- కొండెక్కిన గ్యాస్ ధర..
- వంటింటి బడ్జెట్ అస్తవ్యస్తం..!
War clouds in the kitchen దేశంలో సామాన్యుడి పరిస్థితి ఇప్పుడు “పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు” తయారైంది. ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న వంట గ్యాస్ ధరలు, తగ్గకపోగా ఒక్కసారిగా భారీగా పెరగడం సగటు మనిషి నడ్డి విరుస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 పెరగడం అనేది కేవలం అంకెలు కావు.. అది ఒక పేదవాడి ఆకలి కేక, ఒక మధ్యతరగతి గృహిణి కన్నీటి వ్యధ.
War clouds in the kitchen
ప్రశ్న ఏమిటంటే.. ఎక్కడో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకుంటే, మన వంటింట్లో మంట ఎందుకు పుడుతోంది..? భారత్ తన గ్యాస్ అవసరాల కోసం సగానికి పైగా ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే, గ్యాస్ సరఫరా ఆగిపోతుందేమో అన్న భయంతో ప్రపంచ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. దాంతో మన దేశంలోని చమురు సంస్థలు కూడా ధరలను పెంచేస్తాయి. కానీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం సామాన్యుడికి అంత వేగంగా చేరకపోవడమే ఇక్కడ విషాదం. గ్యాస్ సిలిండర్ ధర పెరగడాన్న సామాన్య విషయంగా చూడకూడదు. ఒక సిలిండర్ ధర పెరిగితే అది కేవలం గ్యాస్‌తోనే ఆగదు. హోటళ్లలో టిఫిన్ ధరలు పెరుగుతాయి, భోజనం ఖరీదవుతుంది. బయట దొరికే ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. రవాణా, సూక్ష్మ పరిశ్రమల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంది. మరోవైపు జీతాలు పెరగడం లేదు కానీ, నెలనెలా ఖర్చులు మాత్రం కొండలా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు తన పిల్లల చదువుకో లేదా ఆరోగ్యం కోసమో దాచుకున్న డబ్బును వంట గ్యాస్ కోసం ఖర్చు చేయాల్సి వస్తోందనేది గమనించాల్సిన వాస్తవం.
War clouds in the kitchen
మన దేశంలో ఒకవైపు ఆర్థిక వృద్ధి రేటుపై గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సగటు మనిషి తన ఆదాయంలో ప్రధాన భాగాన్ని కేవలం ఇంధనం, నిత్యావసరాలకే వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఈ లెక్కన తాజా ధరల పెరుగుదల కేవలం ఆర్థిక అంశమే కాదు, అది సామాజిక సంక్షోభానికి దారితీసే అంశంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
ఇక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) కింద కోట్లాది మంది పేద మహిళలకు కనెక్షన్లు అందాయి. అయితే, ధర రూ. 900 దాటితే, ఆ కనెక్షన్లు కేవలం అలంకారప్రాయంగా మారే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మళ్లీ పొగచూరిన కట్టెల పొయ్యి వైపు మళ్లే పరిస్థితి పెరిగితే ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా వెనకడుగు వేయడమే అవుతుంది. సబ్సిడీలను కేవలం ఉజ్వల లబ్ధిదారులకే పరిమితం చేసినా, పెరిగిన ధరల నేపథ్యంలో వారు కూడా రీఫిల్లింగ్ భారాన్ని భరించలేకపోతున్నారు. ఉజ్వల లబ్ధిదారులకు ధరల్లో మార్పు లేదని చెబుతున్నప్పటికీ, గ్యాస్ రీఫిల్లింగ్ శాతం క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. ప్రారంభంలో ఉచిత కనెక్షన్ ఇచ్చినా, పెరిగిన ధరల వల్ల రీఫిల్ చేయించుకోలేక మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్న గ్రామీణ మహిళల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.
War clouds in the kitchen
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 55% దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా నెమ్మదించడం వల్ల భవిష్యత్తులో స్టాక్ కొరత ఏర్పడవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో కొంతమంది డీలర్లు స్టాక్ హోర్డింగ్ (నిల్వ చేయడం) చేసే అవకాశం ఉంది. ఇది సామాన్య వినియోగదారుడికి సిలిండర్ బుక్ చేసినా సకాలంలో అందకుండా చేస్తోంది.
ఈ పరిస్థితులపై గ్యాస్ కొరతను అధిగమిస్తామని ప్రధానమంత్రి హామీ ఇస్తున్నప్పటికీ ఆచరణ ఎలా ఉంటుందో చూడాల్సిన అంశం. ప్రభుత్వ ప్రతిపక్షాల వాదనలు చూస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయని, ఇది మన ప్రభుత్వం చేతుల్లో లేని అంశమని, చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే ధరల సర్దుబాటు తప్పదనే వాదనలు ఉన్నాయి. ధరలు పెరిగినా ‘ఉజ్వల’ పథకం లబ్ధిదారులకు ప్రత్యేక సబ్సిడీ ద్వారా రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. అయితే ప్రతిపక్షాలు ఈ ధరల పెంపును ‘నిరంకుశ నిర్ణయం’గా అభివర్ణిస్తూ అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు సామాన్యుడిపై భారం వేసే ప్రభుత్వం, ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. గ్యాస్‌పై ఉన్న జీఎస్టీ ఇతర పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ధరలు వెయ్యి రూపాయలకు చేరువవుతుంటే ‘ఉజ్వల’ కనెక్షన్లు ఉండి ఏం లాభం..? పేదవాడు సిలిండర్ నింపుకోలేక మళ్లీ కట్టెల పొయ్యి వాడుతున్నాడని విమర్శిస్తున్నాయి. చమురు కంపెనీల లాభాల కోసం సామాన్యుడిని బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షం వాదనలో నిజం ఉందనేది అర్థం చేసుకోవాలి.
War clouds in the kitchen
ఏదిఏమైనప్పటికీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే రాజధర్మం. ఈ రాజధర్మాన్ని పాటించి పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల వాటాను తగ్గించాలి. కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కేవలం అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపకుండా, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదా పన్నులను హేతుబద్ధీకరించడం వంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. గ్యాస్ కొరత లేకుండా బఫర్ స్టాక్‌ను పెంచాలి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరల మధ్య సామాన్యుడు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో యుద్ధాలు ఎక్కడ జరిగినా, ఆర్థిక సంక్షోభాలు ఎక్కడున్నా.. వాటి ప్రభావం పేదవాడి పళ్లేం మీద పడకుండా చూడాల్సిన బాధ్యత పాలకులకుంది. పాలకుల నిర్ణయాలు వంటింట్లో మంటలను ఆర్పేలా ఉండాలి కానీ, సామాన్యుడి కడుపు కాల్చేలా ఉండకూడదు. గ్యాస్ మంటలు ఆరిపోవాలి.. పేదవాడి వంటింట్లో పొయ్యి వెలగాలి. అప్పుడే అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
