- ప్రజా పోరాటాల ధ్రువతార యూ. నాగేశ్వరరావు అస్తమయం
- ‘జన నిర్ణయం’ సంతాప సందేశం
Tribute to ‘Nageswara Rao : నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా, పీడిత ప్రజల గొంతుకగా దశాబ్దాల పాటు సీపీఎం పార్టీలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకులు యూ. నాగేశ్వరరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త జిల్లావ్యాప్తంగా ఉన్న వామపక్ష శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త విన్న ఆయనను ఎరిగిన నాకు కూడా దిగ్భంది కలిగింది. అయ్యో అన్నా…అంటూ ఆందోళన కలిగింది.
వ్యవస్థాపక శక్తిగా.. గొర్లకాపర్ల సంఘం బలోపేతం చేయడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
నాగేశ్వరరావు గారి ప్రస్థానం కేవలం రాజకీయానికే పరిమితం కాలేదు. సమాజంలో అట్టడుగున ఉన్న వృత్తిదారుల సమస్యలపై ఆయనకు అచంచలమైన అవగాహన ఉండేది. గొర్లకాపర్ల సంఘాన్ని ప్రారంభ దశలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విస్తరించడంలో ఆయన కృషి మరువలేనిది. అడవుల్లో మేత సమస్యల నుండి, గొర్రెల పంపిణీ పథకాల వరకు ప్రతి అంశంలోనూ గొర్లకాపరుల వెన్నంటి ఉండి పోరాటాలు నడిపారనేది పరిస్థితి ఉంది. నేడు ఆ సంఘం ఒక బలమైన శక్తిగా ఎదిగిందంటే, ఆనాడు ఆయన వేసిన పునాదులే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బలమైన కారణంగా కారణం చెప్పక తప్పదు.
Tribute to ‘Nageswara Rao
‘ప్రజాశక్తి’లోనూ సేవలు…
ఉద్యమాలకు అక్షరం తోడుండాలని నమ్మిన నాగేశ్వరరావు గారు, ప్రజాశక్తి పత్రిక విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ, పత్రికను సామాన్య ప్రజల దరికి చేర్చడంలో అహర్నిశలు శ్రమించారు. కేవలం ఒక మేనేజర్‌గా కాకుండా, పత్రికా రంగం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చూపిన చొరవ నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శప్రాయం.
Tribute to ‘Nageswara Rao
- కార్మిక పక్షపాతిగా చివరి శ్వాస వరకు…
ఆయన తన ప్రస్థానంలో చివరి అంకాన్ని ట్రేడ్ యూనియన్ విభాగంలో గడిపారు. అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం, సిఐటియు (CITU) అనుబంధ సంఘాల బలోపేతం కోసం ఆయన నిరంతరం తపించారు. ”పదవుల కంటే ప్రజల సంక్షేమమే పరమావధిగా బతికిన అరుదైన నాయకుడిగా నాగేశ్వరరావును వామపక్ష శ్రేణులు గుర్తించాలి. ఆయన మరణం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక చిన్న శూన్యాన్నైనా మిగిల్చిందని తప్పకుండా భావించాలి లేకుంటే పొరపాటే అవుతుంది.
Tribute to ‘Nageswara Rao
డోర్నకల్ నుంచి జ్యోతిరావుపూలే నగర్ నిర్మాణం వరకు
నాగేశ్వరరావు గారి రాజకీయ ఓనమాలు డోర్నకల్ నియోజకవర్గంలోనే మొదలయ్యాయి. నాగేశ్వరరావు గారి పేరు చెప్పగానే వరంగల్ నగరంలో ప్రధానంగా గుర్తుకువచ్చేది జ్యోతిరావుపూలే నగర్. నగరంలోని నిరుపేదలు, మురికివాడల ప్రజలకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో జరిగిన పోరాటంలో ఆయన ముందున్నారు. ప్రారంభంలో అక్కడ జరిగిన అనేక సంఘర్షణల్లోనూ అయన మానసికంగా, భౌతికంగా ముందువరుసలోనే ఉన్నారని ఆయనను ఎరిగిన వారందరూ స్మరించుకుంటున్నారు.
Tribute to ‘Nageswara Rao
- సంతాప సందేశం
సీపీఎం జిల్లా నాయకులు, ఆత్మీయులు యూ. నాగేశ్వరరావు గారి మృతి పట్ల “జన నిర్ణయం” పత్రిక ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.
దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాలే ఊపిరిగా, పీడిత వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన సీనియర్ నాయకులు యూ. నాగేశ్వరరావు గారు అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల మా హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి చేసిన సేవలను మనం మరువద్దు. గొర్లకాపర్ల సంఘం ప్రారంభం పనుల నుండి, ప్రజాశక్తి పత్రికా విస్తరణ వరకు, ట్రేడ్ యూనియన్ రంగంలో కార్మికుల హక్కుల పోరాటం వరకు ఆయన పోషించిన పాత్ర ఆయన పరిధిలో మెరుగైనదే. సమస్య ఏదైనా, ఆయన స్పందించే తీరు కార్యకర్తలను నడిపించే పద్ధతి అందరికీ ఆదర్శమే.
వారి మరణం కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం ప్రజాస్వామ్య, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఆ పార్టీ శ్రేణులకు ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయనను ఎరిగిన నేను ఆయనకు శ్రద్దాంజలి ఘటించడం నా బాధ్యతగా భావిస్తున్న. ప్రత్యక్షంగా ఆయన అంతిమ యాత్రలో నేను పాల్గోనే అవకాశం లేకపోయినప్పటికీ ఆయన పని చేసిన ప్రారంభ కాలంలోనూ, పరిణామక్రమంలో ఆయనను ఎరిగి నన్ను కూడా ఎరిగి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పని చేసిన అనుభవం ఉన్న నాను నన్ను ఎరిగిన మిత్రులు వివిధ పక్షాలలో ఉన్న మిత్రులందరి తరుపున యూ. నాగేశ్వరావు కు అశృనివాళి.
రాజేందర్ దామెర (దారా)
