
నయీంనగర్ “వాగ్దేవి”లో బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని…
హుజూరాబాద్ కు చెందిన సాయి చంద్రిక బీ ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం
రిపబ్లిక్ డే రోజు ఉరేసుకున్నట్లు సమాచారం
మెడికవర్ ఆసుపత్రిలో గుట్టుగా చికిత్స చేయించిన వాగ్దేవి విద్యాసంస్థల యాజమాన్యం…
చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం
మరణం వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అనే అనుమానాలు…
Student suicide హనుమకొండ నయీంనగర్ “వాగ్దేవి”లో బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని జనవరి 26వ తేదీ ( రిపబ్లిక్ డే )న ఫార్మసీ హాస్టల్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాల యాజమాన్యం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించగా ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. మృతురాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన సాయి చంద్రిక అనే విద్యార్థినిగా తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. మెడికవర్ ఆసుపత్రిలో విషయం సేకరించెందుకు మీడియా ప్రయత్నం చేయగా మీడియాను అనుమతించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది. కళాశాల యాజమాన్యం ఇట్టి ఘటనను గుట్టుగా ఉంచెందుకు ప్రయత్నాలు, మంతనాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరణం వెనుక మిస్టరీ..!?
బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని కళాశాల హాస్టల్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటుచేసుకోవడం పట్ల పలువురు కలవరపడుతున్నారు. సాయి చంద్రిక అనే విద్యార్థి మరణం వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం బట్టబయలు చేసేలా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.