పత్తిపాకలో స్టోన్ క్రషర్ ఇష్టారాజ్యం..!?
They swallowed the lump they dug the grave : ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నా, కొందరు ధనార్జనే ధ్యేయంగా సాగిస్తున్న అక్రమ దందాలు గ్రామాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ మరియు డాంబర్ ప్లాంట్ ఇప్పుడు అచ్చం ఇలాంటి వినాశనానికే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి యధేచ్ఛగా సాగిస్తున్న ఈ ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్లాంట్లు పత్తిపాక ప్రజల పాలిట యమపాశాలుగా మారాయని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గమైన ఉప సర్పంచ్ తో పాటు, 11మంది వార్డు మెంబర్ల నేతృత్వంలో ఈ క్రషర్, డాంబర్ ప్లాంట్ మాకొద్దు అంటూ తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
They swallowed the lump they dug the grave
కదులుతున్న భూమి.. పగులుతున్న ఇండ్లు…
క్రషర్ నిర్వహణలో భాగంగా చేస్తున్న భారీ ‘బోర్ బ్లాస్టింగ్స్’ వల్ల భూమి తీవ్రంగా కంపించిపోతోంది. ఇది కేవలం ప్రకంపనలకే పరిమితం కాకుండా, గ్రామంలోని నివాస గృహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తమ కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు నిలువునా పగుళ్లు ఇస్తున్నాయి. ఏ క్షణాన ఏ గోడ కూలి మీద పడుతుందోనన్న భయంతో ప్రజలు రాత్రుళ్లు నిద్రపోవడానికే భయపడుతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. రక్షణ చర్యలు లేకుండా, ముందస్తు సమాచార హెచ్చరికలు లేకుండా చేస్తున్న ఈ పేలుళ్ల వల్ల పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
They swallowed the lump they dug the grave
వ్యవసాయంపై ‘ధూళి’ పంజా
ఒకవైపు పేలుళ్ల వల్ల ఎగిరి పడుతున్న రాళ్లు పంట పొలాలను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు క్రషర్ మరియు డాంబర్ ప్లాంట్ నుండి వెలువడే విపరీతమైన దుమ్ము, ధూళి వ్యవసాయాన్ని కుప్పకూల్చుతున్నాయని ఉప సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు తెలుపుతున్నారు. ఆకులపై దట్టమైన ధూళి పొరలు పేరుకుపోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక పంటలు సరైన విధంగా దిగుబడి ఇవ్వట్లేదని, అనుమతులకు మించి గుంట్టను మింగి గుట్ట అడుగుభాగాన్ని లోతుగా తోడేయటం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితి. దీనికి తోడు డాంబర్ ప్లాంట్ నుండి వచ్చే విషపూరితమైన పొగ వల్ల అటు పశువుల ఆరోగ్యం, ఇటు రైతుల శ్వాసకోశ ఆరోగ్యం కనిపించకుండా దెబ్బతింటోందని, శబ్ద కాలుష్యం గ్రామస్థులకు నిత్య నరకంగా మారిందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
They swallowed the lump they dug the grave
గుట్టను మింగేసి.. పాతాళానికి తవ్వేసి
అనుమతులు పొందిన పరిమితికి మించి ఇక్కడ క్రషర్ నిర్వహణ సాగుతోంది. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన గుట్టను క్రమంగా మింగేసిన నిర్వాహకులు, ఇప్పుడు ఏకంగా భూమి అడుగుభాగం వరకు తవ్వకాలు జరిపారు. పాతాళాన్ని తలపించేలా పదుల మీటర్ల లోతుకు తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా రాళ్లను పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు గ్రామస్తులు చెప్తున్నారు.
They swallowed the lump they dug the grave
అధికారుల ఉదాసీనత – ప్రజా ఆగ్రహం
ఇంత జరుగుతున్నా మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మరియు రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ తో సహా 11 మంది వార్డు సభ్యులు గ్రామ ప్రజలతో కలిసి గళమెత్తుతున్నా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపే నాథుడే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.పత్తిపాక గ్రామ ప్రజల ఆవేదన ఇప్పుడు ఒక హెచ్చరిక. పర్యావరణాన్ని నాశనం చేస్తూ, ససజ వనరులను యధేచ్ఛగా మింగేస్తున్న సామాన్యుల ఈ స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లను తక్షణమే నిలిపివేయాలి. జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా స్పందించి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి. లేనియెడల, తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి పత్తిపాక ప్రజలు పెద్ద ఎత్తున స్పందించడమే ఏకైక మార్గంగా కనిపిస్తున్నది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు
