
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపణ
The MLA is misleading the people by not having the guts to bring in funds హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకాల వరకు నేషనల్ హైవే మధ్యన చలివాగు బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టీ ఎస్టిఎఫ్ నిధులను 2023 -24 సంవత్సరంలో ఐదు కోట్ల 74 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకాల వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు ఐదు కోట్ల 85 లక్షలు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగినదని తెలిపారు. జరుగుతున్న పనులను ఆపివేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్న తను తెచ్చిన నిధుల విషయంలో అడ్డు తగలకుండా మరికొన్ని నిధులు తెచ్చి శాయంపేట మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్ప తను తీసుకొచ్చిన నిధులను మీరు తీసుకొచ్చినట్టు చెప్పుకోవడం సరైనది కాదని అన్నారు. శిలాఫలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైకు ర్యాలీ నిర్వహించి మైలారం గ్రామం నుండి హుస్సేన్ పల్లి వరకు పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన ఘనత తనదే అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అట్టి పనులను ఆపించడమే కాకుండా ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తూ పనులకు అడ్డుతగులుతూ అడిగిన వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పదవులు శాశ్వతం కాదని తాను ఎన్నో రకాల పదవులు అనుభవించి ఉన్నానని కక్షపూరిత రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నాయకుని వ్యవసాయ భూమి రోడ్డు పక్కన పోతుందని అట్టి రోడ్డును చెరువులోకి మళ్లించి రోడ్డు వేస్తున్నారని ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలియడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు సహకరించని మండల అధికారులను బదిలీలు చేయిస్తున్నారని అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన స్మశాన వాటిక భూమిని కూడా ఆక్రమించుకోవడం చాలా ఘోరమైన పని అని అన్నారు. కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.