పత్తిపాక గ్రామ పోరాటానికి సంపూర్ణ మద్దతు
The destruction of mounds must be stopped : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో గుట్టల విధ్వంసాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఒక గుట్టను కనుమరుగు చేసిన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లను తక్షణమే మూసివేయాలని, కొత్తగా పెద్దగుట్టపై మరో క్రషర్ ఏర్పాటు చేసేందుకు కొందరు చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని పత్తిపాక పెద్దగుట్ట వద్ద గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, రైతులు నిరసనకు సహజ వనరుల పరిరక్షణ వేదిక సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నది. ఆ గ్రామంలోని సహజ వనరులను కాపాడుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే ఐక్యతను భవిష్యత్తులోనూ కొనసాగించాలని పిలుపునిస్తున్నాం. ఇప్పటికే రెవిన్యూ, కలెక్టర్ తో పాటు సంబంధితశాఖలకు వారు తమ ఆవేదనను స్టోన్ క్రషర్ వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రాలు అందించారు. పత్తిపాక గ్రామ సహజ వనరుల పరిరక్షణ కోసం పరితపిస్తున్న వారికి రాష్ట్రవ్యాప్త మద్దతు అవసరమని భావిస్తున్నాం. ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలోని పరిశోధకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు పత్తిపాక శివారులో జరుగుతున్న గుట్టల విధ్వంసాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. పత్తిపాకతో పాటు ఆ మండలంలోని వివిధ గ్రామాల్లోనూ ఇదే తరహా స్టోన్ క్రషర్ల నిర్వాహణ, గుట్టల విధ్వంసం జరుగుతున్నది. గుట్టల విధ్వంసం వల్ల పంటపొలాలు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
The destruction of mounds must be stopped
ఇప్పటికే ఒక గుట్ట కనుమరుగు కాగా, కొత్తగా మరోగుట్టకు స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తే మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. గీత కార్మికుల జీవనోపాధి కూడా దెబ్బతింటోందని, క్రషర్ల నుండి వచ్చే ధూళి వల్ల తాటి చెట్లు పాడైపోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని కుంటలు దెబ్బతినడం వల్ల చేపల పెంపకంపై ఆధారపడిన ముదిరాజ్ లు తీవ్రంగా నష్టపోతారని, అక్రమ క్వారీయింగ్ వల్ల పెద్దగుట్ట ఉనికి కోల్పోతోందని, దీనివల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని స్థానికుల ఆవేదనలో న్యాయం ఉంది. తమ జీవనాధారమైన భూములను ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేనప్పటికీ స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం సరైనది కాదని సహజ వనరుల పరిరక్షణ వేదిక భావిస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులు సంబంధితశాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని. ప్రస్తుతం కొనసాగుతున్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లను వెంటనే నిలిపివేయాలని, పెద్దగుట్టపై కొత్త క్రషర్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, గ్రామస్తులకు న్యాయం చేయాలని సహజ వనరుల పరిరక్షణ వేదిక కోరుతున్నది.
దామెర రాజేందర్ (దారా)
సీనియర్ జర్నలిస్ట్,
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు
