
- రెవెన్యూ, జీపీ అధికాల వెల్లడి…
- తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజాసంఘాలు…
- విచారణ చేపడుతాం : తహశీల్దార్
- మా దృష్టిలో లేదు : ప్రగతి సింగారం ఇంచార్జీ పంచాయతీ సెక్రటరీ
- డాంబర్ ప్లాంటు ను మూసేయాలి : సిపిఎం నాయకులు, ప్రగతి సింగారం గ్రామ మాజీ సర్పంచ్ చిలుకల కొమురయ్య
There is no permission for that asphalt plant : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ శివారులోని డాంబర్ ప్లాంట్ ఏర్పాటు పై అనుమానాలు నిజమవుతున్నాయి. అనుమతులు లేకున్నా యధేచ్ఛగా డాంబర్ ప్లాంట్ ఏర్పాటు జరిగిందనే ఆరోపణలణ నేపథ్యంలో “ప్రగతి కాలుష్యం” అనే శీర్షికతో సోమవారం జన నిర్ణయం కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. జన నిర్ణయం కథనం మండలంలో చర్చానీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలనకు దిగినట్లు సమాచారం. ఆర్ఐ క్షేత్రస్థాయి విచారణకు వెళ్లగా నిర్వాహకులు అందుబాటులో లేరని దాటి వేసినట్లు తహశీల్దార్ తెలుపడం గమనార్హం. అయితే ఎలాంటి అనుమతులు తమ దృష్టిలో లేవని తహశీల్దార్ జన నిర్ణయం ప్రతినిధికి తెలుపారు. అనుమతులు లేకుండా ఏర్పాటైన డాంబర్ ప్లాంట్ పై సమగ్రమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు ప్రగతి సింగారం గ్రామ ఇంచార్జీ పంచాయతీ సెక్రటరీ సైతం జీపీ పర్మిషన్ లేదని తెలుపడం గమనార్హం. దీంతో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన డాంబర్ ప్లాంట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇట్టి డాంబర్ ప్లాంట్ నిర్వాహకులకు అన్నిరకాలుగా సపోర్ట్ చేస్తున్న వారికి జన నిర్ణయం కథనం ఈసడింపుగా మారిందనే ప్రచారం కూడా లేకపోలేదు. అధికారులు సైతం డాంబర్ ప్లాంట్ నిర్వాహకుల పలుకుబడికి తలొగ్గకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన డాంబర్ ప్లాంట్ పై చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలని పలువురు భావిస్తున్నారు.
డాంబర్ ప్లాంటు ను మూసేయాలి : చిలుకల కొమురయ్య, సిపిఎం కార్యదర్శి – ప్రగతి సింగారం గ్రామ మాజీ సర్పంచ్
ప్రగతి సింగారం గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ ను వెంటనే మూసివేయాలి. ప్రభుత్వ అనుమతి లేకుండానే డాంబర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఇప్పటికే గ్రామ శివారులో నడుస్తున్న క్రషర్ల శబ్దాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, యదేచ్చగా డాంబర్ ప్లాంటు ఏర్పాటు చేయడం గ్రామ పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం స్పందించడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి డాంబర్ ప్లాంటును మూసి వేయాలి. లేదంటే ప్రత్యక్ష ఆందోళనలు తప్పవు.
- పర్మిషన్ లేదు – విచారణ చేపడుతాం : తహశీల్దార్ – శాయంపేట
ప్రగతి సింగారం గ్రామ శివారులోని డాంబర్ ప్లాంట్ ఏర్పాటుపై పర్మిషన్ లేదు. తమ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేదు. విచారణ చేపట్టినాం. పర్మిషన్లు గతంలో ఎవరైనా ఇచ్చారా లేదా అనేది పరిశీలిస్తున్నాం. మా పరిధిలో మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఆర్ఐని పంపించడం జరిగింది. సదరు డాంబర్ ప్లాంట్ నిర్వాహకులు స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఎలాంటి పర్మీషన్లు లేకుండా డాంబర్ ప్లాంట్ ఏర్పాటు అనేది విరుద్ధమైన చర్య. సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు చేపడుతాం.
- నోటీసులో లేదు : ఇంచార్జీ పంచాయతీ సెక్రటరీ – ప్రగతి సింగారం
నేను ఇంచార్జీ పంచాయతీ సెక్రటరీని మాత్రమే. నా నోటీసులో లేదు. ఆ డాంబర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తప్పకుండా గ్రామ పంచాయతీ తీర్మాణం ఉండాలి. కానీ గ్రామ పంచాయతీ తీర్మాణం ఉన్నట్లుగా నా దృష్టిలో లేవని లేదు. నాకు తెలిసి గ్రామ పంచాయతీ తీర్మాణం లేదు. ఇది విరుద్ధంగా ఏర్పాటైన డాంబర్ ప్లాంట్. పర్మనెంట్ పంచాయతీ సెక్రటరీకి తెలుసో లేదో కూడా తెలియదు.