‘Thammineni’ experiments are okay…what about party secrecy : భారతదేశ రాజకీయ పటంలో కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సిద్ధాంతం, క్రమశిక్షణ, అంతర్గత గోప్యత అనే మూడు స్తంభాల మీద ఈ పార్టీల నిర్మాణం ఆధారపడి ఉంటుందనేది ఒక సూత్రం. అయితే, మారుతున్న కాలంతో పాటు తెలంగాణ సీపీఎంలో వస్తున్న మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హయాంలో పార్టీ ప్రదర్శించిన అంశాలపై చర్చ జరుగుతోంది. తమ్మినేనితో పాటు మరో ఇద్దరిపై ‘అభిశంసన’ తీర్మానం చర్చకు తెరలేపింది. అయితే ‘అభిశంసన’ చర్యలు ఒకభాగమైతే, ఈ పరిణామక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హయాంలో జరిగిన ప్రయోగాలు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన కమిటీ బాధ్యత, సడలుతున్న పార్టీ గోప్యతపై ఇప్పుడు అసలైన చర్చ జరగాల్సి ఉంది.
‘Thammineni’ experiments are okay…what about party secrecy..!?
కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగం ప్రకారం ఏ సెక్రెటరీ కూడా ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోలేరు. రాష్ట్ర సెక్రెటరీ సారధ్యంలో ప్రవేశపెట్టిన ప్రతి వ్యూహం వెనుక రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గాల ఆమోదం ఉంటుంది. ఈ లెక్కన ఒకవేళ ఆ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే లేదా రాజకీయంగా దెబ్బతీస్తే, దానికి కేవలం అప్పుడు కార్యదర్శిగా ఉన్న తమ్మినేనిని మాత్రమే బాధ్యుడిని చేయడం సమంజసం ఎలా అవుతుంది..? ‘అభిశంసన’ చర్చ సాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కమిటీలో ఉన్న ఇతర సీనియర్ నేతలు ఏం చేశారు..? అనేది ఇప్పుడు కేడర్‌లో, కమ్యూనిస్ట్ అభిమానులు, సానుభూతి పరుల్లో ఎదురవుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్ణయం సరైనది కానప్పుడు అడ్డుకోని నేతలు, ఇప్పుడు అది విఫలమయ్యాక ‘అభిశంసన’ ప్రక్రియను ముందుకు తేవడం ‘సమిష్టి బాధ్యత’ అనే సిద్ధాంతానికి విరుద్ధం కాకుండా ఏమవుతుంది..?
‘Thammineni’ experiments are okay…what about party secrecy..!?
సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలు ఒక నిర్దిష్ట చట్రంలో, పాతకాలపు ఎత్తుగడలతో సాగుతాయనే విమర్శ ఉంటుంది. కానీ తమ్మినేని వీరభద్రం దీనికి భిన్నంగా తనదైన ‘డైనమిక్’ నాయకత్వాన్ని ప్రదర్శించారనే చెప్పాలి. కేవలం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా ‘సామాజిక న్యాయం’ అనే నినాదాన్ని ఎత్తుకోవడం తమ్మినేని చేసిన అతిపెద్ద ప్రయోగం. మహాజన పాదయాత్ర ద్వారా కుల సంఘాలను, దళిత, బహుజన శక్తులను ఎర్రజెండాతో అనుసంధానించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారనేది కూడా మరువొద్దు. సంప్రదాయ పొత్తులకు భిన్నంగా, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) వంటి సరికొత్త ప్రయోగాలు చేయడం ద్వారా పార్టీకి కొత్త వర్గాలను పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. ఇది పార్టీ క్యాడర్లో ఒకరకమైన చలనాన్ని తీసుకువచ్చిందని అప్పట్లో చర్చలు జరిగాయి. దళిత, బహుజన సమస్యలను పార్టీ ప్రధాన ఎజెండాలోకి తెచ్చారు. గతంలో కేవలం “కూలీ, నాలి” సమస్యలకే పరిమితమైన ఎర్రజెండా, ఆత్మగౌరవ పోరాటాలకు కూడా వేదికైంది. 5 నెలల పాటు సాగిన తమ్మినేని యాత్ర సిపిఎంకు ఒక కొత్త ‘మాస్ అప్పీల్’ ఇచ్చింది. తమ్మినేని ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల్లోకి వెళ్లడం పార్టీ ఇమేజ్ను మార్చింది. ఇది ఆయన తీసుకున్న అత్యంత డైనమిక్ నిర్ణయం. అయితే కారణాలు ఏమైనప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కాలక్రమేనా సీపీఎం ఉనికి తగ్గుకుంటూ వచ్చింది. దీంతో ప్రయోగాలు ఫలితాలు ఇవ్వనప్పుడు కాలం గడిచాక సమీక్షించటం వల్ల ఏం ప్రయోజనం..? ఆ నిర్ణయాలు అప్పటి కార్యవర్గం ఆమోదించకుండానే, కేంద్ర కమిటి నాయకత్వానికి తెలియకుండానే అమలు జరిగాయా..? అనేది ఆలోచించాల్సిన అంశంగా చూడక తప్పదు.
‘Thammineni’ experiments are okay…what about party secrecy..!?
ఇక మరో అంశం ఏంటంటే సిపిఎంకు ఉన్న అతిపెద్ద బలం దాని అంతర్గత చర్చల గోప్యత. కానీ ఇటీవల కాలంలో ఈ ‘ఇనుప కవచం’ ముక్కలవుతోంది. సమావేశం లోపల నేతల మధ్య జరిగిన వాదోపవాదాలు, విమర్శలు యథాతథంగా మీడియాకు చేరడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. పార్టీలో తమ పట్టు నిలుపుకోవడానికి లేదా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి కొందరు నేతలే ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని బయటకు పంపుతున్నారా..? అన్నది ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ. కమ్యూనిస్టు పార్టీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా భావన ఉంటుంది. కానీ ఇప్పుడు సాధారణ రాజకీయ పార్టీల వలె లోపలి విషయాలు రచ్చకెక్కడం వల్ల సామాన్య కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోందనే స్పృహ అగ్రనేతలు మరిచారేమో అన్నట్లుగా వ్యవహారం సాగుతున్నది. ఒక నిర్ణయం తప్పని తెలిసినప్పుడు కమిటీలో వ్యతిరేకించకుండా, ఒక వేల వ్యతిరేకించినప్పటికీ చర్చలు జరిగి చివరికి ఆమోదం పొందిన నిర్ణయాలను ఆ తర్వాత ఆ నిర్ణయాల ఫలితం ఇవ్వలేదని భావించినప్పుడు ఆ తప్పును కేవలం వ్యక్తి మీదకు నెట్టివేసి తప్పుకోవాలని చూడటం సంస్థాగత బలహీనతను కూడా సూచిస్తుంది.
‘Thammineni’ experiments are okay…what about party secrecy..!?
మరో అంశం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలలో ‘డెమోక్రటిక్ సెంట్రలిజం’ (ప్రజాస్వామ్య కేంద్రకత) అత్యంత కీలకం. అంటే, చర్చలు నాలుగు గోడల మధ్య లోపల జరగాలి, నిర్ణయం మాత్రమే బయటకు రావాలి. కానీ, సిపిఎం అంతర్గత సమావేశాల్లో జరిగే సుదీర్ఘ చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు యథాతథంగా మీడియాకు చేరడం విస్మయానికి గురిచేస్తోంది. సమావేశం ముగియక ముందే “ఎవరు ఎవరిని నిలదీశారు..?”, “ఎవరిపై వేటు పడబోతోంది..?” వంటి సమాచారం నిమిషాల వ్యవధిలో స్క్రోలింగ్‌లలో కనిపిస్తోంది. పార్టీ ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత అజెండాలను లేదా గ్రూపు రాజకీయాలను నెగ్గించుకోవడానికి కొందరు నేతలే ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని మీడియాకు ఇస్తున్నారా..? అనే సందేహాలు కూడా సహజంగానే కలుగుతున్నాయి. సోషల్ మీడియా యుగంలో రహస్యాలను దాచడం కష్టమైనప్పటికీ, కమ్యూనిస్టు కేడర్ ఆ స్థాయికి దిగజారడం ఆందోళనకరం. అయితే పార్టీ లోపల జరిగే చర్చలు మీడియాకు లీక్ అవ్వడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు ఒకటి, తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లి హైకమాండ్‌పై ఒత్తిడి తేవడం. రెండు, ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడం. ఈ రెండు ధోరణులు ఎవరు అనుసరించినా కమ్యూనిస్టు క్రమశిక్షణకు గొడ్డలి పెట్టు. ఆ పార్టీకి అప్రతిష్ట. ఇలాంటి స్థితిని నిబద్దతతో సమీక్షించుకొని దిద్దుబాటు చేసుకుంటారా లేదా అనేది ఆ పార్టీ అగ్ర నాయకత్వమే తేల్చుకోవాల్సిన అంశం.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
