రాయినిగూడెంలో ఎండిపోతున్న పంటపొలాలు
Water should be supplied to Laknavaram tank through SRSP canal : ములుగు మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని, తక్షణమే ఎస్సారెస్పీ (SRSP) కాలువ ద్వారా లక్నవరం చెరువులోకి నీటిని విడుదల చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏజెన్సీ జోన్ కార్యదర్శి మంకిడి కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం రాయినిగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల్లో నీరు లేక ఎండిపోతున్న వరి పొలాలను పార్టీ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాయినిగూడెం సహా పరిసర గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంట నీరు లేక చేతికందే దశలో ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆశలు వదులుకుంటున్న తరుణంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించాలని కోరారు.
Water should be supplied to Laknavaram tank through SRSP canal
“ఏజెన్సీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలంటే లక్నవరం చెరువుకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని మళ్లించడం ఒక్కటే మార్గం. అధికారులు చొరవ తీసుకొని వెంటనే నీటిని విడుదల చేయాలి, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తాం” అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏజెన్సీ నాయకులు వట్టం సమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, పోతయ్య, రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
