‘చింతలొద్ది’ చిర్రకుంట గుట్టల్లో గుట్టుగా ‘క్రషర్’ సర్వే…
పత్తిపాక శివారులో మరో గుట్టకు ముప్పు…
The past destruction of ‘Pattipaka’ is a warning : “ఒక గుట్టను సృష్టించడానికి ప్రకృతికి కొన్ని లక్షల ఏళ్లు పడుతుంది. కానీ మనిషి తన స్వార్థం కోసం దానిని కొద్ది నెలలు, కొన్ని ఏండ్లలోనే నామరూపాల్లేకుండా చేస్తున్నాడు.” ఇందుకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ శివారులోని ఒక గుట్ట కనుమరుగు కావడమే సాక్ష్యం. గతంలో జరిగిన విచ్చలవిడి మైనింగ్‌కు ఒక గుట్ట పూర్తిగా నామరూపాల్లేకుండా పోగా, ఇప్పుడు పక్కనే ఉన్న మరో సహజ సంపదపై కొందరి కన్ను పడింది. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ వల్ల ఒక కొండ అస్తిత్వమే కోల్పోయింది. నిబంధనలను అతిక్రమించి, భూమి పొరల్లోకి వందల అడుగుల మేర లోతుగా తవ్వకాలు జరిపి గుట్టను మింగేశారు. ఇప్పటికే ఒక గుట్ట ఆనవాళ్లు కనుమరుగైతే ఇప్పుడు మరో గుట్టను పిండి చేసేందుకు రంగం సిద్ధమవుతోందని విశ్వాసనీయ సమాచారం.
The past destruction of ‘Pattipaka’.. is a warning..!
గుట్టుగా ‘చింతలొద్ది’ ‘ చిర్రకుంట’ గుట్టల్లో సర్వే..!?
పత్తిపాక శివారు చింతలొద్ది, చిర్రకుంట ఏరియాలోని గుట్టలను లక్ష్యంగా చేసుకుని మైనింగ్ మాఫియా పావులు కదుపుతోంది. ప్రజలకు తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ గుట్టను కూడా క్రషర్ల పాలు చేస్తే భవిష్యత్తులో ఆ గుట్ట సైతం కనుమరుగవడం ఖయంగా కనిపిస్తోంది. ఒక ఊరి భౌగోళిక స్వరూపం మారడానికి శతాబ్దాలు పడుతుంది. కానీ, పత్తిపాక గ్రామ స్వరూపమైన ఆ గ్రామ శివారులోని ఒక భారీ గుట్ట కళ్లముందే మ్యాప్ నుంచే మాయమైపోయింది. ఇది అభివృద్ధికి నిదర్శనమా..? లేక అడ్డగోలు దోపిడీకి పరాకాష్టా..? అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావులను, పర్యావరణ ప్రేమికులను, పత్తిపాక గ్రామంలోని చైతన్యవంతులైన ప్రజల్లో కలుగకుంటే చలనం లేనట్లే అవుతుంది. గతంలో జరిగిన తప్పిదమే పునరావృతమవుతూ, ఇప్పుడు చింతలొద్ది, చిర్రకుంట గుట్టలపై మైనింగ్ మాఫియా కన్ను పడటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించకుంటే ఆ ఊరు భవిష్యత్తుకు మూల్యం చెల్లించక తప్పదు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమ మైనింగ్‌పై క్రషర్ నిర్వహణ పట్ల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అడుగు భాగం వరకు తోడేసినా మైనింగ్ విజిలెన్స్, పొల్యూషన్ తదితర విభాగానికి ఎందుకు కనిపించడం లేదు..? స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రకృతి విధ్వంసంపై మౌనం వహించడానికి కారణమేంటి..? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకాల్సిన అవసరం కూడా లేకపోలేదు.
The past destruction of ‘Pattipaka’.. is a warning..!
మేల్కొనకపోతే నష్టం తప్పదు…
మైనింగ్ నిబంధనల ప్రకారం (Mining Acts and Rules), ఒక గుట్టను తవ్వేటప్పుడు నిర్దేశించిన లోతు కంటే ఎక్కువ తవ్వకూడదు. కానీ పత్తిపాకలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. గతంలో క్రషర్ పెట్టన గుట్ట కనుమరుగవ్వడమే ఇందుకు సాక్ష్యంగా చూడాలి. ప్రస్తుతం సర్వే జరుగుతున్న గుట్టలు కూడా కేవలం రాళ్ల కుప్పలు కావు. అవి స్థానిక పర్యావరణ వ్యవస్థకు పట్టుగొమ్మలు అని మరువొద్దు. అంతేకాదు గుట్లు కనుమరుగైతే వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గం ఉండదు. భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తప్పదు. క్రషర్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. పంటపొలాలకు నష్టం ఏర్పడుతుంది. పశువుల మేతకు, పక్షుల ఆవాసానికి ఈ గుట్టలే ఆధారం. ఇవి లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఒకరకంగా ఊరి స్వరూపం ఆనవాళ్లు చరిత్రలో మిగులవు. అందుకోసమే “అభివృద్ధి” పేరుతో జరుగుతున్న ఈ “వినాశనాన్ని” చూస్తూ ఊరుకుంటే, రేపటి తరం పత్తిపాక మ్యాప్‌లో గుట్టలను కేవలం ఫోటోల్లోనే చూడాల్సి వస్తుంది.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్ సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
