- కార్పొరేట్ రంగు పులుముకుంటున్న మేడారం జాతర
- అభివృద్ధి పనులు జాతర సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయనే వాదనలు
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
The changing face of the fair : తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతరకు కౌంట్‌డౌన్ మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల పండుగ కోసం కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం ఈసారి రూ. 251 కోట్ల భారీ బడ్జెట్‌తో జాతరను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. కోయ, ఆదివాసి వంశీయుల చరిత్రను ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నారు. అయితే ఈ అలంకారాలు, హంగులు ఒక ఎత్తేతే మరోవైపు చరిత్రాత్మకమైన వనదేవతల మేడారం జాతర స్వరూపం క్రమంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులు ఓకే అనుకున్నప్పటికీ ఆ అభివృద్ధి పేరుతో మేడారం జాతర కార్పొరేట్ రంగు పులుముకుంటున్నదనే వాదనలో నిజం లేకపోలేదు. చరిత్రకలిగిన మేడారం జాతరను అధునాతన సౌకర్యాలతో దిర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తమవుతూనే ఈ అభివృద్ధి పనులు జాతర సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల వల్ల ఆదివాసిన అస్తిత్వంతో పాటు వనదేవతల జాతరను భవిష్యత్తులో కార్పొరేట్ మయంగా మార్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు సామాన్య భక్తుడి జేబుకు చిల్లు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
The changing face of the fair..!
అభివృద్ధి పనులు – గిరిజన అస్తిత్వంపై ప్రభావం
రూ. 251 కోట్ల బడ్జతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం రూ. 101 కోట్లతో చేస్తున్న గద్దెల విస్తరణ పనులు జాతరకు కొత్త రూపునిస్తున్నా, అది సహజత్వాన్ని దెబ్బతీస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంక్రీట్ కట్టడాల వల్ల అడవి పల్చబడుతోందని, గిరిజన సంప్రదాయాలకు భిన్నంగా జాతర ‘కమర్షియల్’ అవుతోందని పలువురు స్థానిక ఆదివాసీలు, విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.గతంతో పోలిస్తే మేడారం ప్రయాణం ఇప్పుడు సామాన్యులకు పెనుభారంగా మారే అవకాశం లేకపోలేదు. జాతర సమయంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నా, రద్దీ దృష్ట్యా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువ. ఈ క్రమంలో ట్యాక్సీలు, ఆటోలు సాధారణ చార్జీల కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండటం సహజమే. మరోవైపు మేడారం చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, తాత్కాలిక గుడారాల అద్దెలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. గతంలో చెట్ల కింద డేరాలు వేసుకునే వెసులుబాటు ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్థలాలను కూడా వాణిజ్యపరంగా మార్చడంతో సామాన్యుడికి వసతి కష్టమైపోయే పరిస్థితి గతంకంటే ఎక్కుగా ఉంటుంది. “ఒకప్పుడు మేడారం అంటే ఎడ్లబండి కట్టుకుని, ఇంటి నుంచి చద్ది మూటలు తెచ్చుకుని అమ్మవార్లను దర్శించుకునే వారు. కానీ ఇప్పుడు కనీసం తలదాచుకోవడానికి అద్దె గది కావాలన్నా, స్నానం చేయడానికి నీళ్లు కావాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని, భవిష్యత్తులో మరింత కార్పోరేట్ మయం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం వసతులపై దృష్టి పెట్టినట్లే ధరల నియంత్రణపై కూడా దృష్టి సారించాలి.” ఆదివాసీల అస్థిత్వం దెబ్బతినకుండా, వనదేవతల జాతర స్వరూపం దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకరకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, వనదేవతలుగా కీర్తించే సమ్మక్కసారలమ్మ మేడారం జాతర దర్శనం ధనవంతుడికే కాదు, ఆ సరుకు ముల్లె లేని పేదవాడికి కూడా సులభంగా దొరికినప్పుడే అది అసలైన జాతర అవుతుంది.
