Times have changed the path has to change : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవుజీ), పోలిట్బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్) వంటి అగ్రనేతలు ఒకేసారి లొంగిపోవడాన్ని స్వాగతించాలి. వీరి నిర్ణయం కేవలం వ్యక్తిగతమైనది కాదు, ఒక సుదీర్ఘ భావజాల పోరాటంలో వచ్చిన మార్పుగా చూడాలి. ఈ పరిణామ క్రమంలో మావోయిస్ట్ పార్టీలో ఒక శకం ముగినట్లైంది. దశాబ్దాల పాటు తుపాకీ గొట్టమే అధికారానికి మార్గమని నమ్మిన మావోయిస్టు అగ్ర నాయకత్వం.. 2026 ఫిబ్రవరి 24న జనజీవన స్రవంతిలోకి రావడం ఒక చారిత్రక పరిణామంగా చూడక తప్పదు. గతంలో మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న తదిత నేతలతో పాటు ప్రస్తుతం దేవ్ జీ వంటి వారు ఆయుధాలు విడిచిపెట్టడం కేవలం ఒక లొంగుబాటుగా చూడటం కంటే అది ఒక సిద్ధాంతం ఎదుర్కొంటున్న మనుగడ సంక్షోభానికి నిదర్శనంగా చూడాలి. ఈ పరిణామాన్ని స్వాగతించాలి.
Times have changed… the path has to change..!
కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత మావోయిస్టు పార్టీ మే 21, 2025న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని కోల్పోయింది. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు హిడ్మా, సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, గాజర్ల రవి, పాక హనుమంతు, అనల్దా తదితర ముఖ్య నాయకులను సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యం నిర్దేశించింది. ప్రస్తుతం గడువు కూడా దగ్గర పడింది. ఈ దిశగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో గంతొ నుండే భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపట్టాయి. గత కొన్నేళ్లలో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా, వేలాది మంది లొంగిపోయారు. అనేకులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో కొన్నేండ్లుగా సాగుతున్న సైద్ధాంతిక చర్చ కీలక నేతలను ఆయుధాలను వీడేలా చేసినట్లుగా వారి మాటల్లో స్పష్టం అవుతోంది. చాలా కీలకమైన నేతలు ఇంకా జనం కోసం పనిచేస్తామని తమ లాంగుబాటు ప్రకటనల్లో స్పష్టం చేయడం తమ పంథాను మార్చుకున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ్యంగబద్ధంగా రాజకీయ పంథాను జనంకోసం కొనసాగిస్తామని చెప్పడం ఒక నూతన మార్పుగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే పంథా మార్చుకుంటున్న మావోయిస్టులను నిందించడం కంటే స్వాగతించాల్సిన అవసరం ఉంది. దేవుజీ వంటి నేతలు “చట్టబద్ధమైన పంథాలో ప్రజా సమస్యలపై పోరాడతాం” అని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. హింస ద్వారా సాధించలేని మార్పును, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాధించవచ్చనే స్పృహ కలగడం ఒక మంచి పరిణామం. ఇదే విషయాన్ని కొంతకాలం కింద మల్లోజుల, ఆశన్నలు కూడా ప్రకటించారు. ఈ పరిణామ క్రమాన్ని కేవలం ఒక లొంగుబాటుగా మాత్రమే కాకుండా దశాబ్దాల రక్తపాతానికి ముగింపు పలికే దిశగా పడిన ఒక బలమైన అడుగుగా చూడాలి. మారిన పరిస్థితులకనుగుణంగా తమ పంథాను మార్చుకున్నట్లుగా చూడాలి. ముందే చెప్పినట్లుగా ప్రస్తుతం ఆయుధాలు వీడినవారితో పాటు ఆ పార్టీలో ముఖ్య నాయకులుగా వున్న మల్లోజుల వేణుగోపాలరావు, తక్కళ్ళపల్లి వాసుదేవరావుతో పాటు, ఆజాద్, చంద్రన్న, సంజీవ్, కంకణాల రాజిరెడ్డి, బర్సే దేవా తదితర ముఖ్యులూ ఉన్నారు. దశాబ్ధాలకాలం కష్టనష్టాలకోర్చి, ప్రాణాలను తృణప్రాయంగా భావించి పనిచేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలితానివ్వదని అనుభవం నుండి నేర్చుకున్న పరిణామ క్రమం వారిని పంథా మార్చుకునేలా చేసిందని భావించాలి.
Times have changed… the path has to change..!
ఒకప్పుడు భూమి, భుక్తి కోసం సాగిన పోరాటం మారుతున్న కాలంతో పాటు అభివృద్ధి చెందుతున్న గిరిజన ప్రాంతాల్లో తన ప్రాముఖ్యతను కోల్పోయింది. రోడ్లు, నెట్వర్క్, ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరడం వల్ల “సాయుధ విప్లవం” పట్ల ఆకర్షణ కూడా తగ్గిందని చెప్పక తప్పదు. ఇక ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా సాగుతున్న భద్రతా దళాల గాలింపు చర్యలు అగ్రనేతలను ఆత్మరక్షణలో నెట్టేసేలా చేసింది. మరోవైపు మావోయిస్టు పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, 2004లో పీపుల్స్ వార్, ఎంసీసీ విలీనంతో మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పటికీ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో సాయుధ పోరాటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పంథా నేటి కాలానికి సరిపోదనేది వాస్తవ పరిస్థితుల్లో తేలిపోయింది. కాలక్రమంలో మారుమూల గ్రామాలు కూడా మార్కెట్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. దీంతో విప్లవం కంటే అభివృద్ధి, ఉపాధి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
ఓటు హక్కు ద్వారా అధికార మార్పిడి జరుగుతున్న క్రమంలో, సాయుధ పోరాటం ద్వారా వచ్చే మార్పు నెమ్మదిగా ఉందని, విధ్వంసకరంగా ఉందనేది కూడా తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితి మావోయిస్టు పంథా ఒకప్పటికంటే ఇప్పుడు అనువుగా లేదనేది కూడా తెలిపోయింది. మావోయిజం వైపు కొత్త తరం యువత చేరడం దాదాపు తగ్గిపోయింది. ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల నుండి ఒకప్పుడు వెల్లువెత్తిన మేధోవలస ఇప్పుడు ఆగిపోయింది. ఇక అభ్యుదయం గిట్టని పాలకులు మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ వేగవంతం చేశారు. అడవుల్లోకి రోడ్లు, సెల్ టవర్లు రావడం వల్ల మావోయిస్టుల రహస్య కదలికలు కష్టమయ్యాయి. గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాల నిరంతర ఒత్తిడి పార్టీ నెట్వర్క్ను ఛిన్నాభిన్నం చేసింది. ఇలాంటి అనేక కారణాలను, మార్పులను మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంథా మార్చుకునే పరిణామక్రమగానే ఆయుధాలు వీడటం, లొంగుబాట్లు అనేది చూడాలి. అయితే వీరంతా ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యంగ బద్ధంగా ప్రజలకోసం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడే ఆ మార్పుకు మనుగడ ఉంటుంది. ఉద్యమంలో అమరులైన వారి త్యాగలకు, పంథా మార్చుకున్న వారి దశాబ్ధాలకాలం త్యాగాలకు విలువ ఉంటుంది. ప్రభుత్వం కూడా వీరి అనుభవాన్ని గిరిజన సమస్యల పరిష్కారానికి, భూ సంస్కరణల అమలుకు, ప్రజాసంక్షేమానికి వాడుకోవాలి. తుపాకీలు నిశ్శబ్దమవ్వడం అంటే సమస్యలు ముగిసినట్లు కాదు. ఆయుధాలు లేని పోరాటంతో ప్రజల సమస్యలను పరిష్కరించుకునే కొత్త శకం ప్రారంభమైందని అర్థం చేసుకోవాలి. మాలిన కాలానికి అనుగుణంగా మావోయిస్టు పార్టీ నేతల పంథా మారడాన్ని నిందించడం కంటే స్వాగతించాల్సందే..!
- రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
