
- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి. ప్రభాకర్ రెడ్డి
జన నిర్ణయం / హనుమకొండ : హమాలీ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య భవన్లో ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సంగాల మొగిలి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో వివిధ రంగాలలో హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు రోజుకు 10 నుండి 12 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు చేస్తున్నారు. హమాలిలు నిత్యం బరువులు మోయడం వల్ల శరీరం బండ పారిపోతుంది. నడుములు వంగిపోతున్నాయి. నరాలు చచ్చుపడిపోతున్నాయి. దుమ్ము, ధూళి, గాలి, వెలుతురు లేని గోదాములలో పనిచేయడం వల్ల ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారు. పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేకమంది హమాలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాయాలపాలై కాళ్లు చేతులు విరిగి మంచాలకు పరిమితమై వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ప్రభుత్వం కాని, యజమానులు కాని ఎలాంటి సహాయం చేయడం లేదు. తోటి కార్మికులే తోచిన సహాయంతో ఆదుకుంటున్నారు. అధిక బరువులు మోయడం వలన 50 సంవత్సరాలకే ముసలి వారు అవుతున్నారు. కూర్చోవాలన్నా, నిలబడాలన్న నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వానికి హమాలీల పని (ఎగుమతులు దిగుమతులు) ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న, హమాలీల సంక్షేమం కోసం నయా పైసా వీరి సంక్షేమం కోసం ఖర్చు పెట్టకపోవడం అన్యాయం. అందుకే హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడుతూ ఈనెల 26న ఉదయం 10 గంటలకు వెయ్యి స్తంభాల గుడి నుండి అలంకార్ జంక్షన్లోని టీఎన్జీవోస్ భవన్ లో జరిగే హమాలీ కార్మికుల జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఈ మహాసభలో భవిష్యత్లో హమాలీ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నట్లు ఆయన తెలిపారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని చక్రపాణి హమాలి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు దాసరి రవీందర్, పాక కుమారస్వామి, మాట్ల ప్రభాకర్, ఐరబోయిన, రమేష్ ఇనుగాల సుదర్శన్, ల్యాదల విజేందర్, కుమ్మరి రవి, ఇనుగాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.