్మకాల పేరుతో, విశ్వాసాల పేరుతో, సంప్రదాయాల పేరుతో.. సమాజంలో మూఢవిశ్వాసాలను, మూఢనమ్మకాలను, అశాస్త్రీయతను పెంచి పోషించకూడదు! భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 51 ఏ (హెచ్)’ను గౌరవించడం, ఆచరించడం.. మనందరి సామాజిక బాధ్యత అని గుర్తించాలి!
దేశభక్తి అంటే నాలుగు అక్షరాల పదమో, భారతదేశ పటమో కాదు! దేశమంటే ప్రజలు, శ్రామిక ప్రజలు! సకల శ్రామికులు శ్రమలు చేస్తేనే, ఈ సమాజం పురోగమిస్తోంది! పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా సమాజానిది! సమాజం లేకుండా నీవు లేవు! అందుకే, ‘సామాజిక స్పృహ కలిగి ఉండడం, శ్రమజీవులను గౌరవించడం, దోపిడీని ప్రశ్నించడం, సామాజిక బాధ్యతతో జీవించడం’ నిజమైన దేశభక్తి అవుతుంది!
ముద్దగౌని సుభాష్
సామాజిక కార్యకర్త, స్వతంత్ర జర్నలిస్టు
Email: dhikkaraswaram@gmail.com
ఫోన్: 9000904284
తేది: 26 జనవరి 2025
——————-®——————-