
- యధేచ్ఛగా అక్రమ నిర్మాణం..!
- కుడా, మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మాణం…
- చోద్యం చూస్తున్న అధికారయంత్రాంగం…
Violation of rules on Hunter Road : హనుమకొండ హంటర్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం జరుగుతుండటం బహిరంగ రహస్యంగా మారింది. నిబంధనకు విరుద్ధంగా నిర్మించబడుతున్న బిల్డింగ్ పై మున్సిపల్ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఎస్ బిపాస్ చట్టం నిరుగారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Violation of rules on Hunter Road
హంటర్ రోడ్డు ప్రధాన రహదారిని అనుకొని నిర్మితమవుతున్న బిల్డింగ్ వ్యవహారం అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారులు అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారనేది ఆరోపణలు లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బిల్డింగ్ యజమానికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారింది. నోటీసుల పేరుతో కాలయాపన చేయడం, ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అధికారులకే చెల్లిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది.