
- ఇష్టారాజ్యంగా “స్టోన్ క్రషర్లు”..!
- హనుమకొండ జిల్లాలోని ఆత్మకూర్, శాయంపేట మండలాల్లో ఇష్టారాజ్యంగా బోర్ బ్లాస్టింగ్స్..!
- గాలి, నీరు, నేల కలుషితం
- స్టోన్ క్రషర్లతో బతకలేం అంటున్న ఆయా గ్రామాల జనం
- ఆత్మకూర్ మండలంలో గురువారం “నక్షత్ర స్టోన్ క్రషర్” చేసిన బోర్ బ్లాస్టింగ్ ఇందుకు సాక్ష్యం
- ఆందోళన చెందిన మల్కపేట గ్రామస్తులు
- ఇదే తరహాలో ఆత్మకూర్, శాయంపేట మండలాల్లోని క్రషర్ల తీరు
- ఆఫీసుల్లో అధికారులు నిద్రపోతున్నారంటున్నారా అని ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు
Stone crushers pollution కొండల్ని పిండి చేసేస్తున్నారు. నేల, నీరు కూడా కలుషితమవుతున్నా వారికి లెక్కేలేదు. నిబంధనలకు తూట్లు పొడువడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇదీ హనుమకొండ జిల్లా ఆత్మకూర్, శాయంపేట మండలాల్లోని స్టోన్ క్రషర్లు పరిస్థితి. క్రషర్లు, ఆ క్రషర్లలో పేల్చే బ్లాస్టింగ్స్, హాట్ మిక్స్ ప్లాంట్లతో గాలి, పొలాలు, నీటి వనరులూ కాలుష్యం బారిన పడుతున్నాయి.
Stone crushers
స్టోన్క్రషర్లు, హాట్మిక్స్ ప్లాంట్ల నిర్వహణ, ఏర్పాటు, నిబంధనల అమలును పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్తు శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాలు పర్యవేక్షించాలి. కానీ నిబంధనల అమల్లో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మకూర్ మండలంలోని కొత్త గట్టు, మల్కపేట, శాయంపేట మండలాల్లోని పత్తిపాక శివారులోని స్టోన్ క్రషర్లే ఇందుకు సాక్ష్యం. ఈ మండలాల్లోని పలు చోట్ల ఉన్న క్రషర్లు కూడా ఇదే తరహాలో సాగుతున్నాయి.ఈ స్టోన్ క్రషర్ల వల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
- అధికారులు ఆఫీసుల్లో నిద్రపోతున్నారా…?
రహదారులు, ఇళ్ల నిర్మాణానికి కంకర, డస్ట్ చాలా ముఖ్యమే కానీ వాటి తయారీలో జరుగుతున్న లోపాలే ఇబ్బందికరంగా మారుతున్నాయి. జనావాసాలు, నీటివనరుల దగ్గర కంకర మిల్లుల వల్ల సమస్య వస్తోంది. ఈ మండలాల్లోని క్రషర్లతో పర్యావరణానికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యానికి నష్టం జరుగుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. విచ్చలవిడిగా బ్లాస్టింగ్స్ జరుగుతుంటే, నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు నిర్వహించబడుతుంటే, నిబంధనలు తుంగలో తొక్కి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే “అధికారులు తనిఖీలు చేయకుండా ఆఫీసుల్లో నిద్రపోతున్నారా”..? అనే సందేహాలు, ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. క్వారీల పేలుళ్ల వల్ల ఇళ్లు బీటలువారుతున్నాయని కొందరు, దుమ్ముతో తమ జీవనం దుర్భరంగా మారుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాతిపొడి, దుమ్ము పొలాల్ని ముంచెత్తడం వల్ల సరైన దిగుబడి రావట్లేదని పలువురు రైతులు ఉసూరుమంటున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆత్మకూర్ మండలంలోని కొత్త గట్టు మల్కపేట శివారులోని నక్షత్ర స్టోన్ క్రషర్. గురువారం ఆ స్టోన్ క్రషర్ చేసిన బ్లాస్టర్ వల్ల మల్కపేట గ్రామస్తులు ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నట్లు ఆ గ్రామస్థులు కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కసారిగా దుమ్ము ఆ గ్రామాన్ని కమ్మేసిందని, చిన్న పిల్లలు ఊపిరాడని స్థితికి చేరుకున్నారని తెలిపారు. ఇది నిత్యకృత్యంగా మారిందని ఆవేదన చెందారు.
ఈ బ్లాస్టింగ్ లతో వచ్చే దుమ్ము, ధూళితో నిత్యం నరకం అనుభవిస్తున్నామని, దుమ్ము పడడం వల్ల తిండి కూడా తినలేకపోతున్నామని, పంటల దిగుబడి తగ్గుతోందని, అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన చెందారు. ఇది ఒక్క మల్కపేట గ్రామస్తుల పరిస్థితే కాదు… ఒక్క నక్షత్ర స్టోన్ క్రషర్ ఘనకార్యం మాత్రమే కాదు… శాయంపేట మండలంలోని పత్తిపాక శివారులోని స్టోన్ క్రషర్ తో పాటు ఆత్మకూర్ శాయంపేట మండలాల్లో ఉన్న మిగతా స్టోన్ క్రషర్ల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉందనేది గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి నిబంధనలు తుంగలో తొక్కుతున్న స్టోన్ క్రషర్లపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.