DCC వరంగల్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఆయుబ్ తో’ జన నిర్ణయం’ స్పెషల్ కరస్పాండెంట్ ‘దారా’ పెన్ షాట్ ఇంటర్వ్యూ….
“The hands that carry the flag become the leaders!” ఒకప్పుడు పార్టీ జెండా మోసిన సామాన్య కార్యకర్త. నేడు చారిత్రక వరంగల్ జిల్లా కాంగ్రెస్ రథసారథి. పైరవీలతో కాదు, పక్కాగా ప్రజాక్షేత్రంలో ఉండి ఎదిగిన నాయకుడాయన. ‘ఓట్ల రాజకీయం కంటే.. ప్రజల కష్టాలే ముఖ్యం’ అని నమ్మే వ్యక్తి. ఆడంబరాలకు పోకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మహ్మద్ ఆయుబ్, జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. దశాబ్దాల కాలం పార్టీ క్రమశిక్షణ గల సైనికుడిగా, సామాన్య కార్యకర్తగా పనిచేసిన మహ్మద్ ఆయుబ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో వరంగల్ కాంగ్రెస్ కోటలో ఇప్పుడు కొత్త ఉత్సాహం నిండినట్లైందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్న పరిస్థితి. రాజకీయం అంటే అధికారం కాదు.. అదొక బాధ్యత అని నిరూపిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అగ్రనాయకత్వంతో నిత్యసమన్వయం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇటీవలి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ క్రీయాశీలంగా పని చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల నుంచి పార్టీ పెద్దల వరకు మధ్యలో సమన్వయకర్తగా తనదైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ సాధించిన విజయోత్సాహం, అధికార పార్టీపై పెరుగుతున్న అంచనాలు, విపక్షాల విమర్శలు, జిల్లా రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు లాంటి అనేక అంశాలపై ఆయన ‘నేరుగా.. నిక్కచ్చిగా’ స్పందిస్తున్న DCC వరంగల్ జిల్లా అధ్యక్షులు ‘మహ్మద్ ఆయుబ్’ తో ‘జన నిర్ణయం’ స్పెషల్ కరస్పాండెంట్ ‘దారా’ ‘పెన్ షాట్’ ఇంటర్వ్యూ…..
జన నిర్ణయం : ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి నేడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి (DCC) స్థాయికి చేరారు. ఈ ప్రయాణంలో మీ అనుభూతి ఏమిటి..?
మహ్మద్ ఆయుబ్ : ఇది కేవలం నా ఒక్కడి విజయం కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విజయం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నా ప్రయాణమే నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను.
జన నిర్ణయం : మీకు ‘సాఫ్ట్ లీడర్’ అని అంటారు. కానీ రాజకీయాల్లో దూకుడు అవసరం కదా..? దీనిపై మీరేమంటారు..?
మహ్మద్ ఆయుబ్ : నా స్వభావం సాఫ్ట్ కావచ్చు, కానీ నా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అనవసరంగా అరిచేవాడు నాయకుడు కాదు, ప్రజల సమస్యలు తీర్చేవాడే అసలైన నాయకుడు. నా పనితీరులో దూకుడు ఉంటుంది, మాటల్లో కాదు.
జన నిర్ణయం: గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ గెలుపును మీరు ఎలా చూస్తున్నారు..?
మహ్మద్ ఆయుబ్: ఇది ప్రజలు మా ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. జనగామ, తొర్రూరు వంటి చోట్ల హోరాహోరీ పోరులో గెలిచామంటే, అది మా కార్యకర్తల కష్టం మరియు ప్రజల మద్దతు వల్లే సాధ్యమైంది.
జన నిర్ణయం : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ (BRS)గా వారు కాంగ్రెస్ హామీలను సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శిస్తున్నది కదా? దీనిపై మీ కామెంట్..?
మహ్మద్ ఆయుబ్ : పదేళ్లు అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదం. మేము అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన ఈ కొద్ది సమయంలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. విమర్శించే వారు అభివృద్ధిని చూడటం లేదు. ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూస్తున్నారు ఆదరిస్తున్నారు. ఆ ఫలితాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిభింభించిన విషయం తెలిసిందే కదా..?
జన నిర్ణయం : గ్రేటర్ వరంగల్ (GWMC) లో రాబోయే ఎన్నికల కోసం పార్టీని ఎలా సిద్ధం చేస్తున్నారు..?
మహ్మద్ ఆయుబ్: వరంగల్ నగరాన్ని ‘రెండవ రాజధాని’గా తీర్చిదిద్దే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది. నగరాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. డివిజన్ స్థాయిలో నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి మా ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.
“The hands that carry the flag… become the leaders!”
జన నిర్ణయం : జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది, వాటిని ఎలా సమన్వయం చేస్తారు..?
