రాష్ట్ర నిరుద్యోగ JAC కన్వీనర్ ‘R.L మూర్తి’తో ‘జన నిర్ణయం’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
Unemployment ‘Jungi Siren’ – OU Chaitanya’s voice : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ధిక్కార స్వరం. ఆ గడ్డపై పరిశోధకుడిగా ఉంటూనే, లక్షలాది మంది నిరుద్యోగుల గుండె చప్పుడును ప్రభుత్వ పీఠాలకు వినిపిస్తున్న యువ నేత ఆర్.ఎల్. మూర్తి. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసిన అనుభవం, నేడు డీవైఎఫ్ఐ ప్రతినిధిగా, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా ఆయనను ఒక శక్తివంతమైన యువజనోద్యమనేతగా నిలుపుతోంది. నోటిఫికేషన్ల జాప్యం, నిరుద్యోగ భృతి అటకెక్కిన వైనం, యూనివర్సిటీలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి, నిరంద్యోగ సమస్యపై ఆయన గళం విప్పుతున్నారు. ఒకవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన..మరోవైపు నిరుద్యోగ సమస్యపై ప్రత్యక్ష ఆందోళనల గర్జనగా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ యువత ఆశలకు ప్రతినిధిగా నిలుస్తున్నారు ఆర్.ఎల్. మూర్తి. ఓయూ కేంద్రంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా నిరుద్యోగులకు ఒక దిక్సూచిగా నిలుస్తున్న ఓయూ రిసెర్చ్ స్కాలర్ నిరుద్యోగ JAC కన్వీనర్ R.L మూర్తితో ‘జన నిర్ణయం’ స్పెషల్ కరస్పాండెంట్ ‘దారా’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
Unemployment ‘Jungi Siren’ – OU Chaitanya’s voice..!
జన నిర్ణయం : విద్యార్థి, యువజనోద్యమ నేతగా, ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా మీ ప్రయాణం ఎలా సాగుతోంది..? ప్రస్తుత నిరుద్యోగ స్థితిగతులపై మీ అంచన ఏమిటి..?
ఆర్.ఎల్. మూర్తి : విద్యార్థి ఉద్యమం నేర్పిన క్రమశిక్షణే నన్ను ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిలబెట్టింది. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని కలలు కన్న యువతకు నేడు నిరాశే మిగులుతోంది. రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. నిరుద్యోగం అనేది కేవలం ఒక గణాంకం కాదు, అది లక్షలాది కుటుంబాల సామాజిక, ఆర్థిక వేదన. ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్లు వేయడమే కాదు, వాటిని పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో విఫలమవుతోంది.
జన నిర్ణయం : ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడూ ఉద్యమాల పురిటిగడ్డ. కానీ నేడు ఓయూ పట్ల ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు..?
ఆర్.ఎల్. మూర్తి : ఉస్మానియాను కేవలం ఒక విద్యాసంస్థగా కాకుండా, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే చైతన్య కేంద్రంగా చూడాలి. దురదృష్టవశాత్తు, ప్రభుత్వాలు ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫండ్స్ తగ్గించడం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం, హాస్టల్ వసతులను పట్టించుకోకపోవడం ద్వారా యూనివర్సిటీ ఉనికిని దెబ్బతీస్తున్నారు. విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ, ఉస్మానియా ఎప్పుడూ ప్రశ్నించే గొంతుకగానే ఉంటుంది.
జన నిర్ణయం : నిరుద్యోగ జేఏసీ (JAC) కన్వీనర్‌గా మీరు వివిధ సంఘాలను ఎలా సమన్వయం చేస్తున్నారు..? ప్రభుత్వానికి మీరు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏమిటి..?
ఆర్.ఎల్. మూర్తి : నిరుద్యోగ జేఏసీ అనేది భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన సంఘాల కలయిక. కానీ, ‘నిరుద్యోగం’ అనే ఉమ్మడి సమస్య మమ్మల్ని ఒకటి చేస్తోంది. ప్రతి సంఘానికి ఒక కార్యాచరణ ఉన్నప్పటికీ, నిరుద్యోగుల ప్రయోజనం దృష్ట్యా మేమంతా ఏకతాటిపైకి వస్తున్నాం. మా ప్రధాన డిమాండ్లు స్పష్టంగానే ఉన్నాయనేది గమనించాలి. జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేయాలి. గ్రూప్స్, టీచర్ పోస్టుల భర్తీలో పారదర్శకత ఉండాలి.
ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టం రావాలి. నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలి.
జన నిర్ణయం : విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులు ఉపాధి కల్పనకు సరిపోతాయా..? ప్రస్తుత విద్యా విధానంపై మీ కామెంట్స్ ఏంటి..?
ఆర్.ఎల్. మూర్తి : ప్రస్తుతం చదువుకు, ఉపాధికి మధ్య పెద్ద అగాధం ఉంది. డిగ్రీలు వస్తున్నాయి కానీ నైపుణ్యాలు రావడం లేదు. కార్పొరేట్ శక్తులకు అవసరమైన ‘లేబర్’ను తయారు చేసే విధంగా విద్యా విధానాన్ని మారుస్తున్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా, విద్యను వ్యాపార వస్తువుగా మార్చడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గుతోంది. పరిశోధన (PhD) అనేది సమాజ హితం కోసం ఉండాలి కానీ, అది కేవలం సర్టిఫికెట్ల కోసం పరిమితం కాకూడదు.
జన నిర్ణయం : రాజకీయాల్లో నిరుద్యోగ సమస్య ఒక ఓటు బ్యాంకు అస్త్రంగా మారుతోందా..? రాజకీయాల ప్రస్తుత పరిస్థితిపై మీ అంచనా..?
ఆర్.ఎల్. మూర్తి : ఖచ్చితంగా. ఎన్నికల సమయంలో నిరుద్యోగం ప్రధాన అజెండాగా మారుతుంది, కానీ అధికారంలోకి వచ్చాక అది వెనక్కి వెళ్తుంది. యువతను కేవలం జెండాలు మోసే కార్యకర్తలుగా చూడకూడదు. రాజకీయాల్లో యువత చైతన్యం పెరిగింది. నిరుద్యోగుల ఆగ్రహం ఏ ప్రభుత్వానైనా గద్దె దించగలదని గత ఫలితాలు నిరూపించాయి. కేవలం భావోద్వేగాలతో కాకుండా, వాస్తవ సమస్యలపై పోరాడే రాజకీయం ఈరోజు అవసరం.
జన నిర్ణయం : ఒక పక్క పీహెచ్డీ పరిశోధన, మరోపక్క నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేస్తున్నారు..?
ఆర్.ఎల్. మూర్తి : నా దృష్టిలో పరిశోధన అంటే కేవలం గ్రంథాలయాలకే పరిమితం కాకూడదు. సమాజంలోని అసమానతలను, సమస్యలను శాస్త్రీయంగా విశ్లేషించడమే నిజమైన పరిశోధన. ఒక విద్యార్థిగా నేను పుస్తకాల్లో చదివిన దానికి, బయట నిరుద్యోగులు అనుభవిస్తున్న ఆవేదనకు మధ్య ఉన్న లంకెను అర్థం చేసుకుంటున్నాను. అందుకే ఈ రెండూ నాకు వేర్వేరు కాదు. నిరుద్యోగుల గళం విప్పడం కూడా నా సామాజిక పరిశోధనలో భాగంగానే భావిస్తున్నాను.
జన నిర్ణయం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా, ఇప్పటికీ ‘నిరుద్యోగం’ అనేది ఒక ప్రధాన ఎజెండాగానే ఉంది. లోపం ఎక్కడ ఉంది..?
ఆర్.ఎల్. మూర్తి : లోపం పాలకుల ఆలోచనా విధానంలో ఉంది. ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని ఒక ‘సంక్షోభం’లా కాకుండా కేవలం ఒక ‘ఎన్నికల స్టంట్’లా చూస్తున్నాయి. నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ నినాదంలో కీలకమైనవి. కానీ, ఖాళీలను భర్తీ చేయడంలో చిత్తశుద్ధి లోపించింది. జాబ్ క్యాలెండర్ అనేది ఒక మొక్కుబడి వ్యవహారంగా మారింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నా, అవి స్థానిక యువతకు ఉపాధిని ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. ఒక తరం యువత తమ విలువైన సమయాన్ని లైబ్రరీలకే అంకితం చేయడం రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరం.
జన నిర్ణయం : ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేత ధోరణి ఉందంటారు కదా మీ స్పందన..?
ఆర్.ఎల్. మూర్తి : చరిత్ర చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఉస్మానియా గొంతును నొక్కలేకపోయింది. ప్రభుత్వం ఇక్కడ పోలీసు బలగాలను మోహరించవచ్చు, అరెస్టులు చేయవచ్చు. కానీ, ఒక విద్యార్థి ఆలోచనను అరెస్ట్ చేయలేరు. యూనివర్సిటీలకు నిధులు కట్ చేయడం ద్వారా విద్యార్థుల చైతన్యాన్ని దెబ్బతీయాలని చూడటం అవివేకం. ఓయూ ఎప్పుడూ ఒక వాచ్డాగ్ లాగా పనిచేస్తుంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తుంది, ఒప్పు చేస్తే అభినందిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు పాలకులు విమర్శను తట్టుకోలేకపోతున్నారు.
జన నిర్ణయం : విద్యా ఉపాధి రంగాల్లో సంస్కరణలు రావాలంటే మీరిచ్చే సూచనలు ఏమిటి..?
ఆర్.ఎల్. మూర్తి : అకడమిక్ టూ ఇండస్ట్రీ పాలసీ అవసరం. చదువు పూర్తయ్యేలోపు విద్యార్థికి కనీసం ఒక నైపుణ్యంలో సర్టిఫికేషన్ ఉండాలి. స్థానిక కోటాను తప్పకుండా అమలు చేయాలి. తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు మన యువతకే దక్కేలా చట్టపరమైన రక్షణ కావాలి. టీజీపీఎస్సీ లాంటి బోర్డులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా, అత్యున్నత ప్రమాణాలు గల నిపుణులతో నిండాలి. జీడీపీలో కనీసం 6% విద్యకు బడ్జెట్ కేటాయించినప్పుడే నాణ్యమైన మానవ వనరులు తయారవుతాయి.
జన నిర్ణయం : రాజకీయాల్లో మీరు చూస్తున్న మార్పు ఏంటి..? రాబోయే రోజుల్లో యువత పాత్ర ఎలా ఉండబోతోంది..?
ఆర్.ఎల్. మూర్తి : ఇప్పటి యువతకు రాజకీయం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు. వారు సోషల్ మీడియా ద్వారా, క్షేత్రస్థాయి ఉద్యమాల ద్వారా నిరంతరం పాలకులను ఆడిట్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యే రాబోయే రోజుల్లో రాజకీయ గమనాన్ని శాసిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా యువత ఆశలను తృణీకరిస్తే.. భవిష్యత్తులో వారు రాజకీయంగా కనుమరుగవ్వక తప్పదు. నిరుద్యోగ జేఏసీ ద్వారా మేము ఒక కొత్త రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్నాం.
“మేము అడుగుతోంది దానం కాదు.. రాజ్యాంగం కల్పించిన ఉపాధి హక్కు. ఉద్యోగం వచ్చే వరకు పోరాటం ఆగదు, అది ఉస్మానియా సాక్షిగా మేమిస్తున్న నినాదం.”
జన నిర్ణయం : నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి..?
ఆర్.ఎల్. మూర్తి : నిరుద్యోగ సమస్య ఉన్నత విద్యావంతుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. అలాంటి ఆలోచనే చేయవద్దు. నిరాశ చెందకండి, అలాగని మౌనంగా ఉండకండి. హక్కుల కోసం పోరాడటం మన బాధ్యత. చదువుతో పాటు సామాజిక చైతన్యం పెంచుకోవాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ మన సమస్యల పరిష్కారం కోసం మనమంతా ఐక్యంగా పోరాడినప్పుడే ఫలితం ఉంటుంది. నిరుద్యోగ జేఏసీ ఎప్పుడూ మీ పక్షాన ఉంటుంది.
జన నిర్ణయం : ఓకే… ఆల్ ది బెస్ట్
ఆర్. ఎల్ మూర్తి : థాంక్యూ…
