The roar of microphones has ended and the voter’s ‘ inner turmoil’ has begun : గత వారం రోజులుగా సాగిన మైకుల హోరు శాంతించింది. వీధుల పొడవునా ఊరేగింపులు, ఇంటింటికీ తిరుగుతూ చేసిన అభ్యర్థనలు, ఒకరిపై ఒకరు విసురుకున్న విమర్శల పర్వం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో అసలైన ‘నిశ్శబ్ద విప్లవం’ మొదలైంది. 11వ తేదీ పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు వేసే ముద్ర, రాబోయే ఐదేళ్ల నగర భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఈ తరుణంలో ఓటరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి..? ప్రలోభాలకా..? లేక ప్రగతికా..? అనేది ఓటరు మదిలో అంతర్మథనం మొదలైంది. ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చిన హామీలు ఆకాశాన్ని తాకాయి. మంచినీరు, గుంతలు లేని రోడ్లు, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ..ఇలా ఎన్నో వాగ్దానాలు విన్నాం. అయితే, గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి..? ఇప్పుడు చెబుతున్నవి నగర మున్సిపాలిటీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్నాయా..? అన్నది ఓటరు విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం ఇది అనేది
The roar of microphones has ended and the voter’s ‘ inner turmoil’ has begun
ప్రలోభాల ‘గాలం’.. విజ్ఞతతో దాటాలి
ఎన్నికల చివరి అంకంలో మద్యం, నగదు పంపిణీ వంటి అడ్డదారులు తొక్కేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. కేవలం ఒక్క రోజు ఆశ కోసం ఐదేళ్ల అభివృద్ధిని పణంగా పెట్టవద్దని మేధావులు సూచిస్తున్నారు. తమ వీధి సమస్యను పట్టించుకునే వారు కావాలా..? లేక కేవలం ఎన్నికలప్పుడే కనిపించే వారు కావాలా..? అన్నది ఓటరు ఓటు ద్వారా తేల్చాలి. మున్సిపాలిటీ పాలన అనేది ఆ మున్సిపాలిటీ ప్రజల దైనందిన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి మంచినీరు, పారిశుధ్యం, వీధి దీపాలు ఇలా ప్రతిదీ స్థానిక సంస్థల పరిధిలోనే ఉంటుంది. అందుకే చదువుకున్న వారు, యువత ‘ఓటు’ వేయడాన్ని సెలవు దినంగా భావించకుండా, బాధ్యతగా భావించి పోలింగ్ కేంద్రానికి తరలి రావాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి గతంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు..? సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే సత్తా ఉందా..? కేవలం విమర్శలకే పరిమితమయ్యారా లేక స్పష్టమైన విజన్ ఉందా..? అనేది ఓటర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ఓటర్ హక్కు మాత్రమే కాదు, తన ఆయుధం. ఆలోచించి వేసే ప్రతి ఓటు తమ వార్డు రూపురేఖలను మారుస్తుంది. ప్రచార ఆర్భాటాలను పక్కన పెట్టి, నిజమైన సేవకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అక్షరాలా ఓటర్ చేతుల్లోనే ఉంది. ఏదిఏమైనప్పటికీ మున్సిపాలిటీ ఎన్నికల అంకంలో ముగిసిన మైకుల హోరు ముగిసి ఓటరులో ‘అంతర్మథనం’ మొదలైందనేది గమనార్హం.
- రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