మహ్మద్ ఆయుబ్ : కాంగ్రెస్ ఒక పెద్ద కుటుంబం. ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి భిన్నాభిప్రాయాలు సహజం. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే – ‘కాంగ్రెస్ గెలవాలి, ప్రజలకు మేలు జరగాలి’. జిల్లాలోని సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పోవడం, కలిసిపోవడం నా బాధ్యత. ప్రచారం జరిగినంతగా విబేధాలు లేవు. వరంగల్ లో పార్టీ ఐక్యతతో ఉంది.
జన నిర్ణయం : ముస్లిం మైనారిటీ నాయకుడిగా జిల్లాలోని మైనారిటీల సంక్షేమం కోసం మీరు చేస్తున్న కృషి ఏమిటి..?
మహ్మద్ ఆయుబ్ : కాంగ్రెస్ అంటేనే లౌకిక పార్టీ. కేవలం ముస్లింలనే కాకుండా, అన్ని వర్గాల వెనుకబడిన ప్రజల కోసం పనిచేస్తున్నాం. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వంపై కృషి చేస్తున్నది. అందులో నావంతు చొరవ ఉంటూనే ఉంది. వరంగల్ జిల్లాలో మైనారిటీలు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉన్నారు, ఉంటారు.
జన నిర్ణయం : మీరు పాత వరంగల్ జిల్లా రాజకీయాలను దగ్గరుండి చూశారు. అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు మీరు గమనించిన ప్రధాన వ్యత్యాసం ఏమిటి..?
మహ్మద్ ఆయుబ్ : అప్పట్లో రాజకీయాలు విలువల మీద నడిచేవి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగి, ప్రచార ఆర్భాటం ఎక్కువైంది. గత పదేళ్లలో ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ ఆ పాత ‘ప్రజాస్వామ్య’ సంస్కృతిని తీసుకువస్తున్నాం. నాయకుడు అంటే ప్రజల మధ్య ఉండాలి, కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేస్తే సరిపోదు.
జన నిర్ణయం : జిల్లాలో నిరుద్యోగ యువత చాలా ఆశగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల హామీ నెరవేరుతుందా..?
మహ్మద్ ఆయుబ్ : ఖచ్చితంగా..! మేము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వేల సంఖ్యలో నియామక పత్రాలు అందించాం. గ్రూప్-1, గ్రూప్-4 ఫలితాలు విడుదల చేశాం. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం స్థానికంగా ఐటీ హబ్ (IT Hub) ను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నాం. యువత ఓపిక పట్టాలి, మా ప్రభుత్వం యువతకు అండగా ఉంటుంది.
“The hands that carry the flag… become the leaders!”
జన నిర్ణయం : బీజేపీ జిల్లాలో క్రమంగా బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. హిందూ-ముస్లిం ఓట్ల సమీకరణను వారు తమవైపు తిప్పుకుంటున్నారు కదా… దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు..?
మహ్మద్ ఆయుబ్ : వరంగల్ జిల్లాలో మతతత్వ రాజకీయాలకు తావులేదు. ఇది కాకతీయుల గడ్డ, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. బీజేపీ కేవలం భావోద్వేగాలతో రాజకీయం చేయాలని చూస్తోంది. కానీ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఆకలి తీర్చే అన్నం. మేము చేసే అభివృద్ధి పనులే బీజేపీ మత రాజకీయాలకు సమాధానం చెబుతాయి. నేను జిల్లా అధ్యక్షుడిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం నిరంతరం పనిచేస్తాను.
జన నిర్ణయం : కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు తగిన గౌరవం దక్కడం లేదని ఒక వాదన ఉంది. అధ్యక్షుడిగా మీరు వారి కోసం ఏం చేస్తున్నారు..?
మహ్మద్ ఆయుబ్ : నేనే దానికి ఉదాహరణ. జెండా మోసిన వాడిని కాబట్టే ఇవాళ ఈ కుర్చీలో కూర్చున్నాను. ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడితో సమానం. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. జిల్లా కమిటీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. నామినేటెడ్ పదవుల్లో కూడా కిందిస్థాయి కార్యకర్తలకు అవకాశం కల్పించేలా అధిష్టానం తగు నిర్ణయాలు చేస్తుంటుంది.
జన నిర్ణయం : చివరగా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మైనారిటీ యువతకు మీరు ఇచ్చే సలహా..?
మహ్మద్ ఆయుబ్: రాజకీయాలు అంటే అధికారం కాదు, అదొక బాధ్యత. చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుకోండి. పార్టీ సిద్ధాంతాలను నమ్మండి. అడ్డదారులు తొక్కకుండా కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. కులమతాలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే రాజకీయాల పరమార్థం. పదవుల కంటే ప్రజా సేవ ముఖ్యం. కార్యకర్తలు అధైర్య పడకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి. వరంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎప్పటికీ రెపరెపలాడాలి. రాబోయే కాలంలో ఈ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపేందుకు కృషి చేయాలి.
జన నిర్ణయం : ఓకే ఆయుబ్ గారు ఆల్ ది బెస్ట్….
మహ్మద్ ఆయుబ్ : థాంక్యూ…..
**********
