- స్పీడ్ గా సాగుతున్న సర్వేలు..
- రైతులను ఒప్పించే పనిలో నిమగ్నం..
- గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సవాల్ గా మారిన వైనం..
The stage is set for a new crusher in Pathipaka : పత్తిపాక గ్రామ శివార్లలో మరో కొత్త క్రషర్ పరిశ్రమ ఏర్పాటుకు తెరవెనుక పావులు వేగంగా కదులుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, త్వరలోనే భారీ స్థాయిలో క్రషర్ యూనిట్ ఏర్పాటు కాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సర్వేలు నిర్వహిస్తుంటే, మరోవైపు గ్రామ పంచాయతీ ఈ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక సందిగ్ధంలో పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
The stage is set for a new crusher in Pathipaka..!?
వేగంగా సాగుతున్న సర్వేలు
గత కొన్ని వారాలుగా క్రషర్ ఏర్పాటు కోసం పత్తిపాక పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భూమి స్వభావం, పర్యావరణ ప్రభావం, రవాణా సౌకర్యాలపై రహస్యంగా సర్వేలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంగళవారం (ఈరోజు) సర్వే చేస్తున్నారనేది బహిర్గతం కావడం చర్చలు మరింత జోరందుకున్నాయి.
The stage is set for a new crusher in Pathipaka..!?
రైతుల మద్దతు కోసం రాయబారాలు
క్రషర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో భాగంగా, సంబంధిత యాజమాన్యం రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం సాగుతున్నది. తమ చాణక్యనీతితో రైతుల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఉన్న క్రషర్ వల్ల దాని పర్యవసనాలు చూసిన రైతులు పంట పొలాలు దెబ్బతింటాయని, ధూళి వల్ల ఆరోగ్యం పాడవుతుందని మరికొందరు రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
The stage is set for a new crusher in Pathipaka..!?
పంచాయతీ పాలకవర్గానికి పెద్ద చిక్కే…
కొత్త క్రషర్ ఏర్పాటు అంశం ఇప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు గ్రామస్తుల నుంచి వస్తున్న నిరసనలతో పంచాయతీ పాలకవర్గం సతమతమవుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న క్రషర్, డాంబర్ ప్లాంటును తొలగించాలని ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు కొందరు తమతమ పద్దతుల్లో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరో కొత్త క్రషర్ ఏర్పాటుపై గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో అనేది చర్చానీయాంశంగా మారింది. గ్రామ సభలో తీర్మానం లేకుండా అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు డిమాండ్ చేస్తుంటే, పైస్థాయి నుంచి వస్తున్న ఆదేశాలను కాదనలేని పరిస్థితిలో పాలకవర్గం ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని బలిపెడతారా..? లేక రైతుల పక్షాన నిలబడి క్రషర్ ను అడ్డుకుంటారా..? అన్నది ఇప్పుడు పత్తిపాకలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఉన్న క్రషర్ వల్ల గ్రామస్తులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నామని, ఓ గుట్ట కనుమరుగైందని, విచ్ఛలవిడి బోర్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని ఇప్పుడు మరో కొత్తది వస్తే దాని పర్యవసనాలు భరించడం ఇక్కడ కష్టమని పలువురు వాపోతున్నారు. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు
