పత్తిపాక ‘స్టోన్ క్రషర్’ పై ‘శ్వేతపత్రం’ ప్రకటించాలి
‘The more you dig, the more new questions arise’ : అభివృద్ధి పేరిట సాగుతున్న అక్రమ మైనింగ్ దందా ఒక గుట్టను మింగేసింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో సుమారు గత దశాబ్దంన్నర కాలానికి పైబడి సాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ నిర్వహణ తీరు చూస్తుంటే, అక్కడ ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్నాయా లేక మైనింగ్ మాఫియా కబంధ హస్తాల్లో అధికారులు చిక్కుకున్నారా అన్న అనుమానం కలగక మానదు. ఒకప్పుడు గంభీరంగా కనిపించిన గుట్ట ఇప్పుడు కనుమరుగై, పాతాళమంత లోతులో అగాధంగా మారిందంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
‘The more you dig, the more new questions arise’..!?
ఈసారి కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గమైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పలువురు రైతులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం. సహజ వనరుల పరిరక్షణ వేదిక ప్రతినిధులు, గ్రామంలోని ఆలోచనపరులు, వివిధవర్గాల ప్రజలు గళం విప్పడంతో ఈ అంశం మీడియా దృష్టికి వెళ్లి చర్చనీయాంశంగా మారింది.
ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రతినిధి బృందం కలిసి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సంబంధిత శాఖలకు వినతిపత్రాలు అందించారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, మండల తహసీల్దార్ స్టోన్ క్రషర్ ను సందర్శించి పరిశీలించారు. అయితే ఈ పరిశీలనలు కేవలం “కంటితుడుపు” చర్యలుగానే మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తున్నదే తప్ప, వాస్తవాలను బయటపెట్టడంలో వారు అంతగా శ్రద్ధపెట్టడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. తనిఖీలు చేసిన అధికారులు వివరాలు వెల్లడించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి..? అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
‘The more you dig, the more new questions arise’..!?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా క్రషర్ లేదా క్వారీ నడవాలంటే మైనింగ్ శాఖ నుండి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన అనుమతి పత్రాలు ఉండాలి. పత్తిపాకలో నడుస్తున్న ఈ క్రషర్ అనుమతి పత్రాల పరిస్థితి ఏంటీ..? అవి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు చెల్లుబాటులో ఉన్నాయి..? గత దశాబ్ధంన్నర విషయం పక్కనపెటిన్నప్పటికీ గత ఐదేళ్ల కాలంలోనైనా ఈ క్రషర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజీ, ఇతర పన్నుల వివరాల రశీదులను బహిర్గతం చేయాల్సిన బాధ్యత మైనింగ్ శాఖపై ఉంది. ఆ క్రషర్ నిర్వహకులపై కూడా ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం క్రషర్ల నుండి వెలువడే దుమ్మును అరికట్టడానికి నీటి తుంపర్లు మరియు గ్రీన్ బెల్ట్ (మొక్కలు నాటడం) తప్పనిసరి. కానీ పత్తిపాకలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. స్టోన్ క్రషర్ విచ్ఛలవిడిగా బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల శబ్ద కాలుష్యం, భూగర్భ జలాలు తగ్గిపోవడంపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ ఇచ్చే నాథుడే కరువయ్యారు.
‘The more you dig, the more new questions arise’..!?
నిర్ణీత విస్తీర్ణం కంటే అదనంగా మైనింగ్ చేయడం తీవ్రమైన నేరం. గత ఐదేండ్లలో ఈ క్రషర్ల వద్ద మైనింగ్ శాఖ అధికారులు నిర్వహించిన డ్రోన్ సర్వేల నివేదికలు ఏం చెబుతున్నాయి..? అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ లోతుకు వెళ్లడం లేదా పక్క భూముల్లోకి చొచ్చుకుపోవడం వంటివి ఏమైనా జరిగాయా..? జరిగితే, ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు చేపట్టారు…? పత్తిపాక గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ క్రషర్ కు కేటాయించిన భూమి విస్తీర్ణం ఎంత..? దానికి సంబంధించిన స్కెచ్, సర్వే రిపోర్టులను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. క్వారీలలో పేలుళ్లు జరపడానికి ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ’ (DGMS) నుండి పొందిన అనుమతి పత్రాలు ఈ క్రషర్ల వద్ద ఉన్నాయా..? పేలుడు పదార్థాల వినియోగంపై పారదర్శకత ఉందా..? అక్కడ పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, కనీస భద్రతా ప్రమాణాలు కల్పిస్తున్నారా..? అక్కడి నుంచి తరలిపోతున్న మెటీరియల్ ను లెక్కించడానికి ఆన్ లైన్ వే-బ్రిడ్జ్ ఏర్పాటు చేశారా..? గడిచిన ఐదేండ్ల కాలంలో జారీ చేసిన ట్రాన్సిట్ పర్మిట్స్ (వేబిల్లులు) ఎన్ని..? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ప్రకృతి ఇచ్చిన సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ, పత్తిపాకలో జరుగుతున్న తీరు చూస్తుంటే “కంచే చేను మేసినట్లు” ఉందనేది పరిస్థితి చూస్తే అర్థం అవుతోంది. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి, పైన పేర్కొన్న అన్ని అంశాలపై శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ నిర్వహణ పట్ల గ్రామంలో బహిరంగంగా ‘శ్వేతపత్రం’ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఐక్యతను చాటాల్సి ఉంది. పాత క్రషర్ అనుభవంతో కొత్త క్రషర్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత పాలకవర్గ సభ్యులపై, గ్రామస్తులపై ఉంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు
