కోతుల బెడదకు LIC ఏజెంట్ బలి
కోతుల నుంచి తప్పించుకోబోయి భవనం పైనుంచి కిందపడి మృతి
Tragedy in cotton farming : శ్రీరామ నవమి వేళ ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ సంబరాల్లో ఉండాల్సిన పత్తిపాక గ్రామం, తమ ఊరి వ్యక్తి అకాల మరణంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోతుల బెడద నుంచి తప్పించుకోబోయి భవనంపై నుండి పడి తడుక కర్ణాకర్ (LIC ఏజెంట్) మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన తడుక కర్ణాకర్ గౌడ కులస్తుడు. వృత్తిరీత్యా ఎల్ఐసీ (LIC) ఏజెంట్గా పనిచేస్తూ అందరికీ సుపరిచితుడు. శుక్రవారం శ్రీరామ నవమి కావడంతో గ్రామం పండుగ పనుల్లో నిమగ్నమై ఉంది. ఉదయం రోజువారి పనుల్లో నిమగ్నమైన కర్ణాకర్ తన భవనంపై ఉన్న సమయంలో అకస్మాత్తుగా కోతులు వచ్చాయి. ఆ కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో కాలు జారి భవనం పైనుంచి కింద పడిపోయారు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
గ్రామంలో విషాద ఛాయలు
కర్ణాకర్ మృదుస్వభావిగా, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తనపని తాను చెసుకుంటూ జీవితాన్ని, కుటుంబాన్ని సాగించే వ్యక్తి పండుగ రోజే ఇలా విగతజీవిగా మారడంతో గ్రామస్థులు షాక్కు గురయ్యారు. కోతుల బెడద వల్ల ఒక నిండు ప్రాణం బలికావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
